1

Breaking News

దారి దోపిడీ!

దారి దోపిడీ!
శనివారం నుంచి ఐదు రోజుల పాటు నడపడానికి ఉద్దేశించిన 4500 పండగ స్పెషల్‌ బస్సులలో చార్జీలను ఆర్‌టిసి 50 శాతం పెంచివేసింది. దీనిని చూసి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా అదే బాటపట్టా యి. ప్రైవేటు బస్సులలో హైదరాబాద్‌- విజయవాడ ఎ.సి. స్లీపరు టిక్కెట్టు 3000 రూపాయలకు అమ్ముకొన్నారని సమాచారం. ఇది మామూలుగా ఉండే హైదరాబాద్‌- విజయవాడ విమానం టిక్కెట్టు ధర కంటె 200 రూపాయలు మాత్రమే తక్కువ. విమానాలలో కూడా ఈ పండుగకు హైదరాబాద్‌- విజయవాడ టిక్కెట్టు ధర పెరిగిపోయి 4800 రూపాయలు చేరుకున్నదంటే మన్మోహనామాత్యుడు వల్లిస్తున్న మార్కెట్‌ ఆర్ధిక సూత్రం ఎంతగా విర్రవీగి జనాన్ని దోచుకుంటున్నదో అర్ధం చేసుకోవచ్చు.

ఏడాది పొడుగునామామూలు చార్జీలకే బస్సులు నడుపుతున్న ఆర్టీసీ పండుగలొచ్చే సరికి 50 శాతం పెంచడంలో బొత్తిగా ఔచిత్యంకను పించడం లేదు.డీజెల్‌ రేట్లు పెరిగనప్పుడల్లా చార్జీలు పెంచేసి ప్రజలమీద భారాన్ని మోపుతున్నప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థలు పండుగలలో అసాధారణంగా పెరిగే డిమాండ్‌తో మరింతగా రెచ్చిపోయి జనం జేబులు కొట్టే పనికి పాల్పడడం ఎంతైనా బాధాకరం. పండుగ ప్రజలకా, బస్సుల యాజమాన్యాలకా? ఇంతకంటె దారిదోపిడీ మరొకటి ఉంటుందా? పట్టపగలుకళ్ళు మూయకుండానే జేబులు ఖాళీ చేసే ఈ జబర్దస్తీ ఘరానా చౌర్యాన్ని ఆపే మార్గాలే కరువా? ప్రైవేటు యాజమాన్యాలదే అసలైన పండగ, ప్రజలకు దండగ, ఆయాసం!


ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండింటిదీ డిమాండ్‌ను బట్టి రేటు పెంచే వ్యాపార లక్షణమే అయినప్పుడుప్రజలకు చెంప దెబ్బ, గోడ దెబ్బ రెండూ తప్పవు. పులిని చూసి బెంబేలెత్తి పరుగు లంకించుకున్న వారికి సింహం ఎదురైతే మరణం తప్ప ఇంకేది శరణ్యం? విద్య, ఉద్యోగార్ధులై ఊరు విడిచి వెళ్ళినవారిని తప్పనిసరిగా స్వస్థలానికి చేర్చే ఘన సంప్రదాయాన్ని సృష్టించి పోషిస్తున్న పండుగల పెద్ద, సంక్రాంతికి అనూహ్యంగా పెరిగే ప్రయాణీకుల రద్దీని గమనించి అటు ఆర్‌టిసి, ఇటు ప్రైవేటు బస్సు సర్వీసులు పోటీ పడి సాగిస్తున్న జేబుల లూటీ అత్యంత ఆందోళనకరమైనది. సంక్రాంతికి ఊళ్ళకు వెళ్ళే ప్రయాణీకుల బస్సులతో మిగతా రూట్లన్నింటి కంటె హైదరాబాద్‌- విజయవాడ బాట కిక్కిరిసి పోవడం కొత్త విషయం కాదు. రాష్ట్రంలోని ప్రతి పల్లెనుంచి పట్నం నుంచి ఉపాధి గమ్యం చేసుకొని హైదరాబాద్‌ వచ్చి స్థిరపడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగి పోతున్నది. రాష్ట్ర రాజధానిలో అభివృద్ధి కేంద్రీకరణ అనివార్యంగా ఈ పరిస్థితిని సృష్టిస్తున్నది. పండుగ ఉందంటే స్వస్థలం చేరుకొని ఆత్మీయుల మధ్య గడిపే ఆనంద క్షణాలకోసం హైదరాబాద్‌నుండి ప్రయాణం కట్టే వారి సంఖ్య కూడా పెరిగిపోతున్నది.

ఆ మేరకు చౌక ప్రయాణ సౌకర్యాలను విస్తారంగా కల్పించవలసిన ఆర్‌టిసి ఆ పని చేయకపోగా ఆ అదను వాడుకొని ప్రయాణీకుల నుంచి అధికారికంగా, వీలైనంత ఎక్కువగా పిండుకొనే వ్యూహాన్ని ఎంచుకున్నది. ఇందుకు పోటీగా ప్రైవేటు బస్సు సర్వీసులూ పండగ ప్రయాణీకుల జేబులు కొల్లగొట్టే నిర్వాకానికి పాల్పడుతున్నాయి. కంచే చేను మేసినప్పుడు దోపిడీయే పాడిగా భావించే ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ప్రయాణీకులపై ఎందుకు కనికరం చూపుతాయి? అటు ఆర్‌టిసి, ఇటు ప్రైవేటు బస్సుల టిక్కెట్లను విశేషంగా, అసాధారణంగా పెంచేసినా ఆ బస్సుల్లో చోటు కోసం పండగ ప్రయాణీకులు వెల్లువెత్తడం, సీటు దొరక్క పెక్కుమంది నిరాశ చెందుతూ ఉండడం గమనార్హం. ఆర్‌టిసి ధన దాహం అలా ఉంచి అంతంత ఖరీదు పెట్టైనా టిక్కెట్టు కొని ఊళ్ళు వెళ్ళడానికి భారీ సంఖ్యలో వస్తున్న ప్రయాణీకులకు చాలినన్ని బస్సులు అందుబాటులో ఉంచలేకపోవడమూ స్పష్టంగా కనుపిస్తున్నది.శనివారం నుంచి ఐదు రోజుల పాటు నడపడానికి ఉద్దేశించిన 4500 పండగ స్పెషల్‌ బస్సులలో చార్జీలను ఆర్‌టిసి 50 శాతం పెంచివేసింది. దీనిని చూసి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా అదే బాట పట్టాయి.

ప్రైవేటు బస్సులలో హైదరాబాద్‌- విజయవాడ ఎ.సి. స్లీపరు టిక్కెట్టు 3000 రూపాయలకు అమ్ముకొన్నారని సమాచారం. ఇది మామూలుగా ఉండే హైదరాబాద్‌- విజయవాడ విమానం టిక్కెట్టు ధర కంటె 200 రూపాయలు మాత్రమే తక్కువ. విమానాలలో కూడా ఈ పండుగకు హైదరాబాద్‌- విజయవాడ టిక్కెట్టు ధర పెరిగిపోయి 4800 రూపాయలు చేరుకున్నదంటే మన్మోహనామాత్యుడు వల్లిస్తున్న మార్కెట్‌ ఆర్ధిక సూత్రం ఎంతగా విర్రవీగి జనాన్ని దోచుకుంటున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఏడాది పొడుగునా మామూలు చార్జీలకే బస్సులు నడుపుతున్న ఆర్టీసీ పండుగలొచ్చే సరికి 50 శాతం పెంచడంలో బొత్తిగా ఔచిత్యం కనుపించడం లేదు. డీజెల్‌ రేట్లు పెరిగనప్పుడల్లా చార్జీలు పెంచేసి ప్రజలమీద భారాన్ని మోపుతున్న ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థలు పండుగలలో అసాధారణంగా పెరిగే డిమాండ్‌తో మరింతగా రెచ్చిపోయి జనం జేబులు కొట్టే పనికి పాల్పడడం ఎంతైనా బాధాకరం. పండుగ ప్రజలకా, బస్సుల యాజమాన్యాలకా? ఇంతకంటె దారిదోపిడీ మరొకటి ఉంటుందా? పట్టపగలు కళ్ళు మూయకుండానే జేబులు ఖాళీ చేసే ఈ జబర్దస్తీ ఘరానా చౌర్యాన్ని ఆపే మార్గాలే కరువా? ప్రైవేటు యాజమాన్యాలదే అసలైన పండగ, ప్రజలకు దండగ, ఆయాసం!

