హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తూ....
చింతన్ శిబిరంలో చర్చకు పెట్టనున్న షిండే
దీనిపై ‘రాజకీయ నిర్ణయం’ తీసుకోనున్న కాంగ్రెస్! సీఎస్, డీజీపీలతో సహా రాష్ట్ర ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ అత్యవసర భేటీ తెలంగాణే ఎజెండాగా అనూహ్యంగా సమావేశం అన్ని కోణాల్లో విశ్లేషణ.. శాంతిభద్రతలపైనా చర్చ గవర్నర్, నిఘా నివేదికల ఆధారంగా తుది రూపు డబ్ల్యూ చంద్రకాంత్, సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణ విషయమై కొంతకాలంగా హస్తినలో వాడివేడిగా సాగుతున్న రాజకీయాలు గురువారం నాటకీయ మలుపు తిరిగాయి. రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించే కేంద్ర హోంశాఖ అనూహ్య రీతిలో అత్యవసరంగా సమావేశమై మరీ తెలంగాణ అంశంపై తీవ్రంగా చర్చించింది! కేంద్ర, రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు పరిశీలకులను కూడా ఈ పరిణామం విస్మయపరిచింది. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సారథ్యంలో సాగిన ఈ భేటీలో ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వంటి అత్యున్నతాధికారులు కూడా పాల్గొనడం విశేషం! హోంశాఖ ఆదేశాల మేరకు వారు గురువారం హుటాహుటిన హస్తిన చేరుకున్నారు. ‘తెలంగాణ అంశంపై తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే’ ఏకైక ఎజెండాగా సాగిన ఈ భేటీ.. అన్ని అంశాలనూ మధించడంతో పాటు ఇటు నిఘా వర్గాల నివేదికలు, అటు స్వయంగా గవర్నర్ అందజేసిన రహస్య నివేదికలను కూడా లోతుగా విశ్లేషించింది. జాతీయ భద్రత మాజీ సలహాదారు, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శులు కూడా ఈ విషయమై వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. అనంతరం రాష్ట్ర విభజనకు సంబంధించి స్థూలంగా మూడు ప్రతిపాదనలకు హోంశాఖ తుది రూపునిచ్చినట్టు చెబుతున్నారు. ఆ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పిస్తుందని.. అంతకంటే ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో జైపూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ చింతన్ శిబిరంలో షిండే స్వయంగా వాటిని చర్చకు ఉంచుతారని తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తూ ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం; 2014లోపు తుది నిర్ణయం తీసుకుంటూ, ఆలోపు తాత్కాలిక ప్రాతిపదికన తెలంగాణకు అభివృద్ధి మండలి, వెనకబడ్డ సీమాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి నిధి ఏర్పాటు చేయడం; తప్పనిసరైతే నేరుగానో, ఎస్సార్సీ ద్వారానో రాష్ట్రాన్ని విభజించడం... ఇదే హోం శాఖ ప్రతిపాదనల సారాంశమని తెలుస్తోంది. వీటితో పాటు శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు మేరకు తెలంగాణకు అవునని గానీ, కాదని గానీ ఏదో ఒక నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించే విషయాన్ని పరిశీలించాలన్న ప్రతిపాదనను కూడా శాఖ తెరపైకి తెచ్చింది. తెలంగాణపై స్వయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు రాహుల్‌గాంధీ విముఖంగా ఉండటమే ఈ ప్రతిపాదనకు కారణమంటున్నారు. తద్వారా... తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా కమిటీ సిఫార్సులపై పార్టీపరంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఓ కార్యకర్తగా శిరసా వహిస్తున్నానని చెప్పుకునే సావకాశం ఆయనకు ఉంటుందన్నది దీని వెనక ఆలోచనగా తెలుస్తోంది. అభివృద్ధి, శాంతి భద్రతల అంశంతో పాటు పలు కోణాలను హోంశాఖ భేటీ లోతుగా చర్చించింది. ముఖ్యంగా కాంగ్రెస్ చింతన్ శిబిరంలో తెలంగాణపై విస్పష్టమైన నిర్ణయం తీసుకునే పక్షంలో రాష్ట్రంలో పరిస్థితి ‘చేయి’దాటిపోయే ఆస్కారం కూడా లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏదేమైనా తుది నిర్ణయం అంత త్వరగా సాధ్యం కాదన్న భావనకు భేటీ వచ్చింది. కాబట్టి ఏదో ఒక రూపంలో అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించడమే