1

Breaking News

మహిళల భద్రతే ప్రధాన ఎజెండా

మహిళల భద్రతే ప్రధాన ఎజెండా అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తామంతా సిగ్గుపడాలని అన్నారు. యువతులపై వేధింపులను అరికట్టాలని పార్టీ నేతలకు సోనియా ఉద్భోదించారు. మేథోమధనంలో పార్టీ విజయాలను, వైఫల్యాలను సమీక్షించుకోవాలని ఆమె అన్నారు.

జైపూర్‌లో కాంగ్రెస్ మేధోమథన సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. 2014 ఎన్నికలే లక్ష్యంగా జరుగుతున్న సదస్సులో సోనియా గాంధీ స్వాగతోపన్యాసం చేశారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత సమావేశమయ్యామని, ఈ తొమ్మిదేళ్లలో సామాజికంగా, ఆర్థికంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అనేక సవాళ్లున్నాయని, ఆర్ధికరంగంలో అభివృద్ధి సాదించాలన్నారు. దేశంతో సమానంగా పయనిస్తున్న పార్టీ కాంగ్రెస్సేనని సోనియా పేర్కొన్నారు. అభివృద్ధి, సామాజిక న్యాయం నాణేనికి రెండు భాగాలని వివరించారు.
పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సోనియా సూచించారు. కొత్త తరహా సవాళ్లు తమ ముందున్నాయని, ప్రస్తుత పరిస్థితిలో పార్టీ బలాలు, బలహీనతలు తెలుసుకోవాలని ఆమె పేర్కొన్నారు. పార్టీ ఐక్యంగా ఉండి సవాళ్లను ఎదుర్కొవాలన్నారు. పార్టీ ఇప్పటిదాక అనుసరిస్తున్న విధానాలను పునఃసమీక్షించాలన్నారు. 

ఎంత అభివృద్ధి చేస్తున్నా కొన్ని రాష్ట్రాల నుంచి తమకు రాజకీయ మద్దతు లభించడం లేదని సోనియా వాపోయారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. భూమి, నీటి కోసం జరుగుతున్న ఉద్యమాలను తక్కువ చేసి చూడకూడదని సోనియా ఉద్భోదించారు. 

ఈ సమావేశానికి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, సీనియన్ నేతలు తదితరులు హాజరయ్యారు. సభ్యులకు అంబికా సోని ఆహ్వానం పలికగా, సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు.

No comments