బిజీ పతంగులు
బిజీ పతంగులు
సంక్రాంతి అనగానే పిల్లలు, పెద్దలకు గాలిపటాల పండగ కూడా గుర్తొస్తుంది. సినిమా రంగంలో ప్రస్తుతం బిజీగా ఉన్న కొందరు సినీతారలు కూడా గాల్లో ఎగిరే పతంగుల మాదిరిగా తమ తమ సినిమాలతో బిజీగా న్నారు. 2012లో తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగిన స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. పెద్ద, చిన్న తేడా లేకుండా బాగున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. దీంతో ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు...వాళ్ల సరసన నటించిన హీరోయిన్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక్కో హీరో చేతుల్లో రెండు అంతకన్నా ఎక్కువ చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్లదీ అదే పరిస్థితి. ఇప్పటికే సంవత్సరానికి రెండేసి చిత్రాలలో నటిస్తానని మహేష్‌బాబు చెప్పినా 2012లో నిలబెట్టుకోలేకపోయాడు. ఈ సంవత్సరం మాత్రం తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సీతమ్మవాకిట్లో’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సమ్మర్‌కు సుకుమార్ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక రాంచరణ్ ‘నాయక్’ విడుదల కాగా ఈ సంవత్సరం ‘జంజీర్’ కూడా విడుదల కానుంది. ఈ సంవత్సరం చివర్లోగా ‘ఎవడు’ చిత్రం కూడా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక గత సంవత్సరం రెండు హిట్లతో దూసుకుపోయిన పవన్‌కళ్యాణ్ ఈ సంవత్సరం ‘త్రివిక్రమ్’తో చేసే చిత్రంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక యంగ్ రెబల్‌స్టార్ ‘మిర్చి’ చిత్రం వచ్చే నెల్లో విడుదల కానుంది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రంతో త్వరలో వస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఇక హీరోయిన్లలో సమంత, కాజల్, తమన్నాలు గత సంవత్సరం రెండేసి హిట్లతో ముందంజలో ఉన్నారు. ఈ సంవత్సరం వీళ్లకు పోటీగా సీనియర్ హీరోయిన్లు అనుష్క, నయనతార, త్రిషలతోపాటు శృతిహాసన్ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. వీళ్లంతా 2013 సంవత్సరానికి బిజీగా పతంగుల్లా ఎగరనున్నారు.
No comments