1

Breaking News

editorial


పాక్ సమస్య

గత వారం వాస్తవాధీన రేఖ సమీపంలో జరిగిన రెండు సంఘటనలతో భారత, పాకిస్థాన్‌ల మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. నిజానికి జనవరి 6న జరిగిన సంఘటనకు ఈ రెండు దేశాలూ పరస్పర విరుద్ధ భాష్యాలు చెబుతున్నాయి. 6వ తేదీన యూరీ సెక్టార్‌లోని ఓ పాకిస్థానీ సైనిక స్థావ రం మీద భారత సైన్యం దాడిచేసి ఓ సైనికుడిని హతమార్చింది. దానికి ప్రతీకారంగా జనవరి 8న వాస్తవాధీన రేఖకు భారత్ వైపున ఉన్న మేంధార్‌లో ప్రాంతంలో ఓ సైనిక స్థావరం దగ్గర రెండు దేశాల సైనికుల మధ్యా కాల్పులు జరిగినప్పుడు, పాక్ సైనికులు ఇద్దరు భారతీయ సైనికులను హతమార్చడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరగడం సాధారణ విషయమే కానీ అవి చేయి దాటి పోకుండా ఉభయ పక్షాలూ చర్యలు తీసుకునేవి.

ఈసారి కూడా అదే జరిగేది కానీ, మేంధర్ సంఘటనలో భారతీయ సైనికుల మృతదేహాల తలలను నరికేయడం సమస్యకు కారణం అయింది. తాము ఈ పని చేయలేదని పాకిస్థాన్ వెంటనే ఖండించింది. కానీ, పాక్ సైనికులు, పాక్ ప్రభుత్వ మద్దతు ఉన్న ఉగ్రవాదులు గతంలో అనేక పర్యాయాలు ఇటువంటి పనులకు ఒడిగట్టారు. సహజంగానే ఇటువంటి ఘాతుకాలు భారత ప్రజలను రెచ్చగొట్టాయి. పాకిస్థాన్ సైనికులు తరచూ వాస్తవాధీన రేఖను ఉల్లంఘించడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో పరస్పర ధూషణలకు దిగడం దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ తీయడం ఖాయం..

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి, అపార్థాలు తొలగించుకోవడానికి వివిధ స్థాయిలలో చర్చలు జరపడం మంచిది. పరిస్థితిని చేయి దాటి పోనివ్వడం శ్రేయస్కరం కాదు. పాకిస్థాన్‌కు అంతర్గతంగా తప్ప భారత్ నుంచి ఎటువంటి సమస్యా ఎదురు కాదని ఆ దేశానికి నచ్చజెప్పగలగాలి. పాక్ పాలిత కాశ్మీర్‌లోకి ఒక వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో ప్రవేశించడం, దరిమిలా వాస్తవాధీన రేఖకు ఉత్తరంగా బంకర్లు నిర్మించడానికి భారత్ చర్యలు తీసుకోవడం ఈ రెండు దేశాల మధ్య కాల్పులను ప్రేరేపించింది. వాస్తవాధీన రేఖ వద్ద బంకర్ల వంటి నిర్మాణాలు జరపకూడదని 2003లో ఒప్పందం జరిగింది. భారత్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాక్ ఆరోపించింది. అయితే, ఈ బంకర్లు వాస్తవాధీన రేఖకు దగ్గరగా లేవని, దూరంగా ఉన్న గ్రామంలో ఉన్నాయని, వీటి వల్ల పాకిస్థాన్‌కు ఎటువంటి ముప్పూ లేదని భారత్ వాదించి, తన నిర్మాణాలను కొనసాగిస్తోంది. ఈ నిర్మాణ కార్యక్రమాలను భారత్ ఆపేయాలంటూ పాకిస్థాన్ ఒత్తిడి తెస్తోంది. కాల్పుల సంఘటనల తరువాత భారత, పాకిస్థాన్ దేశాల మధ్య తిరిగే బస్సులను కూడా నిలిపేయడం జరిగింది.

భారత్‌పై కాల్పులు జరిపిన పాకిస్థానీ సరిహద్దు కార్యాచరణ బృందంలో సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారని సైనికాధికారులు చెబుతున్నారు. వారే ఈసారి దాడులకు ఒడిగట్టారని వారు వివరించారు. గతంలో కూడా వాస్తవాధీన రేఖకు సమీపంలోని కార్నా అనే ప్రాంతంపై ఈ కార్యాచరణ బృందానికి చెందిన సైనికులు దాడి చేసి, ఇదే విధంగా ఇద్దరు భారతీయ సైనికుల తలల్ని నరికేశారని అధికారులు చెప్పారు. కాగా, భారత్, పాకిస్థాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడాన్ని గమనించిన అమెరికా ఉభయ దేశాల అధికారులూ వెంటనే చర్చలకు ఉపక్రమించాలని సూచించింది. ఈ రెండు దేశాల రాయబారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి కూడా.

వాస్తవానికి ఈ రెండు దేశాల మధ్యా ఇటీవలి కాలంలో సంబంధాలలో పురోగతి కనిపించింది. వాణిజ్యం పెరిగింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు ఈ దేశాలు వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాల మీద దృష్టి పెట్టాల్సి ఉంది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతూ, ఉపఖండంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న సమయంలో ఉద్రిక్తతలు పెట్రేగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ దేశాల మీదే ఉంది.

కాగా, ఉద్రిక్తతలను సడలించడానికి ఈ రెండు దేశాలూ కృషి చేస్తున్నాయని, పరిస్థితి చేయి దాటి పోయే అవకాశమే లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బాని ఖర్ హామీ ఇచ్చారు. భారత్ కూడా ఈ విషయంలో సంయమనం పాటించింది. వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన సంఘటనలపై ఈ రెండు దేశాలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం కూడా పరిస్థితిని విషమించేటట్టు చేసింది. భారతీయ అధికారుల వాదన ప్రకారం, వాస్తవాధీన రేఖ వద్ద గానీ, సరిహద్దుల వద్ద గానీ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడల్లా దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించడం జరుగుతోంది. అందువల్ల పాకిస్థాన్ సైనికులు దాడి చేసినప్పుడు వెంటనే ఎదురు దాడులు జరపడం అనివార్యంగా మారింది.

పాక్ సైన్యంలో ఉగ్రవాదులు, జిహాదీలు చేరినప్పుడు మాత్రమే వారు భారతీయ సైనికులను తల నరకడమో, శరీరాలను ఛిద్రం చేయడమో జరుగుతోందని సైనికాధికారులు వాదిస్తున్నారు. మొదట పాకిస్థాన్ సైనికులు కాల్పులు ప్రారంభించిన తరువాతే భారతీయ సైనికులు కాల్పులు జరిపారని భారత్ వాదిస్తుండగా, భారతీయ సైనికులే ఉత్తి పుణ్యానికి తమ సైనికుల మీద దాడులకు దిగినట్టు పాక్ వాదిస్తోంది. ఈ సంఘటనలపై ఐక్యరాజ్య సమితి ద్వారా విచారణ జరిపించాలన్న పాక్ డిమాండును భారత్ తోసిపుచ్చింది. ఏది ఏమైనా అమెరికా చొరవ తీసుకోవడం, ఉభయ దేశాలూ సంయమనం పాటించి చర్చలకు ఉపక్రమించడం హర్షణీయం.

No comments