1

Breaking News

2019 లో అధికారం కోసం పోరాటం

తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నాయకుల్లో ఉన్న అసంతృప్తి వెళ్ళగక్కుకోవడానికి వేదికయ్యింది. తెలంగాణలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నలుగురు నేతలో కమిటీ కూర్పు, తమకు ఇస్తున్న ప్రాధాన్యతలపై బహిరంగంగానే తమ అసమ్మతిని వెలిబుచ్చారు. జాతీయ పార్టీగా అవతరించామని సంబరపడుతున్న తెలుగుదేశం పార్టీ లో ఇప్పుడు తెలంగాణ తమ్ముళ్ళ లొల్లి పార్టీ ని కలవర పెడుతోంది. అసలే బేజారుగా ఉన్న తెలంగాణ సైకిల్ ని రిపేర్ చేద్దామని భావిస్తున్న అధినేతకు అసమ్మతి అడ్డుపడుతోంది.  
చాల అట్టహాసంగా జరిగిన తెలుగు దేశం ప్రమాణ స్వీకార వేడుక లో అసమ్మతి రాగం వినిపించింది. ప్రధానంగా  ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరావు, కృష్ణయాదవ్ లు డుమ్మ కొట్టారు. వారి అనుచరులు వచ్చినా ముభావంగా ఉన్నారు. ప్రస్తుతం శాసన సభ పక్ష నేత ఎర్ర బెల్లి దయకరావు మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యత పట్ల అసహనంతో ఉన్నారు. చాలకాలం అమెరికాలో ఉంటూ ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున రేవూరు ప్రకాష్ రెడ్డికి కీలక మైన పదవి కట్టబెట్టినందుకు అలిగి ఈ కార్యక్రమానికి గైర్హాజరైనట్లు ఎర్రబెల్లి సన్నిహితులు అంటున్నారు.
ఇక సీనియర్ నాయకుడు  మాజీ మంత్రి తెలంగాణలో గట్టి నేత పెద్ది రెడ్డి కూడా అలిగి కూర్చున్నారు. రెండు రాష్ట్రల సంస్థాగత ఎన్నికల సమయం లో సేవలు అందించినా... జాతీయ ఉపాధ్యక్ష పదవి తనకు ఇవ్వకుండా గరికపాటి కి అప్పగించడం ఫై కినుకు వహించారు. అందుకే నేటి వేడుకకు డుమ్మ కొట్టారు. గతం లో మంత్రి గా పనిచేసిన మండవ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు పదవి అప్పగించినా సమర్ధంగా నిర్వర్తించే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తలసాని టి అర్ ఎస్ పంచకు వెళ్ళిన సమయంలో నగర పార్టీకి అండగా నిలబడ్డ నన్ను కాదని మాగంటి గోపీనాథ్ కు హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇవ్వడంపై మాజీ మంత్రి కృహ్ణయాదవ్ ఆగ్రహంతో ఉన్నట్లు ఆయన అనుచరులు చెపుతున్నారు. హైదరాబాద్ లో బిసి లను తెలుగు దేశం దూరం చేస్తోంది  అనే బాధతో కృష్ణ యాదవ్ కూడా ఈ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినా స్టేజి ఫై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత రెడ్డి  వర్గం కూడా ప్రమాణ స్వీకర వేడుకలో అసంతృప్తిని వెలిబుచ్చారు. మొత్తం మిద వేడుక కు తెలంగాణ నుంచి  పలచగా జనం వచ్చారు. దీనికి అసమ్మతి సెగే కారణంగా కనిపిస్తోంది. చాల మంది పని చేసిన వారిని పక్కన పెట్టి సామజిక సమీకరణాల సాకు చూపించి కమిటీ కూర్పు జరిగిందని అసమ్మతి వర్గం అంటోంది. ఓ వైపు తెలంగాణ లో 2019 లో అధికారం కోసం పోరాటం చేయలని అధినాయకుడు పిలుపునిస్తుంటే...నాయకుల్లో అసంతృప్తి సైకిల్ వేగానికి బ్రేకులు వేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై శీతకన్నేసిన చంద్రబాబు పార్టీ నేతల అలకలు తీర్చి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారో లేక తెలంగాణ తమ్ముళ్ళను వారి మానాన వారిని వదిలేస్తారో కాలమే చెప్పాలి.

No comments