ప్రస్తుతానికి అభిలషణీయమని హోంశాఖ వర్గాలు వ్యక్తిగతంగా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. అయితే, ‘‘తెలంగాణ విషయమై కేంద్రం ఏదైనా ‘రాజకీయ నిర్ణయం’ తీసుకుంటే మాత్రం షిండే కూడా ఆ మేరకు జనవరి 23 లోపే స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఎందుకంటే అప్పుడిక విషయాన్ని సాగదీయడంలో, 28వ తేదీ దాకా ఆగడంలో అర్థమేమీ ఉండదు’’ అని కూడా హోం శాఖ అత్యున్నత వర్గాలు వివరించడం విశేషం! ‘‘(తెలంగాణ విషయమై) పరిస్థితి నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. అందుకే నిర్ణయం నేరుగా ‘అవును’, లేదా ‘కాదు’ అంటూ కరాఖండిగా గానీ.. ‘నింపాదిగా, ఒక్కో ముందడుగు’ తరహా రూపంలో గానీ... ఎలాగైనా ఉండవచ్చు’’ అని కూడా ఆ వర్గాలు చెప్పుకొచ్చాయి. కాంగ్రెస్ నిర్ణయం కూడా హోం శాఖ ప్రతిపాదనలకు అనుగుణంగానే ఉండే పక్షంలో తదుపరి రోడ్ మ్యాప్‌ను ప్రకటించేందుకు నిర్దిష్ట కాలావధితో వెంటనే ఓ కమిటీని వేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. రెండో ఎస్సార్సీని వేసే పక్షంలో తెలంగాణ అంశాన్ని కూడా దాని పరిధిలోకి చేర్చడమా లేదా అన్నదానిపైనా చింతన్ శిబిరంలో చర్చ జరుగుతుందంటున్నారు. జీజేఎం వేడే కారణం! పశ్చిమబెంగాల్ నుంచి గూర్ఖాలాండ్‌ను విడదీయాలంటూ చిరకాలంగా ఉద్యమిస్తున్న గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) చేసిన తాజా డిమాండే హోం శాఖ అత్యవసర భేటీకి కారణమని తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చేందుకే కాంగ్రెస్ మొగ్గుతోంది గనుక గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాల్సిందేనని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి బుధవారం మీడియాతో డిమాండ్ చేయడం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి షిండే గురువారం ఉదయం 11 గంటలకు ఫోన్ చేశారు. ‘రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో అత్యవసర ప్రాతిపదికన భేటీ ఏర్పాటు చేయాల్సిందిగా’ కోరారు. తీరా చూస్తే అది కాస్తా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన సమావేశంగా సాగింది. షిండే, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతో పాటు సీఎస్ మిన్నీ మాథ్యూ, డీజీపీ వి.దినేశ్‌రెడ్డి, అదనపు డీజీపీ (ఇంటలిజెన్స్) మహేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ కార్యదర్శి బిశ్వాస్, సాగునీటి శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాత్రమే అందులో పాల్గొన్నారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిస్థితులపై సీఎస్, డీజీపీ, మహేందర్‌రెడ్డిలతో ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణ ఇస్తే ఉత్పన్నమయ్యే, లేదా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఉత్పన్నమయ్యే శాంతిభద్రతల పరిస్థితులు, వాటిని నియంత్రించడం, అందుకు కావాల్సిన అదనపు బలగాలు తదితరాలపై ఆరా తీసినట్టు చెబుతున్నారు. ఇలా రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక అధికారులను ఢిల్లీ పిలిపించుకోవడంతో, తెలంగాణపై కేంద్రం ఖాయంగా ఒక నిర్ణయానికి వచ్చిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చర్చోపచర్చల అనంతరం హోం శాఖ చివరికి మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వాటిలో సూచించిన తాత్కాలిక చర్యలకు తెలంగాణవాదులు ఎంతవరకు అంగీకరిస్తారన్న దానిపై కూడా చర్చ జరిగింది. ఇటు కోస్తాకు చెందిన పోలవరం, అటు తెలంగాణకు చెందిన చేవెళ్ల-ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టులు రెండింటినీ కేంద్ర సాయంతో చేపడితే ఎలా ఉంటుందని కూడా ప్రభుత్వం యోచిస్తోందంటున్నారు. కేంద్ర జల సంఘం భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న విద్యుత్, సాగునీటి శాఖల కార్యదర్శులు బిశ్వాస్, ఆదిత్యనాథ్ దాస్‌లను భేటీకి పిలిచింది కూడా ఈ అంశాలపై చర్చించేందుకేనని సమాచారం. |
No comments