1

Breaking News



ఐజీ గన్‌మెన్.. సీఎం గన్‌మెన్‌గా హల్‌చల్..




అతనో గన్‌మెన్.. బారు కెళ్లి ఠండా బీర్ ఆర్డర్ చేశాడు.. బేరర్ తెచ్చిన బీరు చిల్డ్‌గా లేకపోయేసరికి గన్‌మెన్‌ గరమైపోయాడు.. సీఎం గన్‌మెన్‌ను నాకే ఇలా సప్లై చేస్తావా అంటూ చెలరేగిపోయాడు.. బారు నిర్వాహకులపై దాడికి పాల్పడ్డాడు.. ఇంతా చేసి ఊరుకున్నాడా అంటే అదీ లేదు.. ఎక్కడ బార్ వాళ్లు పోలీసులకు కంప్లయింట్ చేస్తారో అనుకొని తానే ఆ పని చేశాడు.. తన బంగారు గొలుసును బార్ నిర్వాహకులు లాక్కున్నారంటూ ఇన్నోసెంట్ ఫేస్‌తో కంప్లయింట్ ఇచ్చాడు..

మేడిపల్లిలో ఘటన..

మేడిపల్లి బోడుప్పల్‌ రోడ్డులో ఉన్న స్వాగత్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కి ఆదివారం మధ్యాహ్నం జనార్దన్‌ అనే కానిస్టేబుల్‌ కొందరు మిత్రులను కలిసి వెళ్లాడు.. బీరు కావాలని కోరాడు.. బీరు చల్లగా లేకపోవడంతో వాగ్వాదానికి దిగాడు. నిర్వాహకులను తీవ్ర పదజాలంతో దూషించాడు.. ‘నన్ను ఏమనుకుంటున్నారురా.. మేము ముఖ్యమంత్రి గన్‌మెన్‌లమంటూ బెదిరింపులకు దిగాడు.. నిర్వాహకులపై చేయి కూడా చేసుకున్నారు. తర్వాత కానిస్టేబుల్‌ మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. బార్‌ నిర్వాహకులు తన గొలుసు కొట్టేశారని ఫిర్యాదు చేశారు. పోలీసులు బార్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బైటకు వచ్చింది.. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు చూపించారు బార్ నిర్వాహకులు.. దీంతో జనార్దన్‌తో పాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఐతే సీఎం గన్‌మెన్ అంటూ రెచ్చిపోయిన జనార్దన్‌ ఐఎస్‌డబ్ల్యూ కానిస్టేబుల్‌గా గుర్తించారు.. ప్రస్తుతం జనార్దన్‌ ఓ ఐజీ గన్‌మెన్‌గా పని చేస్తున్నారని వెల్లడైంది..

No comments