1

Breaking News

కేదారనాథ్ చాలా ఘోరంగా దెబ్బతింది

ఉత్తరాఖండ్ జల ప్రళయంలో బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలకు మరో పదిహేను రోజులవరకు పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తెలిపారు. హిమాలయ విలయం సంభవించిన ప్రాంతాలకు దారితీసే రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నందువల్ల ప్రజల్ని తరలించేందుకు కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. 'ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ప్రాణభయం లేదు. ఇది మహా విషాదం. ఈ ప్రకృతి వైపరీత్యానికి ఎందరో బలయ్యారు. ఉత్తరాఖండ్‌ను పునర్నిర్మించాలంటే చాలా కాలమే పడుతుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రం కేదారనాథ్ చాలా ఘోరంగా దెబ్బతింది. కనీసం మరో రెండేళ్ల వరకు కేదార్‌నాథ్ యాత్ర ఉండదు' అని బహుగుణ చెప్పారు.

మృతుల గురించి మాట్లాడుతూ- 'శిథిలాల కింద చాలామంది సమాధి అయి ఉంటారని అంటున్నారు' అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అన్నారు. జలప్రళయం రాబోతున్నట్టు వాతావరణ కార్యాలయం ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించడంపై మాట్లాడుతూ -'జలప్రళయం వస్తుందని మాకెవ్వరూ ముందుగా చెప్పలేదు. హెచ్చరించలేదు' అన్నారు. ఇలాంటి విషాదాల్ని ఎదుర్కొనడంలో ప్రభుత్వం ముందుగా సంసిద్ధంగా లేకపోవడం గురించి కూడా ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని అడిగారు. 'ప్రకృతి విపత్తులను ముందుగానే పసికట్టే డాప్లర్ రాడార్‌లను నెలకొల్పాలనే ప్రభుత్వం ఎంతో ఆసక్తితో ఉంది. కానీ, వివిధ మంత్రిత్వశాఖలకు కొన్ని అభ్యంతరాలున్నాయి' అని చెబుతూ బహుగుణ- సహాయక బృందాల్ని పంపించడంలో ఆలస్యం జరిగిందనడాన్ని ఖండించారు. 'ప్రకృతి కలిగించిన ఈ ఉపద్రవం చాలా తీవ్రమైంది. పెద్దది. కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎదుర్కోలేకపోవచ్చు' అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కనీవినీ ఎరగని ఈ విషాదంలో మృతుల సంఖ్య 680కి పెరిగిందని, ఇంకా పెరగవచ్చని, వెయ్యి మందికి చేరుకోవచ్చని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి చెప్పారు. కేదారనాథ్ ప్రాంతం నుంచి తాజాగా 123 మృతదేహాలను వెలికితీశారు. కేదార్‌నాథ్‌లో బాధితులందరినీ తరలించని పిమ్మట విపత్తు నిర్వహణా అధికారులు ఇప్పుడు తమ దృష్టిని బదరీనాథ్‌పై కేంద్రీకరించారు. ఇక్కడ 7,000-8,000 మందిని తరలించాల్సి ఉంది.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కనుగొన్న మృతదేహాలకు సాంప్రదాయ రీతిలో అంత్యక్రియలు నిర్వహించినట్టు బహుగుణ చెప్పారు.

హిమాలయ సునామీ బాధితుల్ని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలించే కార్యక్రమం రెండు రోజుల అనంతరం ఆదివారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. వాతావరణం సరిగా లేనందువల్ల సహాయ కార్యక్రమాల్ని రెండు రోజులు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 22,000 మందిని తరలించేందుకు ఐటిబిపి జవాన్లు బదరీనాథ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో కాలి మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని ఐటిబిపి డిఐజి అమిత్ ప్రసాద్ ఆదివారం గౌచార్‌లో విలేకరులకు చెప్పారు. రుద్రప్రయాగ్ జిల్లా ప్రాంతంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో దాదాపు 500 మంది చిక్కుకుపోయారు. సాధ్యమైనంత త్వరగా వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఐడిబిపి డిఐజి తెలిపారు.
సోమవారం నుంచి ఈ ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు పడవచ్చని వాతావరణశాఖ తెలియజేయడంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిని వేగవంతం చేసినట్టు అధికారులు తెలిపారు. వాతావరణం ప్రతికూలంగా ఉండి, వైమానిక సహాయక కార్యక్రమాలకు అంతరాయం కలిగినా, కాలిబాటల నిర్మాణంతో బాధితుల్ని తరలించే వీలుంది. ఆలయానికి సమీపంలో మానా ఔట్ పోస్ట్ వద్ద నిర్మించే ఈ కాలిబాట నిర్మాణంలో దాదాపు 200 మంది ఐటిబిపి జవాన్లు నిమగ్నమై ఉన్నారు' అని ఆయన చెప్పారు. వరదలకు బాగా దెబ్బతిన్న రుద్రప్రయాగ, ఛమోలి, ఉత్తరకాశి జిల్లాల నుంచి ఇప్పటివరకు 70 వేలమంది యాత్రికుల్ని తరలించారు. ప్రసిద్ధ హిమాలయ పుణ్య క్షేత్రాలు కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. 40కి పైగా హెలికాప్టర్లు, పదివేల మంది సైన్యం, పారా మిలిటరీ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
ఇలా ఉండగా డెహ్రాడూన్, జోషీమఠ్‌లలో సాధారణ వర్షాల వల్ల ఆదివారం ఉదయం సహాయ కార్యక్రమాలు ప్రారంభం కావడంలో ఆలస్యం జరిగింది. కానీ ఓ గంట తర్వాత, వాతావరణం అనుకూలించడంతో సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

No comments