1

Breaking News

ప్రకటన చేయవలసిన అవసరం లేదని,.....

నెలరోజుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని, ఆ మేరకు ఒక ప్రకటన చేస్తామన్న కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఇచ్చిన హామీపై సోనియా కోటరీలో విబేధాలు బట్టబయలయ్యాయి. భవిష్యత్తు పరిణామాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక డిమాండ్లు, దానివల్ల యుపీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోకుండా నెలరోజుల్లో పరిష్కరిస్తామని ఎలా చెబుతారని అహ్మద్‌ పటేల్‌, ఆజాద్‌, వయలార్‌ రవి మూకు మ్మడిగా షిండేపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. దాదాపు గంటసేపు వారంతా సీరియస్‌గా చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా సమక్షంలో భేటీ అయిన సీనియర్లు షిండేపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తెలం గాణతో ఇతర రాష్ట్రాల్లోని ప్రత్యేక డిమాండ్లు ముడిపడి ఉన్నా యని, ఇప్పటికే చత్తీస్‌ఘడ్‌ వంటి చిన్న రాష్ట్రాలు శాంతిభద్రతల సమస్యలతో వణికిపోతున్నాయని, రక్షణపరమైన అంశాలు కూడా తెలంగాణతో ముడిపడి ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, తెలంగాణపై నెలరోజుల్లో ప్రకటిస్తామని ఎలా హామీ ఇస్తారని షిండేపై ప్రశ్నల వర్షం కురిపించగా, ఆయన మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌ కూడా షిండే నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ కూడా జైపూర్‌ చింతన్‌శిబిర్‌ ముందు సోనియా సమక్షంలోనే షిండేతో సంవాదానికి దిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. 

కాగా వారి వాదనలు విన్న సోనియా.. కీలకం, సున్నితమైన తెలంగాణ అంశంపై హడావిడిగా నిర్ణయం తీసుకోవడం కంటే, అందరితో చర్చించి పరిష్కార దశకు రావాలని సూచించారు. భాగస్వామ్య పక్షాల అభిప్రాయం కీలకమని, వారిని కాదని సొంత నిర్ణయం తీసుకునే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. వారి వాదనలు సరైనవే అయినందున ఈనెలాఖరులోగా షిండే చెప్పినట్లు నెలాఖరుకు ప్రకటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మీడియాతో షిండే ఏమీ మాట్లాడవద్దని, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కాబట్టి ఆజాద్‌ మాట్లాడతారని సోనియా ఆదేశించారు. ఆ ప్రకారమే సమావేశం ముగిసిన తర్వాత షిండే మౌనంగా వెళ్లిపోగా, ఆజాద్‌ ఒక్కరే మీడియాతో మాట్లాడారు. షిండే చెప్పినట్లు 28లోగా ప్రకటన చేయవలసిన అవసరం లేదని, మరికొంతకాలం సమయం పడుతుందని ఆజాద్‌ చెప్పడం ప్రస్తావనార్హం.

No comments