1

Breaking News

ఈ సంకేతాలు నిజమైనవేనా?

సిగ్నల్స్... సంకేతాలు! ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతల నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇది! తెలంగాణ ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నట్లు అధిష్ఠానమే సంకేతాలు పంపుతోంది. ఈ సంకేతాలు నిజమైనవేనా? లేక గతంలోలాగా రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రతిస్పందన తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమా? ఇవీ... పలువురు నేతలు వ్యక్తం చేస్తున్న సందేహాలు!

తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తలెత్తే రాజకీయ పర్యవసానాలేమిటి? వివిధ పార్టీల్లో గతంలోలాగానే కల్లోలం రేగుతుందా? కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయా ప్రాంతాలప్రజాప్రతినిధులు మౌనం గా చూస్తూ ఉండిపోతారా? వారి ప్రతిస్పందన ఎలా ఉంటుంది? సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే ఏమి చేయాలి? రాష్ట్రంలో ప్రస్తుతం ముక్కుతూ, మూల్గుతూ కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మొదటికే మోసం వస్తుందా? హైదరాబాద్‌లోనూ, సీమాంధ్రలోనూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందా?

అదే జరిగితే ఏమి చేయాలి? ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టుకుని గవర్నర్ నరసింహన్ కోరినట్లుగా రాష్ట్రపతి పాలన విధించక తప్పదా? ఇలాంటి అనేక ప్రశ్నలతో అధిష్ఠానం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ ఒక స్పష్టమైన జవాబు వచ్చిన తర్వాతే కేంద్రం ఒక నిర్దిష్ట ప్రకటన చేస్తుందని.... ఈనెల 26 లేదా 27 తేదీల్లో ఈ ప్రకటనకు ఆస్కారం ఉంటుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ ప్రమాద ఘంటికలు బలంగా మోగుతాయని తెలిసి వస్తే, అధిష్ఠానం లాంఛనప్రాయంగా ఓ ప్రకటన చేసి ఊరుకుంటుందని కూడా ఈ వర్గాలు భావిస్తున్నాయి.

కళ్లముందు కష్టాలు...
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే... దాని అమలులో తలెత్తే ఇబ్బందులు అధిష్ఠానానికి తెలుసునని, వాటిని అధిగమించడంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు లేవని లగడపాటి రాజగోపాల్ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇప్పటికే స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆమోదించినా, ఆమోదించకపోయినా... కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టవచ్చునని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు.

అయితే, అసెంబ్లీలో తీర్మానం వరకు రాకముందే పరిస్థితి అడ్డం తిరగవచ్చునని, రాజీనామాల పర్వం ప్రారంభం కావచ్చునని నిఘా వర్గాలు ఇప్పటికే కేంద్రాన్ని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విషయంపై తెలంగాణకు చెందిన సీనియర్ నేతలతో ఇప్పటికే అధిష్ఠానం చర్చించిందని, ఈ పరిణామాన్ని వారు కొట్టి పారేశారని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేస్తారని... మూకుమ్మడి రాజీనామాలను స్పీకర్ ఆమోదించే అవకాశమే ఉండదని వారు వాదించినట్లు సమాచారం.

అయితే.. విషయం రాజీనామాలకే పరిమితమవుతుందా? ప్రజాందోళనలు జరగకుండా ఉంటాయా? అన్న అనుమానాలను పార్టీ పెద్దలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడితే అడ్డుకోవడంపై సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే చర్చించుకున్నారని తెలుస్తోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (టీడీపీ), లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, అనంత వెంకటరెడ్డి, సాయిప్రతాప్ (కాంగ్రెస్), మేకపాటి రాజమోహన్ రెడ్డి (వైసీపీ) బిల్లును అడ్డుకుంటారని... వీరికి సమాజ్‌వాది పార్టీతోపాటు అనేకమంది ఇతర పార్టీల ఎంపీలు జత కలుస్తారని ఒక ఎంపీ తెలిపారు.

