1

Breaking News

ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ

ఎంతోకాలం నుంచీ అందరూ అనుకుంటున్నది శనివారం జరిగింది. ఇంతవరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ పార్టీ శనివారంనాడు పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. దీంతో ఆయన హోదా పెరిగి పార్టీలో లాంఛనంగా రెండో స్థానంలోకి వచ్చారు. ఇక్కడ రెండు రోజులపాటు జరిగిన మేధోమథన సదస్సు ‘చింతన్‌ శిబిర్‌’లో ఈ నియామకం జరిగింది. అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నిర్వహించబోయే పాత్రను తర్వాత నిర్ణయిస్తారు. తొమ్మిదేళ్ల కిందట రాజకీయాల్లోకి ప్రవేశించిన 42 ఏళ్ల రాహుల్‌గాంధీని ఉపాధ్యక్ష పదవికి నియమిస్తూ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యూసి) శనివారం ప్రకటన వెలువరించింది. రాహుల్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించే తీర్మానాన్ని సిడబ్ల్యూసి ఏకగ్రీవంగా ఆమోదించింది.

అంతకు ముందు రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు 11 మంది పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో రాహుల్‌ ఒకరిగా ఉన్నారు. ఆయన పార్టీలో కీలక పాత్ర నిర్వహిస్తారని ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఊహాగానాలకు ఈ నిర్ణయంతో తెరపడింది. పార్టీలో ఆయనను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గానో లేదా సెక్రెటరీ జనరల్‌గానో చేయవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో రాహుల్‌ను కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చనే ఊహాగానాలూ వెలువడ్డాయి. 2014 ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీకి ఆయన సారథ్యం వహిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, పార్టీ ఈ రెండు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. ఎందుకంటే... ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించేందుకు పార్టీకి ఈ వ్యవధి ఉపయోగపడుతుంది.

రాహుల్‌గాంధీ నియామకాన్ని ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి జనార్దన్‌ ద్వివేది మాట్లాడుతూ -‘వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ పాత్రను లేదా ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించే విషయాన్ని తర్వాత నిర్ణయిస్తారు’ అని తెలిపారు. చింతన్‌ శిబిర్‌లో (కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సు) సిడబ్ల్యూసి సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ద్వివేది ‘కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియామకం తర్వాత రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీలో నంబర్‌ టూ స్థానాన్ని పొందారు. ఆయనను ఉపాధ్యక్షుడిగా నియమించాలన్న నిర్ణయం పార్టీని ఎంతగానో పటిష్టం చేస్తుంది. అలాగే పార్టీ అధ్యక్షురాలికి కూడా అండదండ నిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ అందరినీ కూడగట్టుకుని వెళ్లే పార్టీ. ఇదొక్కటే అన్ని వర్గాలనూ సంఘటితం చేస్తుంది. అందరికీ ఆమోదయోగ్యుడు. అందరినీ ప్రభావితం చేయగల వ్యక్తి ఆయన. రాహుల్‌ నియామకం లక్షలాదిమంది పార్టీ కార్యకర్తల మనోభావాలకు ప్రతిబింబం’ అని వివరించారు.
ఇటీవలి చరిత్రలో ఉపాధ్యక్షులైన వారిలో రాహుల్‌గాంధీ మూడో వ్యక్తి. ఇంతకు ముందు రాజీవ్‌గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అర్జున్‌సింగ్‌ ఉపాధ్యక్షుడయ్యారు. అలాగే సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో జితేంద్ర ప్రసాద ఉపాధ్యక్షుడయ్యారు. ఇందిరాగాంధీ హయాంలో కమలాపతి త్రిపాఠీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆదివారం జరిగే ఏఐసీసీ సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రసంగించవచ్చని అనుకుంటున్నారు. ఏఐసీసీలో సోనియా మొదట ప్రసంగిస్తారు. రాజకీయ, ఆర్థిక, ఇతర అంశాలపై ఏఐసీసీ ‘జైపూర్‌ డిక్లరేషన్‌’ ప్రకటనకు ముందు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, అనేకమంది సీనియర్‌ మంత్రులు, నాయకులు ప్రసంగిస్తారని భావిస్తున్నారు. ‘పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ పేరును ప్రతిపాదించాలను కుంటున్నానని రక్షణమంత్రి ఆంటోనీ చెప్పారు.

ఎందుకంటే చాలాకాలం నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు దీనిగురించి డిమాండ్‌ చేస్తున్నారు. ఆయనకు ఒక ప్రాధాన్యత కల పదవిని ఇస్తారని మీడియా కూడా చాలాకాలం నుంచి ఊహాగానాలు చేస్తోంది. కాబట్టి రాహుల్‌గాంధీని పార్టీ ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తున్నాను- అని ఆంటోనీ చెప్పారు. ఆంటోనీ ప్రతిపాదనకు సిడబ్ల్యూసి మొత్తం బల్లలు చరిచి తమ మద్దతు తెలిపి, హర్షం ప్రకటించింది. వారి మద్దతు అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇందుకు తన ఆమోదం తెలిపారు. ఆ తర్వాత రాహుల్‌గాంధీ ఈ పదవిని స్వీకరించేందుకు అంగీకరించారు అని ఆంటోనీ చెప్పారు’ అని ద్వివేదీ వివరించారు.లోక్‌సభ ఎన్నికలు ఇంక 16 నెలల్లో జరుగుతాయనగా రాహుల్‌గాంధీ నియామకం జరిగింది. ఈ నియామకం గురించి తెలిసిన వెంటనే చింతన్‌ శిబిర్‌ ఆవరణ బయట ఉత్సాహం పొంగులువారింది.

పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రాహుల్‌ను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. రాహుల్‌గాంధీ నియామకంతో పార్టీలో ప్రధానమైన మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. రాహుల్‌ నియామకం చరిత్రాత్మకం అని కేంద్రమంత్రి సచిన్‌ పైలట్‌ అన్నారు. ఈ నూతన బాధ్యతను నిర్వహించేందుకు రాహుల్‌ అన్ని విధాలా అర్హుడు అని కొనియాడారు. రాహుల్‌కు సన్నిహితుడైన కేంద్రమంత్రి సిపి జోషి మాట్లాడుతూ - ‘ఆయన దేశమంతటా విస్తృతంగా పర్యటించారు కాబట్టి దేశంలోని సమస్యలు తెలుసు’ అన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ యువతకు ప్రాధాన్యమిస్తోందని రాహుల్‌ బృందంలో ఒకరైన జితిన్‌ ప్రసాద్‌ చెప్పారు. శనివారంతో కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజులుగా నిర్వహించిన చింతన్‌ శిబిర్‌ ( మేధోమథనం) ముగిసింది. ఆదివారం ఏఐసీసీ సమావేశం జరుగుతుంది

No comments