1

Breaking News

రాహుల్‌ ఎంపికపట్ల సీఎం హర్షం

అఖిల భారత కాంగ్రెస్‌ ఉపాద్యక్షుడిగా యువనేత రాహుల్‌ గాంధీ ఎంపికైనందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. రాహుల్‌ ఎంపికపట్ల సీఎం హర్షం వ్యక్తంచేస్తూ, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ 2014లో ఘన విజయం సాధిస్తుందన్నారు. దేశ జనాభాలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువత 54శాతం ఉండటం, యువత ప్రతినిధిగా రాహుల్‌ ఉపాధ్యక్ష పదవి చేపట్టేందుకు అధినేత్రి సోనియా అంగీకరించడం ఎంతో హర్షణీయమన్నారు. యువతకు సరైన మార్గదర్శకం చేయడానికి పార్టీని పురోగమింపచేయడానికి రాహుల్‌ నాయకత్వం ఎంతైనా ఉపయోగపడుతుందని సీఎం స్పష్టంచేశారు. అధికారానికి దూరంగా, నిస్వార్ధంగా ప్రజాసేవకే అంకితమైన నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌, ఈ దేశానికి దశ, దిశ నిర్ధేశించగల గొప్ప నాయకుడుగా ఎదుగుతారన్న ధృఢ సంకల్పాన్ని సీఎం వ్యక్తంచేశారు. పేదల సంక్షేమం, దేశ సమగ్రాభివృద్ధి, సమగ్రత, సామాజిక న్యాయం, యువత, మహిళ సాధికారిత వంటి అంశాల పట్ల ఎంతో అవగాహన కలిగిన రాహుల్‌గాంధీ దేశాన్ని ప్రగతి పధంలో నడిపించే కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ బృందంలో కీలకపాత్ర వహిస్తారని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. నిరంతరం త్యాగనిరతితో పదవుల పట్ల ఎటువంటి ఆశ లేకుండా పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపిస్తున్న ఏఐసీసీ అద్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర నాయకులకు సీఎం ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

No comments