1

Breaking News

ఈ సినిమా హిట్టవ్వాలి’’

విక్రమార్కుడు ..లో ఇన్‌స్పెక్టర్‌ పాత్రకి పండు మిరపకాయల సీన్‌ ఒకటుంది. దానిని 2రోజులు చిత్రీకరించాం. 10అడుగుల దూరానికే కళ్లు, ఒళ్లు మండేవి. అలాంటిది ఈ యూనిట్‌ ఏకంగా మిర్చి యార్డ్‌లోనే షూటింగుకి దిగింది. పైగా 21రోజుల చిత్రీకరణ. దర్శకుడైతే మూతికి గుడ్డ కట్టుకోవచ్చు. నటించేవారికి చాలా కష్టం. ఘాటు పీల్చాలి. మంట భరించాలి. అదంతా ముఖకవలికలు, హావభావాల్లో కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఏమీ అవనట్టే ప్రవర్తించాలి. రామ్‌ మిరపకాయ్‌ కాబట్టి చేసేశాడు. ఈ టైటిల్‌ కూడా తనకి యాప్ట్‌. ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. రామ్‌-కృతికర్బంద జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ‘ఒంగోలు గిత్త’ ఆడియో ఆవిష్కరించిన అనంతరం రాజమౌళి మాట్లాడుతూ..పైవిధంగా స్పందించారు.

ఆడియో తొలిసీడీని రామ్‌ అందుకున్నారు. రాజమౌళి మరిన్ని సంగతులు ముచ్చటిస్తూ-‘‘భాస్కర్‌ ఈ చిత్రాన్ని చాలా కసితో తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథల్నే కాదు..యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే మా ‘ఛత్రపతి’ నిర్మాత బివిఎస్‌ఎన్‌ తనయుడు బాబి ఈ చిత్రానికి నిర్మాతగా చాలా కష్టించాడు. ముఖ్యంగా జీవీప్రకాష్‌ సంగీతం అస్సెట్‌. ఈ ఆడియోతో తెలుగు జానపద కళాకారుల్ని ప్రోత్సహిస్తూ..ఓ జానపదగీతాన్ని రూపొందించడం కొత్త ఒరవడికి నాంది పలికారు. ఆ పాట నాకెంతో నచ్చింది. అన్నిపాటలూ బావున్నాయి’’ అన్నారు. దర్శకుడు భాస్కర్‌ మాట్లాడుతూ-‘‘ఒంగోలు గిత్త..లాంటి టైటిల్‌ కావాలనుకున్నాం. అయితే అదే టైటిల్‌ అయింది. దానికి సరిపడే హీరో రామ్‌. ఇప్పటివరకూ చూసిన రామ్‌ వేరు! ఈ సినిమాలో చూసే రామ్‌ వేరు!! సరికొత్తగా చూస్తారు. మణిశర్మ రీరికార్డింగ్‌, ఓ మాస్‌ దరువు వేశారు. వనమాలి జానపదగీతాన్ని సులువైన పదాలతో రాశారు.

ఆయన 4పాటలు ఆకట్టుకుంటాయి. రామ్‌ అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సినిమా కానుక’’ అన్నారు. రామ్‌ మాట్లాడుతూ-‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లోనే ఊరమాస్‌ ఇదే. భాస్కర్‌భట్ల ఓ మాస్‌ పాటను చక్కగా రాశారు. దర్శకుడు భాస్కర్‌నుంచి చాలా నేర్చుకున్నా’’ అన్నారు. పోటీలో గెలవడానికి సిద్ధంగా ఉన్న ఒంగోలు గిత్త రామ్‌..అన్నారు కోనవెంకట్‌. స్రవంతి రవికిషోర్‌, కృతికర్బంద, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, భాస్కర్‌భట్ల, అలీ, వనమాలి, కేదారినాథ్‌ తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ప్రకాష్‌రాజ్‌, అభిమన్యుసింగ్‌, ప్రభు, ఆహుతిప్రసాద్‌, అజయ్‌, రఘుబాబు, రమాప్రభ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: ఎ.వెంకటేష్‌, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: సెల్వ, కళ: కె.కదిర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామ్మోహన్‌రావు, పాటలు: వనమాలి, భాస్కర్‌భట్ల, కేదారినాథ్‌, సమర్పణ: భోగవల్లి బాపినీడు, స్క్రీన్‌ప్లే: బి.భారతి, కోనవెంకట్‌, కథ-దర్శకత్వం: భాస్కర్‌.

No comments