open letter to kejriwal
కేజ్రీవాల్..
ఇప్పుడు దేశంలో ఈ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువేమో. మధ్యతరగతి కలల రూపం కేజ్రీవాల్.
మన రాజకీయాల్లో అవినీతిని అంతం చేయగల ఆశాకిరణం కేజ్రీవాల్. కానీ నిజంగా కేజ్రీవాల్
నేటి రాజకీయాలను సమూలంగా మార్చగలరా.. ఇవాళ
ఆయన ముందు కొవ్వొత్తులు పట్టుకుని నిల్చున్న జనమంతా రేపు ఎన్నికలొస్తే విజయహారతి పడతారా..
కొన్ని సందేహాలు, కొన్ని సలహాలతో ఇవాళ్టి ఓపెన్ లెటర్
డియర్ కేజ్రీవాల్
ఈ దేశానికి న్యాయ
శాఖ మంత్రి మిమ్మల్ని బెదిరిస్తున్నారు.. ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన కుటుంబం మీ పేరు
వింటేనే భయపడుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధాన ప్రతిపక్ష అధినేతకే ఎసరుపెట్టారు... ఇంకా
పార్టీ పెట్టకుండానే ఇన్ని విజయాలు చూస్తుంటే మీకేమో కానీ.. మాలాంటి సగటు భారతీయులకి
రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మా తరఫున ఎవరో ఒకరు పోరాడుతుంటే.. మాకు భలే ఉత్సాహంగా
వుంటుంది. ఫేస బుక్లో సగం పోస్టులు మీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎవరి ట్విటర్ ఎకౌంట్
చూసినా కనీసం మీ గురించి రోజుకొక ట్వీట్ అయినా
వుంటుంది.. మీరు పిలుపిస్తే.. చేతిలో ప్లకార్డులో, కొవ్వొత్తులో పట్టుకుని జంతర్ మంతర్
దగ్గర పోగవ్వడానికి వేలాది మంది సిద్ధంగా వుంటారు. ఇక హిందీ ఇంగ్లీష్ న్యూస్ ఛానెళ్లయితే
సాస్ బహు సీరియళ్ల కంటే, మీ సీరియలే బావుందంటున్నాయి. మీరు కూడా మరిన్ని వివరాలు మరి
కొన్ద్ది రోజుల్లో అని ఊరించి ఊరించి టెంపో మెయింటైన్ చేస్తున్నారు.. కొన్నాళ్ళు రాబర్ట్్
వదేరా సీరియల్ నడిచింది. అది ఇంకా క్లయిమాక్స్ కి రాకుండానే సల్మాన్్ ఖుర్షీద్ సీరయిల్
మొదలైంది. ఆ వెంటనే మరొకటి.. ఇవన్నీ చూస్తుంటే
మీకు కూడా హుషారుగానే వుండుంటుంది. ఇక రేపో మాపో పార్టీ అనౌన్స్్ చేసేయడం, ఎన్నికలు
రావడమే తరువాయి.. సరికొ్త్త ప్రజాతీర్పుతో ఈ దేశాన్ని ఎంతో కొంత మార్చేయొచ్చు అనిపిస్తూ
వుంటుంది.
నిజమే రాజకీయాల్లో
ఇదో కొత్త స్టయిల్. కొత్తగా పార్టీ పెట్టే వాళ్ళంతా మార్పు గురించి మాట్లాడడం రొటీనే..
ఇప్పుడు అధికారంలో వున్నవాళ్లు, గతంలో ఏలిన వాళ్ళు దేశాన్ని తినేసారని ఆడిపోసుకోవడం
ఇంకా రొటీన్.. అలా కాకుండా.., టీవీ చానెల్లో స్టింగ్ ఆపరేషన్లా, ఒక్కొక్క బడా నేత బాగోతాన్ని
డాక్యుమెంట్లతో సహా బయటపెట్టడం ఇంతవరకు ఏ పొలిటీషియనూ చేయలేదు. బహుశా ఈ కొత్తదనం వల్లే
మీకు అంత పాపులారిటీ వస్తోందేమో. కానీ.. ఆ పాపులారిటీ మీ పొలిటికల్ కెరీర్ కు పనికొస్తుందా..
మీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు వున్నంత ఆదరణ రేపు పెట్టబోయే మీ కొత్త పార్టీకి వుంటుందా..
ఐ యామ్ అన్నా టీషర్టులతో గాంధీ టోపీలతో మీ వెంట వచ్చే సోషల్ నెట్వర్క్ జనమంతా మీకు
వోట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారా.. మీ కృషి ఫలితంగా ఇవాళ కళంకితులుగా నిలబడ్డ బడా బడా
నేతలను జనం రేపు ఎన్నికల్లో ఛీ కొడతారా…
ఈ ప్రశ్నలన్నిటికీ
సమాధానాలు తెలుసుకోవాలంటే, ఓ పన్నెండేళ్ల క్రితం చీఫ్ ఎలక్షన్ కమిషనరగా పనిచేసిన టీ
ఎన్్ శేషన్ అనే పెద్దమనిషిని గుర్తు చేసుకోవాలి. ఆయన్ని కూడా ఇలాగే అర్బన్ మిడిల్ క్లాస్
జనాలు నెత్తిన పెట్టుకుని పూజించారు. అవినీతితో కుళ్లిపోయిన, ఈ సిగ్గుమాలిన రాజకీయాలను
ప్రక్షాళన చేయగలిగేది ఒక్క శేషనేనని కీర్తించింది. అది విని ఆయన కూడా పాపం నిజమే అనుకున్నాడు.
ఈ జనం మీద గంపెడాశలు పెట్టుకుని 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడ్డాడు.
సరే రాష్ట్రపతి ఎన్నికలంటే పరోక్షంగా జరిగేవి కదా.. ఈసారి నేరుగా జనంలోకే వెళ్దామని
1999 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా అద్వానీపైనే పోటీ చేసి అంత కంటే ఘోరంగా ఓడిపోయాడు. పార్టీ
పెట్టకముందే మీకు అపశకునం పలకాలని కాదుకానీ.. ఇంగ్లీష్ న్యూస్ చూసి, ఫేస్ బుక్లో పోస్ట్్
చేసి జనాల మైండ్ సెట్ కీ, క్యూలో నిలబడి వోట్లేసే జనాల మైండ్ సెట్ కీ చాలా తేడా వుంటుందని
మిమ్మల్ని హెచ్చరించడమే మా ఉద్దేశం. ఈ వోటర్ మైండ్ గేమ్ బాగా తెలుసు కాబట్టే ఈ దేశంలో
ప్రధానపార్టీలకు మీ లాంటి వాళ్ళను చూస్తే చీమ కుట్టినట్టు కూడా వుండదు. న్యాయశాఖ మంత్రిగా
వుంటూ సల్మాన్్ ఖుర్షీద్ ఓ రౌడీలా బెదిరించినా, కేంద్ర మంత్రికి డెబ్భై లక్షలు తినాల్సిన
ఖర్మేంటి.. డెబ్బై కోట్లయితే ఆలోచించాలి గానీ అని మరో కేంద్ర మంత్రి వెటకారమాడినా..
ఇదంతా మంత్రులకు వారి మీద వారికున్న నమ్మకం కాదు. ఈ దేశంలో వోటర్లమీద వున్న నమ్మకం.
ఈ వోటర్లకి కావలసింది మీలాంటి మర్యాదస్తులు
కాదు, తమ లాంటి వీధిరౌడీలేనని నమ్మకం. ఆ నమ్మకంతోనే వాద్రాను కాంగ్రెస్్ నేతలు అంతలా
వెనకేసుకొస్తున్నారు. ఈ దేశంలో అవినీతి ఒక మంచి టాపిక్. కాఫీ షాప్లలోనూ, టీ వీ షోల్లోనూ,
సోషల్్ నెటవర్కింగ్్ సైట్లలోనూ చర్చించుకోవడానికి పనికొచ్చే టాపిక్్.. అంతే కానీ అవినీతి
పరుడికి వోటు వేయకూడదని ఈ దేశంలో వోటర్లు ఎప్పుడూ అనుకోలేదు. ఇక ముందు అనుకుంటారని
రాజకీయనేతలకు భయం కూడా లేదు.
