1

Breaking News

సీమాంధ్ర నేతల భేటీ ముగిసింది

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గురువారం ప్రారంభమైన సీమాంధ్ర నేతల భేటీ ముగిసింది. సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని మంత్రి శైలజానాథ్ తెలిపారు. అధిష్టానాన్ని కలిసేందుకు ఈనెల 21న ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు.

సీమాంధ్రనేతల సమావేశం నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్‌హౌస్‌లో ముగిసిన అనంతరం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారని, 14 మంత్రులు వచ్చారని, మిగిలిన నలుగురు మంత్రులు రాలేకపోయారని, అయినా సమైక్యాంధ్రాని కోరుతూ వారు లేఖలు పంపారని మంత్రి తెలిపారు. దాదాపు 68 మంది నేతలు హాజరయినట్లు శైలజానాథ్ చెప్పారు.

ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చించామని, అందరూ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఒకే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దానిని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు శైలజానాథ్ తెలిపారు. ఢిల్లీ వెళ్లినప్పుడు తమ మనోభావాలను, ఈ తీర్మానాన్ని అధిష్టానానికి తెలియజేస్తామని అన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం ఐక్యంగా ఉంటేనే పార్టీకి మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ...ఈరోజు జరిగిన సమావేశంలో సమైక్యరాష్ట్రం తప్ప వేరే నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రధాన ఎజెండాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న విషయంపైనే చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నెల 28 లోపల ఏమీ రాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ...తెలుగు ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తీర్మానం చేస్తే బాగుంటుందని చాలా మంది పెద్దలు మాట్లాడారని అన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం జరిగిందని, ఢిల్లీ వెళ్లినప్పుడు అధిష్టానానికి వివరిస్తామని గాదె పేర్కొన్నారు.

కాగా సమావేశం జరుగుతున్నప్పుడు మంత్రి కొండ్రు మురళి ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తుంటే మన ఎంపీలు ఏమి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ఇచ్చేట్టుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

No comments