I&PR@AP CMO, VIJAYAWADA
Govt.of Andhra Pradesh
22.10.2015
రాజధాని అభివృద్ధిలో జపాన్ సహకారం
పారిశ్రామిక నగరాల రూపకల్పన,
కృష్ణపట్నం పోర్టు, విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం
వ్యవసాయ సాంకేతికతకు చేయూత
ఎంవోసీపై సంతకాలు చేసిన సీయం చంద్రబాబు, జపాన్ ‘మేటీ’ మంత్రి యొసుకే టకాగి
విజయవాడ : జపాన్-ఏపీ పరస్పర సంబంధాల మజిలీలో మలి అడుగు పడింది. ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణంలో జపాన్ భాగస్వామిగా మారింది. ఇదేగాక, అర్బన్ డెవలప్‌మెంట్, కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి, సూపర్ పవర్ ధర్మల్, అ్రగికల్చరల్ టెక్నాలజీ వంటి రంగాలలో జపాన్ మనతో కలిసి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని అభివృద్ధి, పారిశ్రామిక సహకారంపై జపాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ-ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (మేటి), ఏపీ ప్రభుత్వాల మధ్య గురువారం ఉదయం విజయవాడ హోటల్ గేట్‌వేలో ఎంవోసీ (మెమొరాండమ్ ఆఫ్ కో-ఆపరేషన్) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు, జపాన్ ‘మేటీ’ మంత్రి యొసుకే టకాగి పాల్గొని ఎంవోసీపై సంతకాలు చేశారు. అలాగే, రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధిపై ఏపీ ఆర్థిక శాఖ, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ మధ్య ఎంవోయూ జరిగింది. దీనిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పీవీ రమేశ్, జపాన్ బ్యాంక్ (జేబీఐసీ) సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ డిపార్టుమెంట్ డైరెక్టర్ జనరల్ నోరికో నసు సంతకాలు చేశారు.
గతంలో తన జపాన్ పర్యటన సందర్భంగా ఆయా అంశాలపై కుదిరిన ప్రాధమిక ఒప్పందాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. జపాన్ సాంకేతికంగా, ఆర్థికంగా, పాలనాపరంగా ఎంతో సుసంపన్నమైన దేశమని, ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలుగా సహకారం అందించేందుకు ప్రధాని అబే ఎంతో ఆసక్తి చూపించారని సీయం గుర్తుచేశారు. ఎంతో శుభప్రదమైన విజయదశమి రోజున ఈ ఒప్పందాలు చేసుకోవడం సంతోషదాయకమని ముఖ్యమంత్రి అన్నారు. జపాన్-భారత్ సంబంధాలలో ఇది మేలిమలుపుగా అభివర్ణించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన జపాన్ జైకా, జెట్రో, నెడో, జేబీఐసీ, ఎంఎల్ఐటీ, ఎంఏఎఫ్ఎఫ్ బృందాలను శ్రీ చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈరోజు ‘బిగ్‌డే’ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. తూర్పుతీరానికి త్వరలో ఏపీ ముఖద్వారంగా మారనుందని జపాన్ ’మేటీ‘ మంత్రి యొసుకే టకాగి జోస్యం చెప్పారు. వ్యక్తిగతంగా తనకు చంద్రబాబు నాయుడు మంచి మిత్రుడని అన్నారు.
కొత్త రాజధాని అభివృద్దిలో జపాన్ భాగస్వామ్యం
రాజధాని ప్రాంతంలో రవాణా మౌలిక సదుపాయాల కల్పనలో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ది చేయడానికి జపాన్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారాన్ని జైకా అందిస్తుంది. భవిష్యత్తులో పరస్పర సహకార పద్దతిలో విజయవాడ మెట్రో రైలు సహా పలు మెట్రో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు. రాజధాని ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి కూడా జపాన్ సహకారం అందిస్తుంది. పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన, ఇంటలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ( ఐటీఎస్), కాంప్రహెన్సీవ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, తదితర రంగాలలో తోడ్పాటునందిస్తుంది.
కృష్ణపట్నం పోర్టు అభివృద్దిలో కూడా జపాన్ సహకారం అందిస్తుంది. చెన్నయ్-బెంగుళూరు పారిశ్రామిక క్యారిడార్ అభివృద్ధిలో పాలు పంచుకుంటుంది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, సమృద్ధిగా నీరు, విశాలమైన రహదారుల నిర్మాణం వంటి అంశాలలో వేగవంతమైన అభివృద్ధి కోసం ‘జైకా’ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. పోర్టుల అభివృద్ది, ఇండస్ట్రియల్ క్లష్టర్ల ఏర్పాటులో ప్రయివేటు భాగస్వాములతో కలిసి జపాన్ ఎంఎల్ఐటీ, మేటీ పనిచేయనున్నాయి. అంతేగాక, ఓడరేవుల అభివృద్ధికి సంబంధించిన వ్యూహరచనకు ఎంఎల్ఐటీ మన రాష్ట్రప్రభుత్వానికి సహకారం అందిస్తుంది.
జపాన్ వ్యవసాయ విధానాల రూపకల్పనలో సహాయపడిన ‘ఎంఎఎఫ్ఎఫ్’ ఇతర జపాన్ ప్రభుత్వ ఏజన్సీలతో కలిసి పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు సహకరిస్తుంది. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ ఛెయిన్స్ ఏర్పాటుచేసి వ్యవసాయంరంగానికి తోడ్పాటునిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అల్ర్టా సూపర్ క్రిటికల్ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుకు అవకాశాలపై అధ్యయనం చేయడానికి ‘నెడో’ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. అలాగే, గత ఏడాది నవంబరు నెలలో జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా స్మార్ట్ కమ్యూనిటీ, పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్ధ్యం, ఇంథన నిల్వ తదితర అంశాలలో జపనీస్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు.
‘ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టిమెంట్ టాస్క్ ఫోర్స్ ఇన్ జపాన్’ (ఎపీఐటీ) పేరుతో ఒక సంస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందులో ఇరు ప్రభుత్వాల సంబంధిత మంత్రులు, అధికారులు, శాఖలు,సంస్థలు వుంటాయి. ఈ సంస్థ ఏపీలో శీఘ్రగతిన పారిశ్రామిక అభివృద్ధి జరపడానికి సహకరిస్తుంది
No comments