1

Breaking News

ఈ ఏడాది మద్యంపై భారీగా వ్యాట్‌

ఫుల్లు కిక్కు
ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలిన సర్కార్‌ పాడి గేదెలాంటి మద్యంపై కన్నేసింది. పన్నుల రూపంలో మద్యం ధరల ను పెంచి ఖజానాకు కాసులు సమకూర్చుకునే పనిలో పడింది. ఈ దిశ లో భాగంగా గతేడాది నాలుగుసార్లు మద్యం ధరలను, రెండుసార్లు మద్యంపై భారీగా పన్నులను పెంచిన గత సెప్టెంబర్‌లో ప్రీమియం మద్యంపై 12 శాతానికి పన్నును పెంచిన విషయం మరవకముందే డిసెంబర్‌లో అన్ని రకాల మద్యం బ్రాండ్లపై పన్నులమోతను మోగించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది మద్యంపై భారీగా వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను)ను పెంచేసింది. దీంతో లిక్కర్‌ ధరల్లో రూ. 10నుంచి రూ. 15 వరకు మద్యం ప్రియులపై భారం పడింది. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా పెంపుకు నోచుకోని బీర్‌, వైన్‌, లో ఆల్కహాలిక్‌ మద్యంపై ఎకై్సజ్‌ సుంకాన్ని భారీగా పెంచడంతో మందు బాబులకు కిక్కెక్కింది. ఈ తాజా పరిణామాలతో ప్రభుత్వ ఖజానాకు రూ. 1100కోట్ల ఆదాయం చేరనుంది. గతేడాది డిసెంబర్‌లో మద్యం ధరలపై పన్నులను పెంచిన సర్కార్‌ ప్రజలపై ప్రత్యక్షంగా రూ. 550కోట్ల భారాన్ని మోపిన విషయం విధితమే.
కాగా ఇప్పటివరకూ ఎకై్సజ్‌ శాఖలో ఏపిబిసిఎల్‌ నిర్వహిస్తున్న వ్యాపారంపై అమ్మకం పన్ను, వ్యాపార లాభం, అదనపు వ్యాపార మార్జిన్‌, ప్రైవిలేజ్‌ ఫీజుల వసూలు విధానం అమలులో ఉంది.

కానీ ప్రభుత్వం వీటన్నింటినీ ఒకే గొడుగుకింద కు తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి పన్నును ఎగవేసే యత్నాల్లో భాగంగా వ్యాట్‌ పరిధిలోకి తెచ్చింది. ఈ తాజా విలీనంతో వ్యాట్‌ పన్ను మద్యంపై భారీగా పెరిగి ప్రజలకు భారం కానుంది. దీంతో మద్యంపై వ్యాట్‌ను 70నుంచి 190 శాతానికి పెంచారు. 7 రకాల్లో వసూలు చేసే ఈ పన్నును గతంలో ధరలతో సంబంధం లేకుండా అన్నింటిపై 70 శాతంగా విధించేవారు. ఏడాదికి దాదాపు రూ.300కోట్లు ఆదాయపు పన్నును మిగుల్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ త్తును తెరపైకి తెచ్చింది. ప్రతి మద్యం సీసాపై గతంలో ఎకై్సజ్‌ సుంకం, వర్తకపు లాభం, ముఖ్యమంత్రి సహాయ నిధి, అమ్మకం పన్నులను వేసేవారు. అయితే ఇందులో వర్తక లాభం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌పై పన్ను కట్టాలని ఆదాయపు పన్ను శాఖ ఎప్పటినుంచో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఏడాదికి రూ. 300 కోట్లతో కలిపి, పాత బకాూలు రూ. 1000కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వీటిని ఎగవేసేందుకు ప్రభుత్వం కొత్తగా పన్నిన వ్యూహంలో భాగమే వీటన్నింటిని సరళీకరించి వ్యాట్‌ పరిధిలోకి తేవడం. ఇకపై మద్యం ధరల్లో వర్తక లాభం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌లను వసూలు చేయరు. ఇదే ఆదాయాన్ని పెరిగిన వ్యాట్‌తో సమకూర్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిం చుకుంది. బీరుపై 175 శాతం, ఇతర పానీ యాలపై 150 శాతం వ్యాట్‌ను విస్తరిచారు. గతంలో అమలులో ఉన్న 70 శాతం అమ్మకం పన్ను, 31 శాతం వ్యాపార లాభం, 12.5 శాతం అదనపు ట్రేడ్‌ మార్జిన్‌ కలిపి 113.5శాతం సుంకాన్ని ఇప్పుడా తాజాగా 190 శాతానికి పెంచారు.

దీంతో అదనంగా అన్ని బ్రాండ్లపై 76.5 శాతం అదనపు పన్ను పడనుంది. బీరుపై 113.5 శాతంనుంచి 175 శాతానికి పన్ను ఎగ బాకింది. రాష్ట్ర వ్యాప్తంగా 220 రకాల మద్యంపై ధరల పెరుగుదల నమోదయింది. చీప్‌, మీడియం లిక్కర్‌ బ్రాండ్ల ధరలు క్వార్టర్‌పై రూ. 5, ప్రీమియం బ్రాండ్లపై రూ. 15, బీరుపై రూ. 10, వైన్‌పై రూ. 15 వరకు ధరలు పెరిగాయి.

