1

Breaking News

లేడీ ఓరియంటెడ్ చిత్రాలు

నిర్మాతల్ని ఊరిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాలు
సిినిమా కథా వస్తువు రోజుకో పంథాలో నడక సాగిస్తోంది. కమర్షియల్ ఫార్ములాలు కాసులు కురిపిస్తున్నా ప్రేక్షకులకు సరికొత్త కథాంశాలను అందించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

ఆరు డ్యాన్సులు, నాలుగు ఫైట్లు, హీరో, హీరోయిన్, కమెడియన్.. వంటి రెగ్యులర్ సూత్రాలకు కాసేపు బ్రేక్‌ను ప్రకటించడానికి దర్శకులతో పాటు నిర్మాతలూ సై అంటున్నారు. మహిళా ప్రాధాన్యం కలిగిన సినిమాలతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారు. ఆ కోవలో ఈ ఏడాది తెలుగు తెరను ఏలనున్న స్త్రీ ప్రాధాన్యత ఉన్న చిత్రాల గురించిన కథాకమామీషు...

నిన్నటికి నిన్న బాలీవుడ్ తెరపై 'కహానీ', 'డర్టీ పిక్చర్' గొప్ప క్రేజ్‌నే సొంతం చేసుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అంతకు పూర్వమే తెలుగులోనూ 'అరుంధతి' ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మగువలకు పెద్దపీట వేసే సినిమాలంటే కెరీర్ అవసాన దశలో మాత్రమే చేయాల్సినవి అనుకునే నాయికామణులు సైతం ఇప్పుడు ఆ తరహా చిత్రాలు చేయడానికి బాహాటంగానే అంగీకారాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచి కథలుంటే తప్పక నటిస్తామని ఒప్పుకుంటున్నారు. టాలీవుడ్‌లో అగ్రపథాన దూసుకుపోతున్న కాజల్ మాట్లాడుతూ "నాకు ఇప్పటిదాకా ఎవరూ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ నెరేట్ చేయలేదు. నాకు నచ్చిన కథ దొరికితే వెంటనే కాల్షీట్ ఇస్తా'' అని ప్రకటించారు.

చారిత్రక వనిత
ఎలాంటి కథనైనా సెల్యులాయిడ్‌పై గ్రాండ్‌గా చూపించగలిగే దర్శకుడు గుణశేఖర్. తాజాగా రాణి రుద్రమదేవి ఉదంతాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. నిన్నటి 'అరుంధతి' అనుష్క, ఇప్పుడు రుద్రమదేవి

పాత్రను పోషించేందుకు సిద్ధమవుతోంది. గుణా టీమ్‌వర్క్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన గుణశేఖర్ తొలిసారి స్వీయ నిర్మాణంలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏడాది క్రితమే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో చిత్రీకరణను ప్రారంభించనున్నారు."పదేళ్లుగా రుద్రమదేవి సినిమా నా మనసులో మెదలుతూనే ఉంది. ఆరేళ్ల నుంచీ రుద్రమదేవిపై పరిశోధన జరుపుతున్నాం. హీరోయిన్ మీద భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఉత్సాహం చూపించకపోవడమే ఈ చిత్రం ఆలస్యానికి కారణం.'అరుంధతి'తో శ్యాంప్రసాద్‌రెడ్డి, 'ఈగ'తో రాజమౌళి అద్భుతాలు సృష్టించడం, ప్రేక్షకులు వాటిని ఆదరించడంతో నాకు ధైర్యం వచ్చింది. కొంతమంది నా వెనుక నిల్చోవడంతో సొంతగా నిర్మించేందుకు సిద్ధమవుతున్నా. ఓ డైరెక్టర్‌గా ఇప్పటివరకు నేను తృప్తిచెందలేదు. నాలోని దర్శకుడు ఏమాత్రం రాజీపడకుండా ఉండటం కోసమే నేను నిర్మాతగా మారుతున్నా. టైటిల్ పాత్రకు చాలామంది అనుష్కనే సూచించారు. అందుకే ఆమెను తీసుకున్నాం'' అని మనసులో మాట చెప్పారు గుణశేఖర్. భారతదేశంలోనే ఇది తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి సినిమా. కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన సెట్స్ వేస్తున్నారు.

సూర్యుడు - కాలచక్రం
ప్రియమణి టైటిల్ పాత్రధారిణిగా నటిస్తున్న చిత్రం 'అంగుళీక'. షూటింగ్ జరుగుతోంది. ప్రేమ్ ఆర్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యభగవానుడు, కాలచక్రానికి సంబంధించిన కథ. ఇద్దరు ప్రేమికుల మధ్యకు ఓ దుష్టాత్మ ప్రవేశిస్తే ఏం జరిగిందన్నది ఇందులో కీలకం. చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంత గొప్ప లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రియమణి చిత్ర ప్రారంభోత్సవంలో ప్రకటించారు. 'అరుంధతి' తరహా సినిమా అవుతుందని దర్శకుడు తెలిపారు.

ఛార్మి-శ్రియ
తెరపై గతంలో పలువురు ప్రముఖ నాయికలు వేశ్య పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఆ ఛాన్సును ఛార్మి, శ్రియ దక్కించుకున్నారు. ఛార్మి కీలక పాత్రధారిగా చందు 'ప్రేమ ఒక మైకం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

వేశ్య, గాయని, రచయిత మ«ధ్య సాగే చిత్రమిది. పులగం.సి.నారాయణ సంభాషణలు రాసిన ఈ చిత్రాన్ని టూరింగ్ టాకీస్ పతాకంపై డి.వెంకట సురేష్, కె. సూర్యశ్రీకాంత్ నిర్మిస్తున్నారు.

అగ్ర కథానాయకులందరి సరసన నటించిన శ్రియ తాజాగా వేశ్య పాత్రలో 'పవిత్ర'గా కనిపించనున్నారు. వేశ్య అయిన పవిత్రను ఓ అమాయక కుర్రాడు వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది?... అనే అంశాలతో తెరకెక్కుతున్న సినిమా ఇది. జనార్దన మహర్షి రచన చేస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆదేశ్ ఫిలిమ్స్ పతాకంపై కె. సాదక్‌కుమార్, జి. మహేశ్వరరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

త్రిష 'రమ్'
త్రిష కీలక పాత్రధారిగా ఎమ్మెస్ రాజు తెరకెక్కించనున్న చిత్రం 'రమ్'. ఈ నెల్లోనే షూటింగ్ మొదలవుతుందని తెలిసింది. ఈ సినిమా త్రిష కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరోవైపు బాలీవుడ్‌లో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించిన 'కహానీ'ని తెలుగులో తెరకెక్కించడానికి శేఖర్‌కమ్ముల కసరత్తులు చేస్తున్నారని వినికిడి. అదే నిజమైతే ఈ ఏడాది గతమెన్నడూ లేనన్ని మగువల ప్రాధాన్యతగల సినిమాలు తెరపై సందడి చేస్తాయి.

కొత్త తరహా సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఎలాగూ ఉన్నారు కనుక రచయితలు మహిళా శక్తిమీద దృష్టి సారిస్తే వైవిధ్యతను విజయం అనుసరిస్తుందనడంలో సందేహం లేదు.

No comments