open letter to kcr
Open letter to kcr
తెలంగాణ
పై కాంగ్రెస్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం సోనియా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి,
హోం మంత్రి .. అందరూ దీని గురించే మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ వాదులందరిలోనూ గూడు
కట్టుకున్న నమ్మకమిది. ఎందుకింత నమ్మకం. ఒక పక్క ఢిల్లీ కాంగ్రెస్ నేతలే స్వయంగా తెలంగాణ
అంత తేలికగా తేలేది కాదని చెప్తున్నారు. ఇటు కే సి ఆర్ కూడా తానెవరితో మాట్లాడారో..
వాళ్ళేం హామీ ఇచ్చారో స్పష్టంగా చెప్పరు. అయినా తెలంగాణ వాదులు రాష్ట్ర విభజన ఎంతో
దూరంలో లేదని ఎలా నమ్ముతున్నారు. అదే కే సి ఆర్ మేజిక్.. అయితే, ఈ మేజిక్ ఎంత కాలం
పనిచేస్తుంది.. అసలు తెలంగాణ రావాలంటే ఏం చేయాలి… ఇవాళ్టి ఓపెన్ లెటర్లో చూద్దాం..
కెసిఆర్
గారూ..
మీరు
ఫామ్ హౌస్్లో న్యూస్ చానెళ్ళు చూస్తూనే వుండుంటారు. నిన్న సోనియా రాష్ట్రపతి ప్రణబ్
తెలంగాణ గురించే మాట్లాడుకున్నారని, రేపో ఎల్లుండో తెలంగాణ ప్రకటన వచ్చేస్తుందని మా
జర్నలిస్టు మిత్రలు తెగ ఫోనిన్లు ఇచ్చేస్తున్నారు. ఎవరికంటికీ కనిపించని విశ్వసనీయ
వర్గాలు ఇప్పుడు ఈ సమాచారాన్ని కూడా తెరపైకి తెచ్చాయి. ఈ వార్తలను చూసి మీరు నవ్వుకుంటున్నారో..
నిజమే అనుకుంటున్నారో మాకు తెలియదు. అసలు మీరు నోరు తెరిచి మాట్లాడితే వినాలని ఇవాళ
కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య మీరు ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలిసారు..
ఏం చేసారు.. వారికి మీరేం చెప్పారు.. వాళ్ళు మీకు ఏం హామీ ఇచ్చారు. ఇలా జనం మదిలో ఎన్నో
సందేహాలు. అసలు మీరు ఏ ధైర్యంతో అంతకు ముందు ఆగస్టు డెడ్ లైన్ అనుకున్నారు. మీకు అందిన
ఢిల్లీ సంకేతాలేంటి.. అవి ఎవరిచ్చారు.. వున్నట్టుండి మీరు కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి
అన్నాళ్ళు ఎందుకు మంతనాలు జరిపారు. చివరికి అక్కడేమైందే ఒక్క ముక్క కూడా చెప్పకుండా
కామ్ గా వచ్చి ఇలా ఫామ్ హౌస్ లో ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నెన్నో ప్రశ్నలు..
సమాధానాలే లేవు. అన్నీ ఊహగానాలే.
అసలు
రాజకీయాల్లో ఇదో కొత్త ట్రెండ్. మామూలుగా రాజకీయనాయకులు చెప్పే విషయాలనే జనం నమ్మరు.
మీరు నోరు తెరవకుండానే, ఏమీ చెప్పకుండానే.. జనంతో చాలా విషయాలను నమ్మించగలరు. మిగిలిన
రాజకీయపార్టీలన్నీ జనం తమనెక్కడ మర్చిపోతారో నని వారి మధ్యలోకే యాత్రలు కడుతుంటే, అసలు
మీరెక్కడున్నారో తెలియకపోయినా.. జనం మీగురించే మాట్లాడుకునేలా చేయగలరు. పదకొండేళ్ళుగా తెలంగాణ అంశం రాష్ట్రంలోనే కాదు, ఈ
దేశ రాజకీయాల్లో ఇంత వేడివేడి చర్చనీయాంశంగా వుందంటే అది మీ చలువే. మీరు మాట్లాడితే
వార్త, మాటలాడకపోతే వార్త. జనంలోకి వస్తే వార్త. రాకపోతే వార్త. మీ పార్టీ ఎన్నికల్లో
గెలిస్తే వార్త, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వార్త. అయితే, మాలాంటి వాళ్ళకు ఒకటే
సందేహం.. మీ ఉనికే ఇంత సంచలనమైనప్పుడు, మీ ప్రతి చర్యా ఒక ప్రధాన వార్త అయినప్పుడు
మీ డిమాండ్ ఎందుకు నెరవేరడం లేదు. తెలంగాణ రాష్ట్రం కల ఎందుకు సాకారం కావడం లేదు. కేంద్రం
ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు. 2009 డిసెంబరు ప్రకటన తర్వాత ఈ మూడేళ్ళలో
తెలంగాణ ఉద్యమం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి ఎందుకేస్తోంది..
