బినామీలతో మోదీ దంగల్..
బినామీలతో మోదీ దంగల్
గెలిచేది ఎవరు.. నిలిచేది ఎవరు..
బ్లాక్ మనీ వేట పూర్తయింది.. నోట్ల రద్దు కథ ముగిసింది.. ఇప్పుడు బినామీలతో యుద్ధానికి సిద్ధమయ్యారు ప్రధాని నరేంద్రమోదీ.. బ్లాక్ మనీ వేట, నోట్ల రద్దు వ్యవహారాలతో తలబొప్పికట్టి చతికిల పడిన మోదీ మహాశయకు బినామీల బెండు తీయడం సాధ్యపడుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.. ప్రపంచంలోనే మహా ముదుర్లుగా పేరు తెచ్చుకున్న మన రాజకీయ నాయకుల బినామీలను టచ్ చేసే దమ్మైనా మోదీకి ఉందా అనే డౌట్ బిగ్ సౌండ్ చేస్తోంది.. రాజకీయనాయకుల నీడలుగా.. వాళ్లు దోచి, దాచుకున్న సొమ్ముకు జాడలుగా ఉన్న బినామీలపై విల్లు ఎక్కుపెట్టిన మోదీ సరిగ్గా టార్గెట్‌ను కొట్టగలరా? అనే ప్రశ్నకు లైక్ కొట్టేవాళ్లు కరువయ్యారు.. కమాన్ మోదీ.. యు కెన్ డూ ఇట్ అనే నినాదాలు మచ్చుకు కూడా వినిపించడం లేదు.. నోట్ల రద్దు అంటూ జనాన్ని రోడ్డున పడేసిన అనుభవాలే మోదీకి ఇప్పుడు మైనస్‌గా కనిపిస్తున్నాయి.. ఈ చట్టం పేరు చెప్పి మోదీ హంగామా చేయడం తప్ప ఏదీ సాధ్యం కాదనే మాట ఘంటాపథంగా చెబుతున్నారు జనం..
బిల్లు రూపంలోకి వచ్చిన బినామీ చట్టం
గత ఏడాది పార్లమెంట్‌లో పాసైన బినామీ లావాదేవీల నిరోధక సవరణ బిల్లు చట్టరూపంలోకి వచ్చింది.. బినామీ లావాదేవీలకు పాల్పడితే ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష తప్పదని ఇన్‌కమ్ టాక్స్ విభాగం హెచ్చరించింది. బినామీ దారులు, లబ్ధిదారులతో పాటు వారికి సహకరించిన ప్రతీ ఒక్కరూ ఈ బిల్లు ప్రకారం చిప్పకూడు తినక తప్పదు.. జైలు శిక్షతో పాటు బినామీ ఆస్తికున్న మార్కెట్ విలువలో 25 శాతాన్ని పెనాల్టీగా చెల్లించాలి.. బినామీ చట్టం కింద తప్పుడు సమాచారం ఇస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, బినామీ ఆస్తికుండే మార్కెట్ విలువలో 10 శాతాన్ని కట్టాల్సిందే..
1961 నుంచే చట్టం..
ఐతే బినామీల నిరోధక చట్టం 1961 నుంచే అమలులో ఉన్నా దానిని చిత్తశుద్ధితో సక్సెస్ చేసిన సర్కార్ లేదు.. ఇప్పుడు మోదీ కొరఢా ఝలిపిస్తే, రూల్స్ టైట్ చేస్తే మన బినామీలు ఎంతగా వణికిపోతారన్నదే కీలకంగా మారింది.. ఎందుకంటే వ్యాపారవేత్తలకు బినామీల అవసరం అంతగా ఉండదు.. వాళ్ల లెక్కలకు, అకౌంట్లకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.. ఎటొచ్చి ఈ చట్టం అమలులోకి వస్తే ఉచ్చు బిగిసేది బినామీలపై ఆధారపడే రాజకీయనాయకులకే.. మన దేశంలో సర్పంచ్ మొదలుకొని పెద్ద పెద్ద పదవులు చేపట్టిన వారి వరకు బినామీలను మెయిన్ టెన్ చేస్తున్నారు.. చాలా మంది నేతలకు జనం నోళ్లలో ఉన్న ఆస్తులు కాగితాల మీద కనిపించవు.. తమ ఇంట్లోని పనిమనుషులు, డ్రైవర్లు, అటెండర్లు, బంధువుల పేర్లతో ఆస్తులను బదలాయించడం రాజకీయ బకాసురులకు తెలిసినంతగా మరెవరికీ తెలియని విధ్య.. మరి బినామీ లావాదేవీల చట్టం వీళ్ల పని పడుతుందా అన్నదే వేచి చూడాల్సిందే.. అంతేకాదు ఎన్నికల సంఘం విధించిన పరిమితులను పాటిస్తే ఏ రాజకీయనాయకుడు ఎలక్షన్‌లలో పోటీ చేయలేడు.. బినామీల దగ్గరున్న నల్లధనాన్ని వాడుకోవాల్సిందే.. ఆ నల్లధనం మళ్లీ సంపాదించడానికి జనాన్ని దోచాల్సిందే.. 70 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో అంతులేకుండా సాగుతున్న అధికార దోపిడీ కథ ఇది.. పార్టీ ఏదైనా, విధానం మాటెలా ఉన్నా బినామీలు, బ్లాక్ మనీ విషయంలో మాత్రం అందరిదీ ఒకే దారి.. ఇందుకు ఐటీ లెక్కలే సాక్ష్యం.. బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద గత ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి దాకా 235 కేసులను నమోదు చేశామనీ, 55 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేశామని ఐటీ విభాగం చెబుతోంది.. అలాగే 200 కోట్ల రూపాయల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించి 140 కేసుల్లో నోటీసులు జారీ చేశామని కూడా చెబుతున్నారు ఐటీ అధికారులు.. మరి ఇంతగా వేళ్లూనుకున్న బినామీ వ్యవస్థను ఢీకొట్టడం సాధ్యమేనా? మన రాజకీయ దేశముదుర్స్‌తో దంగల్ మోదీకి సాధ్యమేనా? గెలిచి నిలవగలరా? డియర్ మోదీజీ బ్లాక్ షీప్స్ భరతం పట్టడం సాధ్యమని మీరు అనుకుంటున్నారా? ప్రధాని వీరాభిమానులారా మోదీ సాధిస్తారని మీరు చెప్పగలరా? కమాన్ డేర్ టు లైక్..
No comments