ఎక్కడ... ఏమిటి?
తెలంగాణపై సానుకూలత వ్యక్తం చేస్తే లోపాయికారి ఒప్పందాల మాట ఎలా ఉన్నా... పైకి మాత్రం టీఆర్ఎస్‌ను బేషరతుగా కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కేసీఆర్ ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల తెలంగాణలో కనీసం తమకు రాజకీయ ప్రయోజనాలు లభిస్తాయని అధిష్ఠానం భావిస్తోందని... సీమాంధ్రలో ఎలాగూ దెబ్బతింటామన్న సమాచారం ఇప్పటికే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణకు అనుకూలంగా స్పందించే విషయంలో యువనేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, గ్రామీణాభివృద్ది మంత్రి జైరాం రమేశ్ తదితరులు తటపటాయించిననప్పటికీ... అహ్మద్‌పటేల్, ఆంటోనీ, ఆజాద్ తదితర నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

నిజానికి... తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా నియమించి, ప్యాకేజీ ప్రకటించడంపైనే అధిష్ఠానం తొలుత మొగ్గు చూపిందని, అన్నీ సవ్యంగా జరిగితే ఈనెల 9వ తేదీన కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారని ఒక సీనియర్ నేత చెప్పారు. విలీనానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించడం, తెలంగాణపై తేల్చకుండా రాష్ట్రంలో రాజకీయ సమస్యలకు పరిష్కారం లభించదని ఒక కేంద్ర మంత్రి స్పష్టం చేయడంతో పరిస్థితులు మారాయని విశ్వసనీయవర్గాల సమాచారం.

ఎన్నెన్ని మలుపులో...
కేంద్రం, కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణకు అనుకూలంగా తన ఉద్దేశాన్ని మాత్రమే ప్రకటిస్తుందని... ఆ తర్వాత తలెత్తబోయే పరిణామాల నేపథ్యంలో ఈ ప్రకటన అమలు కావడం సాధ్యపడక పోవచ్చునని రాజకీయ పరిశీలకులు కొందరు భావిస్తున్నారు. ఒక ఉద్దేశాన్ని ప్రకటించడం, అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందడం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టడం, అది కేంద్ర కేబినెట్‌కు రావడం, తర్వాత పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం కావడం, నోటిఫికేషన్ వెలువడడం వంటి చర్యలకు సుదీర్ఘ కాలం పడుతుందని గుర్తు చేస్తున్నారు.

ఒకవేళ 28న ప్రకటన చేసినా ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాకపోవచ్చునని తెలుస్తోంది. అందువల్ల మళ్లీ మే నెల వరకు ఆగాల్సి వస్తుందని, ఈలోపు ఇతర రాష్ట్రాల్లో, సీమాంధ్రలో సమస్యలు ముదిరిపోయి బిల్లు ప్రవేశపెట్టడానికి అనేక కొత్త అవరోధాలు ఏర్పడవచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రానికి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే 28 తర్వాత సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఒకసారి వాయిదా పడితే సమస్యలు తీవ్రతరమవుతాయని ఈ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే, తెలంగాణ ఏర్పడినా, ఏర్పడకపోయినా రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రం మరోసారి సానుకూలత వ్యక్తం చేస్తే తమకు ఏదోరకంగా రాజకీయ ప్రయోజనం లభిస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయని కూడా చెబుతుండటం గమనార్హం. మరోవైపు... తెలంగాణ ఏర్పడి తీరుతుందని, మరో ఆరునెలల్లో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వస్తారని, రాజకీయ పదవులు లభించిన తర్వాత అంతా సద్దుమణుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ తాత్కాలికంగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని కొందరు, ఢిల్లీ హోదా లభిస్తుందని మరికొందరు, సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పర్చుకుంటుందని ఇంకొందరు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడుతుందని తెలంగాణ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా, హైదరాబాద్ హోదా విషయంలో మాత్రం వారిలో ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ నేతలు, కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగానే ఉంటుందని, సీమాంధ్ర ప్రభుత్వం తాత్కాలికంగానే హైదరాబాద్‌లో కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

No comments