1

Breaking News

ఇదీ తీర్మానం

'ఉద్యమం లేదంటున్నారుగా. దాని రుచి చూపిస్తాం!'... ఇది అధిష్ఠానానికి సీమాంధ్ర కాంగ్రెస్ నేతల హెచ్చరిక! విభజనకు అంగీకరించబోమని వీరు తేల్చి చెప్పారు. ఈనెల 21 తర్వాత సమైక్య ఉద్యమాలు ఉద్ధృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. 'అడ్డుకుని తీరతాం' అన్న హెచ్చరికలు, అడ్డుకునేందుకు జరిగిన ప్రయత్నాలతో తలెత్తిన ఉద్రిక్తతలు, టీ-జేఏసీ మౌనదీక్ష తదితర పరిణామాల మధ్య హైదరాబాద్‌లో గురువారం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. 

'రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించం' అంటూ ఓ తీర్మానం చేశారు. దీనిని అధిష్ఠానానికి పంపించనున్నారు. మరోవైపు... తెలంగాణ జేఏసీ తరహాలో... పార్టీలకు అతీతంగా 'సమైక్య జేఏసీ' ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈనెల 21న ఢిల్లీకి 'దండయాత్ర'గా వెళ్లి అధిష్ఠానం ముందు తమ అభిప్రాయాలు కుండబద్దలు కొట్టాలని నిర్ణయించారు. అయితే, రాజీనామాలపై మాత్రం సీమాంధ్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం. 

మరోవైపు... ఈనెల 28లోపు ఏ నిర్ణయమూ రాదని టీజీ వెంకటేశ్, అటు సూర్యుడు ఇటు పొడిచినా రాష్ట్ర విభజన జరగదని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇక... తెలంగాణ సాధించుకునే దిశగా ఈ ప్రాంత నేతలు కూడా పట్టు బిగిస్తున్నారు. 22 ఢిల్లీ వెళ్లి 'ప్రత్యేక వాణి' వినిపించాలని నిర్ణయించుకున్నారు. 

పోటాపోటీ ఢిల్లీ యాత్రలతో ఢిల్లీ వాతావరణాన్ని మరింత వేడెక్కించనున్నారు. మరోవైపు... 'సమైక్యవాణి' వినిపిస్తున్న సీమాంధ్ర నాయకులతో 'జై ఆంధ్ర' నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. 'లగడపాటిలాంటి వారు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి' అని వసంత నాగేశ్వరరావు హితవు పలికారు. 

రాష్ట్ర విభజన కోరుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సాధన సమితి నేతలు కొందరు బెజవాడ దుర్గమ్మ గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టారు. తెలంగాణ నేతలు మాత్రం అధిష్ఠానం నిర్ణయంపట్ల ఆశాభావంగా ఉన్నారు. రాష్ట్ర విభజనను ఎవరూ అడ్డుకోలేరనే చెబుతున్నారు. అదే సమయంలో... హైదరాబాద్ నగరంపై చర్చ మరింత ఊపందుకుంది. 'హైదరాబాద్‌లేని తెలంగాణ తలలేని మొండెమే' అని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌పై హక్కు తెలంగాణ ప్రజలదే అని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు తేల్చి చెప్పారు. ఇక, విభజన వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని వివరించేందుకు ఈనెల 20న గిరిజన ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర విభజనపై వాడి వేడి వాదనలు సాగుతుండగా... ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం 'కూల్'గా ఉన్నారు. సీమాంధ్ర మంత్రులు కొందరు తన వద్ద విభజనపై ఆందోళన వ్యక్తం చేసినప్పుడు... 'ఏమీ కాదులే' అని భరోసా ఇస్తూ, 'ఏమవుతుందో చూస్తారుగా!' అని నవ్వుతూ ఊరడించారు. 

ఇదీ తీర్మానం
"ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. ఇది తప్ప మరేదీ మాకు అంగీకారం కాదు. ఈ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం వంటి అంశాలను... ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో దీనిని తీర్మానించాం. గతంలో జరిగిన తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల తర్వాత విభజనవల్ల తలెత్తే లాభ నష్టాలను పరిగణనలోకి తీసుకుని... ' నేను సమైక్య ఆంధ్రప్రదేశ్‌కే బలంగా కట్టుబడి ఉన్నాను' అంటూ నాడు ప్రధాని ఇందిరాగాంధీ లోక్‌సభలో చేసిన ప్రకటనను మా సమావేశం ఆమోదించింది''

No comments