దేశం మొత్తంమీద గల ప్రభుత్వ రంగ ప్రయాణీకుల బస్సులలో 70.4 శాతం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోనే ఉన్నాయి. గత మార్చ్‌ నాటికి దేశమంతటా గల ప్రభుత్వ రంగ ప్రయాణ బస్సుల సంఖ్య 1,22,355 అయితే ఆంధ్రప్రదేశ్‌లో 23,000 (ఇందులో 5000 డొక్కు బస్సులు), కర్ణాటకలో 21,302, తమిళనాడులో 19, 855, మహారాష్టల్రో 23,261, ఢిల్లీలో 5,771 బస్సులున్నాయని సమాచారం. అంటే మన రాష్ట్రం దేశంలో ప్రభుత్వ రంగ బస్సులలో అత్యధిక సంఖ్యలో గల రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో నిలబడిన ఘన చరిత్రను మాటకట్టుకున్నదన్న మాట. ఇంతటి ఘనకీర్తి కలిగి ప్రజలను పీడించడమే తప్ప వారికి అణువంత ఆనందం కలిగించక పోవడమే బాధాకరం.
లక్ష ముపె్పై వేల మంది సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్న ఆర్‌టిసి, వారి నైపుణ్యాన్ని, సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింతగా బస్సులను అందుబాటులో ఉంచి ప్రయాణీకులను విశేషంగా ఆకట్టుకోగలిగితే లాభాల పంట పండించుకోవచ్చు. తక్కువ చార్జీలతో వీలైనంత ఎక్కువ మందిని గమ్యాలకు చేర్చడం ఇతరేతర సేవ లందించడం ద్వారా ప్రైవేటు ప్రయాణ రంగం ఉనికినే దెబ్బ తీయవచ్చు.

పేరుకు ప్రజా ప్రభుత్వం ఆధీనంలోని రవాణా రంగం ఆచరణలో ప్రజలను పీడించుకు తినే నిర్వాకం వెలగబెట్టి పండగవేళల్లోనూ వారిని కంటతడిపెట్టించే పద్ధతి ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ప్రభుత్వం కూడా ఆర్‌టీసీ విషయంలో శల్య సారథ్యం నెరపడం మరింత గర్హనీయం. దానికి తాను బకాయి పడిన సొమ్ము ఎప్పటికప్పుడు చెల్లించకుండా, విలువ ఆధారిత సుంకం (వ్యాట్‌) వంటి వడ్డింపు (350 కోట్లు)ల నుంచి కూడా మినహాయింపు ఇవ్వకుండా ఆర్‌టిసి నష్టాల ఊబికి ప్రభుత్వమూ కారణమవుతున్నది. పొరుగునున్న కర్ణాటక ప్రభుత్వ రవాణా సంస్థ కెఎస్‌ ఆర్‌టిసి గత ఆర్ధిక సంవత్సరంలో 62 కోట్ల రూపాయల పైచిలుకు లాభాలను గడించింది. అలాగే మహారాష్ట్ర, పంజాబ్‌, ఒరిస్సా రాష్ట్రాల ప్రభుత్వ ప్రయాణ రవాణా సంస్థలు లాభాలలో నడుస్తున్నాయి. సక్రమ మార్గాలలో ప్రజలను ఆహ్లాదపరచి వారినుంచి లాభపడే బదులు దొడ్డి దారిలో వారి జేబులు కొల్లగొట్టి లాభాలు చేసుకోవాలనుకోవడం కంటె దుర్మార్గముండదు.

ఆర్‌టిసి నష్టాలలోనుంచి బయట పడాలి, లాభాల పంటలతో అలరారాలి. అదే సమయంలో ప్రజలకు సరసమైన చార్జీలతో నాణ్యమైన సేవలు అందించగలగాలి. అప్పుడే అది ప్రభుత్వ, ప్రజా రవాణా సంస్థ అవుతుంది కాని పండగలకు ఇళ్ళకి వెళ్ళే సామాన్య జనం జేబులు కొల్లగొట్టడం ద్వారా కాదు. ఇకనైనా ఈ పండగల దారి దోపిడీకి ఆర్‌టిసి చేత స్వస్తి చెప్పించి ప్రైవేటు రంగం దోపిడీని కూడా అంతమొందించాలి. అది ప్రభుత్వం మీదున్న ప్రధాన కర్తవ్యం. లేని పక్షంలో ప్రజాకంటక ప్రభుత్వమనే అపకీర్తిని మోసి పాలకులు దాని పర్యవసానాలను చవి చూడవలసి వస్తుంది.

No comments