1

Breaking News

ఎన్నికలకు పథ నిర్దేశం

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పథ నిర్దేశం చేయడమే లక్ష్యంగా జైపూర్‌లో ‘చింతన్‌ శిబిర్‌’ పేరిట కాంగ్రెస్‌ నేతల మేధోమథనం ప్రారంభమైంది. అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మో హన్‌సింగ్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నించారు. సోనియా తన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. పార్టీకి పూర్వవైభవం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతల మధ్య అనైక్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన అనేక అవకాశాలను ఈ అనైక్యత వల్లే చేజేతులా జార విడుచుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న అవినీతిపై కలవరం వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలనకు శ్రేణులంతా నడుం బిగించాలని పిలుపు ఇచ్చారు.

పార్టీ నేతలు, కార్యకర్తలు ఆడంబరాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. రాజకీయంగా మిత్రపక్షాల అవసరం ఉన్నప్పటికీ... సిద్ధాంతాలపై రాజీపడబోమని వివరించారు. మిత్రుల కోసం సొంత బలాన్ని పణంగా పెట్టరాదని సూచించారు.అధీన రేఖవద్ద పాక్‌ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. నాగరికంగా వ్యవహరిస్తేనే పాక్‌తో చర్చలకు అంగీకరిస్తామని విస్పష్టంగా ప్రకటించారు. ప్రధాని కూడా పాక్‌ వైఖరిని ఖండించారు. స్నేహం కావాలం టే.. పద్దతులనుమార్చుకోవాల్సిందేనని దాయాదికి స్పష్టంచేశారు. యువతకు పెద్దపీట వేసిన ‘చింతన్‌ శిబిర్‌’లో రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని నినాదాలు హోరెత్తారుు.

జైపూర్‌: కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించుకుంటున్న ‘చింతన్‌ శిబిర్‌’లో కొంత ఆత్మవిమర్శ, మరికొంత అంతర్మథనం, ఇంకొంత విమర్శ వ్యక్తమయ్యాయి. పార్టీ బలహీనతల్ని అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. పార్టీలో ఐకమత్యం లేకపోవడం, అత్యాశలకు పోవడం, నాయకులు తమ సంపదను ప్రదర్శిస్తూ ఆడంబరాలకు పోవడంపై పార్టీ అధ్యక్షురాలు నిశితంగా విమర్శించారు. మన ముందున్న సవాళ్లను గమనించి ఎవరికివారు ఆత్మశోధన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకో 15 నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనతలు, శక్తిసామర్థ్యాల గురించి అధ్యక్షురాలు చింతన్‌ శిబిర్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజుల సమావేశం శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది.

ఈ సమావేశానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీనే కాక పార్టీ నాయకత్వం మొత్తం హాజరైంది. ‘మనకు మనం నిజాయితీగా మాట్లాడుకునేందుకు ఇక్కడ సమావేశమయ్యాం’ అని ఆమె మేధోమథన సమావేశం ‘చింతన్‌ శిబిర్‌’లో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వందలాది మంది ప్రతినిధులకు ఆమె చెప్పారు. ‘మన భవిష్యత్తును నిర్ణయించే ఒక ముఖ్యమైన పనిమీద మనం ఇక్కడికి వచ్చాం. పునరుత్తేజంతో, ఒక కొత్త శక్తితో మనం ఇక్కడి నుంచి వెళ్లాలి’ అని పార్టీ అధ్యక్షురాలు సభలో పాల్గొన్న వారికి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ ఇక ముందు కూడా దేశంలో ప్రసిద్ధమైన రాజకీయ పార్టీగా కొనసాగుతుందని చెబుతూ సోనియాగాంధీ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీని ఎదుర్కొంటోందని అంగీకరించారు. ‘సంప్రదాయసిద్ధంగా మనకు పట్టున్న స్థావరాల్లోకి ఇతరులు చొచ్చుకొని వస్తున్నారు’ అని పార్టీని హెచ్చరించారు.కాంగ్రెస్‌ పార్టీ ముందు అయిదు సవాళ్లున్నాయని సోనియాగాంధీ చెప్పారు.
రాజకీయంగా ఎదురవుతున్న సవాల్‌ మాత్రమే కాక, సామాజింగా ఆర్థికపరంగా సమస్యలు తలెత్తుతున్నాయని, మహిళలు, పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలో పట్టణాలు, గ్రామాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మన సంఘటిత తత్వానికి మచ్చగా మారుతున్నాయి. ఇది మనం ఎంతగానో సిగ్గుపడాల్సిన విషయం’ అని సోనియాగాంధీ ఆవేదన చెందారు. ‘భర్తను పోగొట్టుకున్న వారిపట్ల మనం అనుసరిస్తున్న వైఖరి, పిల్లలు, మహిళల్ని రవాణా చేయడం, లైంగిక వేధింపులు- ఇవన్నీ మనకు అశాంతిని కలిగిస్తున్నాయి. మనల్ని కలవరపరుస్తున్నాయి. ఇవి మనల్ని మేల్కొలుపుతున్నాయి’ అని సోనియాగాంధీ హెచ్చరించారు.సంస్థాగత విషయాలపై మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ, ఐకమత్యం లేవని విమర్శించారు.