అదనపు ఉత్పత్తులకు ఉదార అనుమతులు
ఇవేకాకుండా ఈ ఏడాదిలో ప్రభుత్వం అనుమతించిన అదనపు మద్యం ఉత్పత్తుల వాటా 2కోట్ల 52 లక్షల ప్రూఫ్‌ లీటర్లకు చేరుకుంది. రాష్ట్రంలో 29 డిస్టిలరీల ద్వారా మద్యం ఉత్పత్తి జరుగుతోంది. వీటిద్వారా ఏటా 60కోట్ల ప్రూఫ్‌ లీటర్లకు సంబంధించిన మద్యం ఉత్పత్తి అవుతోంది. అయితే డిమాండ్‌ పెరిగి...అమ్మకాల్లో వృద్ది శాతం పెరుగుదల కారణంగా ఈ ఉత్పత్తుల వాటా 69కోట్ల ప్రూఫ్‌ లీటర్లకు చేరుకుంది. దీంతో ఇష్టానుసారం అనుమతులు జారీ చేయడం రివాజుగా మారింది. ఈ ఏడాది జనవరినుంచీ జరుగుతున్న అనుమతుల జాతర తాజాగా 14 జీఓలద్వారా 2కోట్ల 52 లక్షల ప్రూఫ్‌ లీటర్లకు చేరుకుంది. అయితే 6.75 ప్రూఫ్‌ లీటర్ల మద్యంతో ఒక పెట్టె మద్యం అనగా 12 ఫుల్‌ బాటిళ్లు లేదా 24 హాఫ్‌ లేదా 48క్వార్టర్‌ బాటిళ్లను ఉత్పత్తి చేయవచ్చు.

ఈ లెక్కన ఈ అడ్డగోలు అనుమతులతో ఎన్ని కోట్ట మద్యం బాటిళ్లు ఉత్పత్తి అయ్యాయో ఊహకు అందని విషయమే. గత మూడేళ్లుగా అదనపు అనుమతులకు అడ్డగోలుగా అనుమతులు మంజూరీ చేస్తున్న సర్కార్‌ నేటితో 7కోట్ల 75 లక్షల ప్రూఫ్‌ లీటర్లకు అనుమతించింది. గడిచిన రెండేళ్లలో 35 అదనపు అనుమతులకు జీఓలు జారీ చేశారు. వీటిద్వారా 29 డిస్టిలరీలకు ప్రయోజనం చేకూరింది. గత ఆరేళ్లుగా రాష్ట్రంలోని ప్రజల తలసరి మద్యం వినయోగం ఇప్పటికే 71 శాతం పెరిగింది. 2005-06లో 3.77శాతం ఉన్న తలసరి మద్యం వినియోగం తాజాగా 4.47నుంచి 5 శాతానికి మించినట్లుగా తెలుస్తోంది. వీటివిలువ రూ. 2వేలకోట్లకు చేరింది. దీంతో రాష్ట్రంలోని పేదలు..సామాన్యులు మద్యంపై ఖర్చుపెడుతోన్న వ్యయం గమనిస్తే కళ్లు బైర్లు కమ్మడం సహజమే.

అమ్మకాల్లో అగ్రస్థానం
ఇక మద్యం అమ్మకాల విషయానికి వస్తే రాష్ట్రంలో తక్కువ ధరకు లభించే చీప్‌లిక్కర్‌ వినియోగం భారీగా పెరగుతోంది. వీటి అమ్మకాల వాటా మొత్తం మద్యం అమ్మకాల్లో 65శాతానికి మించి ఉంటోంది. 2011-12లో 4కోట్ల 26లక్షల మద్యం పెట్టెల అమ్మకాలు జరగగా అందులో చీప్‌ లిక్కర్‌ 2కోట్ల 33లక్షల మద్యం పెట్టెలు అమ్ముడయ్యాయి. ఇక మద్యం తయారీ విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే రూ.7కు తయారీ అవుతున్న చీప్‌లిక్కర్‌ క్వార్టర్‌ ధర వినియోగదారునికి చేరేసరికి రూ. 50అవుతోంది. అదేవిధంగా రూ. 19కి ఏపిబీసిఎల్‌కు చేరుతున్న బీర్‌ ధర రూ.100కు వినియోగ దారునికి అందుబాటులో ఉంటోంది.

అయితే రాష్ట్రంలో జరుగుతున్న మద్యం విక్రయాలపై దృష్టి పెడితే అనేక రికార్డులను ఎకై్సజ్‌ శాఖ తనకుతానే తిరగరాసుకుంటోంది. ఆబ్కారి ఏడాది ప్రారంభంలోనే ఎకై్సజ్‌ చరిత్రలోనే రికార్డు నమోదయిన విషయం తెలిసిందే. ఒక్క జూలై నెలలోనే రికార్డుస్థాయిలో రాష్ట్రంలో రూ.1814కోట్ల మద్యం విక్రయాలు జరిగి రికార్డు నమోదయింది. ఇక ఎన్నికల నెలల్లో అయితే మద్యం అమ్మకాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. గత మార్చిలో 6 నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో విపరీతంగా జరిగిన మద్యం అమ్మకాల కారణంగా ఒక్కనెలలోనే రూ. 1430 కోట్ల అమ్మకాల వృద్ది సాధ్యమయింది. ఇక ఆ నెలలో 56లక్షల బీరు కేసులు అమ్ముడుకావడం సంచలనం సృష్టించింది.

No comments