1

Breaking News

సరిహద్దులంటే సైనిక ట్రక్కులు, సైనికులే కాదు,

 భారత్‌-పాక్‌ సరిహద్దుపై కాల్పులు జరుగుతుండడంతో అక్కడి గ్రామాల్లో నివసించే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి దిగజారకూడదని కోరుకుంటున్నారు. సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ ప్రతినిధి అరుణోదయ్‌ ముఖర్జీ మెంధార్‌ సెక్టార్‌లో ప్రయాణించి సరిహద్దుకు సమీపంలోని గ్రామాల్లో నివసిస్తున్నవారి పరిస్థితిని తెలుసుకున్నారు. సరిహద్దులంటే సైనిక ట్రక్కులు, సైనికులే కాదు, వాస్తవాధీన రేఖ వెంట గ్రామాలూ ఉన్నాయి. దాదాపు నలభై ఏళ్లుగా ఆ గ్రామాల్లో నివసించేవారు రెండు దేశాల రాజకీయాల మధ్య నలిగిపోతున్నారు. సిఎన్‌ఎన్‌ ప్రతినిధి ఓ గ్రామంలో ముంతాజ్‌ ఖాన్‌, గులాం హుస్సేన్‌ అనే ఇద్దరు పేద రైతుల్ని కలుసుకున్నారు. వారు రోజువారీ కూలీ పని చేసుకుని బతుకుతున్నారు.

సరిహద్దు వెంబడి పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరగడం వారి జీవనాన్ని మరింత దిగజార్చింది. ‘ఇక్కడ ఉండడం తప్ప మాకు మరోదారి లేదు’ అని ముంతాజ్‌ ఆవేదనతో అన్నారు. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య దౌత్యపరంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నా ముంతాజ్‌, గులాం వంటి వారి జీవితాల్లో అంతగా మార్పుండదు. మారుమూల ప్రాంతంలో వారికి సరిహద్దుల్లో ఉన్న భారతీయ సైనికులే స్నేహితులు. ‘మనకు సైనికులున్నారని, వారు మాకేం కాకుండా చూసుకుంటారని మాత్రమే తెలుసు, అంతకు మించి మరేం తెలీదు’ అని గులాం హుస్సేన్‌ చెప్పారు.గులాం, ముంతాజ్‌, ఇంకా సరిహద్దు గ్రామాల్లో నివసించేవారు కూడా భారత పౌరులే. కానీ మిగతా వారిలా వీరి గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఇందుకు కారణం గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. వాస్తవాధీన రేఖ అంచు వెంబడి వీరు నివసిస్తున్నారు. రోజువారీ హడావుడి జనజీవితానికి వీరు చాలా దూరంలో ఉన్నారు.

No comments