‘ ప్రజలు మనకెన్నో అవకాశాలివ్వాలనుకుంటున్నారు. కానీ, ఒక క్రమశిక్షణ కలిగిన, ఐక్యత ఉన్న బృందంగా మనం పనిచేయలేకపోవడంతో ఆ అవకాశాల్ని పోగొట్టుకుంటున్నాం’ అని ఆమె ఏమాత్రం సంకోచించకుండా, నిర్మొహమాటంగా చెప్పారు. ‘ముఖ్యంగా...మనం అధికారంలో లేని రాష్ట్రాల్లో వ్యక్తిగత ఆశలు, అహంకారాలను పక్కనపెట్టి మనం సంఘటితం కావాలి. కలిసికట్టుగా పనిచేయాలి. అలా చేసినప్పుడే పార్టీ విజయం సాధిస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి విజయం, కృషి మీదనే పార్టీ విజయం ఆధారపడి ఉందన్న మామూలు విషయాన్ని, వాస్తవాన్ని మనం ఎందుకు మరిచిపోతున్నాం?’ అని సోనియాగాంధీ సూటిగా ప్రశ్నించారు. పాపభీతితో మొక్కుబడిగా చేసే డిక్లరేషన్లతో ఐక్యత రాదని సూటిగా, ఎలాంటి దాపరికం లేకుండా చెప్పారు. ఐకమత్యం అన్నది ప్రసిద్ధమైన మన సంస్థలో ప్రతి ఒక్క కార్యకర్త నినాదం కావాలి, బాధ్యత కావాలి. అందుకు స్పందించాల్సిన పవిత్రమైన బాధ్యత మనమీద ఉంది’ అని పిలుపునిచ్చారు.

పార్టీలో నాయకత్వాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు పేర్కొన్నారు. ‘పార్టీలో భాగస్వాములు కావడం కాదు, పనితీరు మాత్రమే పార్టీ ముందుకెళ్లేందుకు నిచ్చెన అవుతుంది’ అని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. సమావేశానికి హాజరైన యువ సహచరుల్ని చూసిన సోనియాగాంధీ ఎన్నడూ లేనివిధంగా స్పందించారు. యువతను చూడగానే వారికి ఏదో చెప్పాలని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందని, ఆ విషయంపైనే ఆలోచిస్తూ ఉంటానని చెప్పారు. ‘నేను చెప్పాలనుకున్నది మన జీవనశైలుల గురించి. పెళ్లిళ్లు, పండగలు, ఆనందకరమైన సందర్భాలను మనం జరుపుకొంటాం. కానీ ఆడంబరంగా , వైభవంగా మన గొప్పతనాన్ని, సంపదను ప్రదర్శించుకునేందుకు ప్రయత్నిస్తాం. మన హోదాను చాటుకునేందుకు ఇష్టపడతాం. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సి వస్తోంది. ఈ సంపద మనకెక్కడిది? మీరు దీనిపై తీవ్రంగా ఆలోచించాలి.

దీనిపై...అందరికీ ఆమోదయోగ్యమైన సూచనలు, సలహాలు, విధానాలతో మీరు ముందుకు రావాలి’ అని ఆమె కోరారు. నేడు యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముంది, వారు తామేదో చెప్పాలనుకుంటున్నారు. తమ గొంతు వినిపించాలనుకుంటున్నారు. అందుకు వారికి అవకాశం ఇవ్వాలి’ అని సోనియాగాంధీ హితవు పలికారు. చివర్లో ఆమె పార్టీ వాదులకు సలహా ఇస్తూ -‘మీరు నిజాయితీగా ఉండండి. స్వేచ్ఛగా మీ అభిప్రాయాల్ని చెప్పండి. క్రమశిక్షణను మరిచిపోకండి’ అని సోనియాగాంధీ కోరారు.

No comments