ఈ
ప్రశ్నలన్నిటికీ నిజానికి మీరే సమాధానం చెప్పగలరు. కానీ మీరు ఆ పని చేయరు. ఎవరికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం
లేదనుకుంటారు. ప్రజాస్వామ్యంలో జనానికి నేతలెంత ముఖ్యమో, నేతలకి జనం కూడా అంతే ముఖ్యం.
కానీ మీ విషయంలో మాత్రం జనం మీ పిలుపుకు స్పందిస్తారే తప్ప మీరు జనం పిలుపుకి అందనంత దూరంలో వుంటారు. మీ లక్ష్యాన్ని
సాధించడానికి మీకో వ్యూహం వుండొచ్చు. కానీ వ్యూహం చుట్టూ అల్లుకున్న మౌనం మిమ్మల్ని
మీ లక్ష్యానికి దూరం చేస్తోందని మీకు తెలుసా. ఏ ప్రజలైతే మీ పిలుపు విని ప్రాణత్యాగానికి
సైతం సిద్ధపడతారో.. ఆప్రజలకు కనీసం మీరేం చేస్తున్నారో.. ఎవరితో చర్చిస్తున్నారో.,
ఆ చర్చల్లో ఏం సాధించారో ఏం సాధించలేకపోయారో.. తెలుసుకునే హక్కు లేదా.. కేవలం సామాన్య తెలంగాణ ప్రజలకే కాదు. ఇవాళ టీ ఆర్్
ఎస్ నేతలకు, కేడర్ కు కూడా మీ మనసులో ఏముందో తెలియదు. నాగార్జున సాగర్ నీటి విడుదల
మొదలుకుని ఇటీవల జరిగిన అనేక పోరాటాల్లో మీ వైఖరేంటో మీరు చెప్పలేదు. అసలు రాజకీయంగా కాంగ్రెస్ తమకు మిత్రపక్షమో, శత్రు పక్షమో కూడా
ఇవాళ టీ ఆర్ ఎస్ నేతలకు తెలియదు. ఒకపక్క దసరాకో, సంక్రాంతికో కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందని
చెప్తారు. మరో పక్క కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చెయ్యాలంటారు. తెలంగాణను కాంగ్రెస్్
పార్టీనే ఇస్తున్నప్పుడు మరి మంత్రుల రాజీనామాలెందుకని ఇప్పుడు మా పార్టీనేతలకే సందేహాలున్నాయి.
వాటిని మీరు తీర్చరు. దీనికి తోడు ఇటు ఉద్యమంలోనూ, అటు రాజకీయాల్లోనూ టీ ఆర్ ఎస్్ కాక,మరెవ్వరు
తెలంగాణ ఊసెత్తినా మీరు సహించలేరన్న వాదన ఒకటుంది. చివరికి మీరే పెంచి పోషించిన కోదండరామ్
అయినా, తనంతట తానుగా తెలంగాణ కోసం ఉద్యమిస్తే మీరు సహించలేరని ఇప్పుడు తెలంగాణ జనం
అంతా నమ్ముతున్నారు. ఆ నమ్మకం తప్పయితే అదైనా మీరే చెప్పాలి. కానీ మీ మౌనం ఆ సందేహాలు
నిజమన్న అభిప్రాయాన్నే కలిగిస్తోంది.
ఈ
మొత్తం పరిణామాలన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది.. మీ మౌనం వల్లే మీకు తెలంగాణ ప్రజలకు
మధ్య దూరం పెరుగుతోందని అనిపిచండం లేదా.. ఆ దూరం కారణంగానే తెలంగాణ డిమాండకు ఇవాళ అనేక
శిబిరాలు పుట్టుకొస్తున్నాయని అనిపించడం లేదా.. ఉద్యమం వికేంద్రీకరణ కావడం వల్లే మీ
ఢిల్లీ లాబీయింగ్ పస తగ్గిందని అనిపించడం లేదా..దీనికి తోడు మీరు పెట్టే గడువులు, మీకందే
సిగ్నల్స్ .. ఇవన్నీ పాకెట్ కార్టూన్లుగా మారిపోవడం మీరు గమనించడం లేదా..
ఇప్పటికైనా
మించిపోయింది లేదు కెసి ఆర్ గారూ.. మీ మౌనం విడండి..మీ స్టైల్ మార్చండి.. ఎన్నికలు,
రాజీనామాలు, మళ్ళీ ఎన్నికలు.. ఈ పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టండి. ముందుమీ మనసులో ఏముందో
ప్రజలకు తెలియనివ్వండి. తెలంగాణ ఉద్యమంకోసం పోరాడుతున్న పార్టీలను, ఉద్యమశక్తులను కలుపుకుపోండి.
అందరినీ ఒకతాటి మీదకు తెచ్చి, సామూహికంగా పదవులకు రాజీనామలు చేయండి. పూర్తిగా ఎన్నికలకు
దూరంగా వుండండి. ఆ దెబ్బకి రాష్ట్రంలో కలిగే సంచలనాలకు ఢిల్లీ దిగిరాకపోతే అప్పుడడగండి.
No comments