1

Breaking News

ఎన్టీఆర్ 17వ వర్ధంతి

 అవినీతిపై రాజీలేని పోరాటం సాగిస్తేనే ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి అని, అవినీతిపై ఎన్టీఆర్ ఏరోజు రాజీ పడలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతు, పేదల కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, రాష్ట్రంలో ఎవరూ చేయలేని అభివృద్ధిని చేసిచూపించారన్నారు. ఉన్నత ఆశయాల కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని ఫణంగా పెట్టారని బాబు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 17వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం కోదాడలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను ఎవరూ మర్చిపోలేరని చంద్రబాబు పేర్కొన్నారు.

మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరదృష్టి లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంవల్లే ఈరోజు విదేశాల్లో మనవాళ్లు స్థిరపడ్డారని ఆయన గర్వంగా చెప్పారు. కాగా 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా జిల్లాలోని కోదాడ కిట్స్ కళాశాల విద్యార్ధులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. 

కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 17వ వర్థంతి సందర్భంగా శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమార్తె (చంద్రబాబునాయుడు సతీమణి) భువనేశ్వరి , మనుమడు లోకేశ్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉండ టం వల్ల తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. అంతకు ముందు రసూల్ పూరా నుంచి అమరజ్యోతి ర్యాలీని బాలకృష్ణ, లోకేశ్ ప్రారంభించారు. రసూల్‌పూరా నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments