బాబుని కడిగేసిన జగన్…
ఆంధ్రప్రదేశ్ అంతా ఊహాజనితంగా అభివృద్ధి సాధిస్తుందని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. కేవలం మాటలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రం ఏర్పడి మూడేళ్లవుతున్నా ఏపీ సర్కార్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోయిందని జగన్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగన్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని ఊదరగొట్టిన ప్రభుత్వం ఈ రెండేళ్లలో 15 లక్షల కోట్ల రూపాయల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామనిర ఇందులో 4.67 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలపై సంతకాలు చేశామని, లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయని కూడా ప్రభుత్వం చెబుతోందని, కాని వాస్తవ పరిస్థితులు చూస్తే కేవలం 4,138 కోట్ల రూపాయల పెట్టుబడులతోనే పరిశ్రమలు వచ్చినట్లు సామజిక, ఆర్థిక సర్వే ద్వారా తెలుస్తోందన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులకు రుణాలను ఇవ్వకపోవడం దారుణమన్నారు. దీంతో రుణభారం పెరిగిందని జగన్ ఆవేదన చెందారు. ఎలాంటి స్టోరేజీ సామర్ధ్యం లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్న జగన్ పట్టిసీమను ఇందుకు ఉదాహరణగా చూపారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీల నీటిని లిఫ్ట్ చేశారని అడిగితే 54 టీఎంసీలు లిఫ్ట్ చేశామని మంత్రి చెబుతున్నారని, 48 టీఎంసీలేనని ఎస్ఈ చెబుతున్నారన్నారు. ఈ ప్రాజెక్టుకు అయిన విద్యుత్తు బిల్లులు చూస్తే 135.46 కోట్ల రూపాయలు వచ్చాయని, వాటి ఆధారంగా చూస్తే కేవలం 42 టీఎంసీలనే లిఫ్ట్ చేసినట్లు అర్ధమవుతుందన్నారు. పట్టిసీమ నుంచి నీటిని తీసుకొచ్చి కృష్ణా నది ద్వారా సముద్రంలో కలుపుతున్నారన్నారు. పట్టిసీమ విద్యుత్తు బిల్లులకు వెచ్చించిన మొత్తాన్ని పులిచింతల నిర్వాసితులకు చెల్లించనట్లయితే పులిచింతలో 45 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వీలుండేదని జగన్ అన్నారు. పంటలను కాపాడలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వైఎస్ హయాంలో 80 శాతం పూర్తయిన ప్రాజెక్టుల పనులు చేసి తామేదో పూర్తి చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని పాలించడానికి ఇచ్చింది ఐదేళ్లు గడువే అయినా 2050 వరకూ ఊహాజనితంగా అంచనాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
No comments