జనం మీకేం చేస్తారనేది
కాసేపు పక్కనపెడదాం.. మీరు జనానికి ఏం చేయబోతున్నారు. ఉద్యమాన్ని పార్టీగా మార్చిన
దగ్గర నుంచి మిమ్మల్ని పరిశీలిస్తున్న వారికి మీరో రాజకీయ నేతకంటే, రాబిన్ హడ్ ఇమేజ్
కోసం ఎక్కువ ఆరాట పడుతున్నట్టు అనిపిస్తోంది. మీరు బయటపెడుతున్న అవినీతి చరిత్రలు కొత్తవేం
కాదు. ఇప్పటికే పలు పత్రికల్లో, టీవీ చానెళ్ళలో వచ్చినవే. అక్కడో ఇక్కడో జనం నోళ్ళలో
నానుతున్నవే..వాటినే బయటపెట్టి జనం ముందు హీరో అనిపించుకుంటే చాలా.. ఇది కాక ఆ మధ్య
ఢిల్లీలో కరెంటు బిల్లులు కట్టొద్దని మీరే స్వయంగా కొన్ని మీటర్లను కత్తిరించేసారు.
ఇది మరో హీరోయిజమ్.. ఇవన్నీ పాపులర్ కావడానికి మీకు షార్ట్ కట్స్గా ఉపయోగపడతాయేమో కానీ..
జనానికి ఏం ఉపయోగం. అసలు మీ పార్టీ ఆశయమేంటి.. అది సాధించబోయే లక్ష్యమేంటి. ఈ దేశంలో
వాస్తవంగా జనం ఎదుర్కొంటున్న సవా లక్ష సమస్యలకు మీ కార్యాచరణ ఏంటి. ఈ దేశరాజధాని ఢిల్లీ
రేప్్ క్యాపిటల్ గా పేరుతెచ్చుకుంటోంది.. దాని గురించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలే అత్యాచారానికి గురయి బాధపడతున్న బాధితుల గురించి
సిగ్గు శరం లేని నేతలు నాలుకకి నరం లేనట్టుగా మాట్లాడడం ఎంతనేరమో, మీలాంటి బుద్ధి జీవులు
అదసలు సమస్యే కాదన్నట్టు మౌనంగా వుండడం అంతకంటే నేరం.
ఇప్పటికైనా మించిపోయింది లేదు కేజ్రీవాల్్జీ.. ఈ షార్ట్్ కట్స్్ మోజు నుంచి బయటకి రండి.. ఎసి రూముల్లో కూర్చుని మీ కు లైక్ కొట్టే ఫేస్ బుక్ యూజర్స్ ప్రపంచం నుంచి బయటకి రండి. ఈ దేశంలో ఆకలి వుంది..అరాచకత్వం వుంది, నిరుద్యోగం వుంది.. కుల వివక్ష వుంది. స్ర్తీ హింస వుంది. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చంపేసే రాక్షసత్వం వుంది.. ఇవన్నీ రాబర్ట్్ వాద్రా అవినీతి అంత గ్లామరస్ సబ్జెక్టులు కాకపోవచ్చు. గడ్కారీ అవినీతి లాగా నైన పిఎమ్ న్యూస్ హెడ్ లైన్స్ కాకపోవచ్చు. కానీ.. ఒకరాజకీయపార్టీగా మి్మల్ని ఈ దేశ సగటు వోటరు గుర్తు పెట్టుకోవాలంటే.. మీరు జనం సమస్యలపై దృష్టి పెట్టాల్సిందే..
No comments