1

Breaking News

చర్చలు ఇంకా సాగుతున్నాయని.....

తెలంగాణపై నెల రోజులలో చెబుతామంటే సరిగ్గా 30 రోజులని కాదని ఓ పది రోజులు అటో ఇటో కావచ్చునని గులాం నబీ ఆజాద్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి గడువు ఏదీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తున్నది. 

ఆజాద్ బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ సమస్య చాలా సున్నితమైనదని, అందుకే చర్చల ప్రక్రియ కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణపై షిండే నెల రోజుల్లో ప్రకటన అన్నంత మాత్రాన దాని అర్థాన్ని ముప్ఫై రోజులుగా భావించరాదని ఆయన అన్నారు. ఇంత సున్నితమైన అంశం విషయంలో వారం అంటే రెండు మూడు వారాలు కూడా పట్టవచ్చునని ఆయన వివరించారు. మీడియా ఈ విషయంలో కాస్త సంయమనం పాటించాలని కూడా ఆయన సూచించారు. సమస్య గురించి అధికార ప్రకటన వెలువడడానికి ఎల్లుండి సెలవు, తర్వాత రిపబ్లిక్ డే, ఆ తర్వాత ఆదివారం ఇలా వరుసగా సెలవులు రావడం వల్ల ప్రకటన వెలువడడానికి మరి కొంత వ్యవధి పట్టవచ్చునని ఆయన వివరించారు. 

తెలంగాణ గురించి చర్చలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ఇంకా జరగవలసి ఉందని, ఈ చర్చలు ముగిసి ఒక కొలిక్కి వచ్చాకే తెలంగాణాపై అధికార ప్రకటన ఉంటుందని ఆజాద్ వివరించారు. నెల అంటే ఖచ్చితంగా నెల అనడానికి లేదని, కాస్త అటో ఇటో పది రోజులు పడుతుందని వివరిస్తూ అంతిమ నిర్ణయాన్ని తీసుకున్నాక ప్రకటనకు పెద్ద సమయం పట్టకపోవచ్చునని ఆయన అన్నారు. 

చర్చలు ఇంకా సాగుతున్నాయని ఆజాద్ చేసిన ప్రకటనను బట్టి కాంగ్రెస్ మళ్లీ ప్లేటు ఫిరాయిస్తున్నట్టు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తుది గడువు లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడాన్నిబట్టి 28వ తేదీ లోపు ఢిల్లీ నుంచి ప్రకటన రాకపోవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

No comments