1

Breaking News

వరవరరావు తీవ్రంగా ఖండించారు.

మావోయిస్టు పార్టీ, మరో ఆరు ప్రజాసంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషే«ధాన్ని విరసం నాయకులు వరవరరావు తీవ్రంగా ఖండించారు. మావోయిస్టు, ఇతర ఆరు ప్రజా సంఘాలు, ఆర్డీఎఫ్‌పై తిరిగి విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

బుధవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, మంజీర రచయితల సంఘం కార్యదర్శి నందిని సిద్దారెడ్డి, ఏపీసీఎల్‌సీ కార్యదర్శి చిలుకా చంద్ర శేఖర్, కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రీజనర్స్ సభ్యులు ఎ.దశరథ్, విరసన సిటీ యూనిట్ కన్వీనర్ రిఐరా తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ఏ కారణాలతో ఆర్డీఎఫ్‌పై నిషేధం విధించారో తెలియజేయక పోవడం ప్రజా భద్రతా చట్టం పీడీ యాక్ట్ నిబంధనలు రాజ్యాంగ విరుద్దమైనవని అన్నారు.

ఆర్డీఎఫ్ కమిటీకి రాష్ట్రంలో ఎలాంటి నిర్మాణం లేదని, దీనిపై నిషేధం వి«ధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టు పార్టీ, ఆరు ప్రజా సంఘాలు (రాడికల్ విద్యార్ధి సంఘం, రాడికల్ యువజన సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం, దండకారణ్య ఆదివాసీ సంఘం, జననాట్యమండలి, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్)లపై 2005 నుంచి ప్రజా భద్రతా చట్టం-1992 కింద కొనసాగిస్తూ నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2012 ఆగస్టు 9న ఒక ప్రకటన విడుదల చేసిందని తెలిపారు.

ప్రజాభద్రతా చట్టం కింద హైకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఏర్పాటైన అడ్వయిజరీ బోర్డు ముందు ఆర్డీఎఫ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు గతంలో తమ వాదనలు వినిపించారని ఆయన గుర్తు చేశారు. దీనిపై అడ్వయిజరి బోర్డు ఏం సిఫార్సు చేసిందో తెలియజేయకుండానే ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ, ఇతర సంఘాలపై నిషేధాన్ని కొనసాగిస్తూ ప్రకటన వెలువరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అడ్వయిజరీ బోర్డు, లేదా ఆ ప్రజా సంఘాలు హైకోర్టుకు వెళితే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తే తప్ప ప్రభుత్వానికి అయిదు నెలలకు ముందే ప్రకటన చేయాల్సిన అవసరం లేదని ప్రస్ఫూటం ఆవుతున్నదని అన్నారు.

దీంతో ప్రభుత్వ ప్రకటనలో పారదర్శకత లేదనే విషయంతోపాటు ఇందులో ఏదో కుట్ర ఉన్నదనేది స్పష్టమవుతున్నదని అన్నారు. ఫాసిస్టు స్వభావానికి, వ్యవస్థకు బయటి భావనల పట్ల అసహనానికి నిదర్శనమే తప్ప ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంగా అనిపించుకోజాదలని ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎఫ్, మావోయిస్టు పార్టీ, మరో ఆరు ప్రజాసంఘాలపై నిషేధం ఎత్తివేయాలని, ఈ అప్రజాస్వామిక నిషేధాన్ని ఖండించాల్సిందిగా వరవరరావు ప్రజాస్వామిక, హక్కుల సంఘాలు, రచయితలను కోరారు.

No comments