1

Breaking News

తెలంగాణ కోసం....

ఎలాంటి ఆందోళన, ఆవేశాలకు తావులేకుండా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని అధిష్ఠానం నిర్ణయించడాన్ని హర్షిస్తున్నట్లు సీనియర్ మంత్రి జానారెడ్డి తెలిపారు. సోనియాగాంధీ గత మూడేళ్లుగా ఇక్కడి ప్రజల ఆకాంక్షను గమనిస్తున్నారని.. ఈ సమస్యకు ఆమె ఓ పరిష్కారం సూచిస్తారనే విశ్వాసంతోనే మూడేళ్లుగా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల, బస్వరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్‌లతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ కోసం ఉద్యమించే సంస్థలు, పార్టీలు, సంఘాలు, విద్యార్థులు, జేఏసీలు సంయమనం పాటించాలని సూచించారు. రెచ్చగొట్టేలా మాట్లాడి, సమస్యను జటిలం చేసేవారికి అవకాశం ఇవ్వవద్దన్నారు. ప్రజల నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా, నిలదీతలు, అపోహలకు దారితీసినా, ఇబ్బందులు కలిగినా.. ఈ ప్రాంత మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలంతా సంయమనంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎవరికీ నష్టం వాటిల్లని విధంగా సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలూ సలహాలివ్వాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ శ్రేణిలోనూ దీన్ని కుటుంబసమస్యగా భావించాలన్నారు. తెలుగు ప్రజల ఐక్యత, ఔన్నత్యం చాటిచెప్పేలా అన్నీ ఆలోచించి సమస్యను పరిష్కరించుకోవాలని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఐక్యత కొనసాగి తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు ప్రాంతాల ప్రజలు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతారని, ప్రత్యేకతను చాటుతారని అన్నారు. తెలుగు ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా కలిసే ఉంటారని, ఇది ఆ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రులను తెలంగాణవారు మమేకం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం సమస్య పరిష్కారం చివరి దశలో ఉన్నామని, రెచ్చిపోయి మాట్లాడితే తెలంగాణకు మంచిది కాదని పేర్కొన్నారు. ఏకాభిప్రాయమనేది ఎప్పుడూ ఉండదని, ఎవరికీ నష్టం వాటిల్లని విధంగా, నీరు సహా పలు అంశాల్లో అక్రమం, అన్యాయం లేని విధంగా పరిష్కారం ఉండాలన్నారు.

తమ పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలు కూర్చుని ఎవరికీ నష్టం వాటిల్లకుండా పరిష్కారంపై చర్చిద్దామంటే తాను ముందువరసలో ఉండి సహకరిస్తానన్నారు. అధిష్ఠానమే చొరవ తీసుకుని తమను కూర్చోబెడితే సంతోషిస్తానని చెప్పారు. సమైక్యాంధ్ర కోరుకునే ప్రజాప్రతినిధులు తమ సమావేశాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఆ సమావేశం సమస్య పరిష్కారానికి అనుగుణంగా ఉండాలే గానీ.. రెచ్చగొట్టేలా ఉండొద్దన్నారు.

No comments