1

Breaking News

అంతిమ 'సం స్కారం' కరువై....

 'హరహర మహదేవ' నినాదాలతో దద్దరిల్లిన హిమగిరుల్లో ఇప్పుడు రాబందుల రెక్కల చప్పుడు వినిపిస్తోంది. 'మహా శ్మశానాన్ని' తలపిస్తోంది. ఎటు చూస్తే అటు శవాలు... కుళ్లుతూ... నానుతూ..రాబందులకు ఆహారమవుతూ! మృతులకు అంతిమ 'సం స్కారం' కూడా కరువైంది. వందలు, వేల సంఖ్యలో మృతులు! వారెవరో...ఎక్కడి వారో...వారికి సంబంధించిన వారు ఎక్కడున్నారో ఏమీ తెలియదు! బతికున్న వారినే సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి లేదు. ఇక... మృతదేహాలను ఎక్కడికి, ఎలా తీసుకెళ్లేది? దీంతో మృతదేహాలను నదిలో పడేస్తున్నారు. అదే వారికి దక్కే అంతిమ సంస్కారం! 'ఏమిటీ ఘోరం?' అని ప్రశ్నిస్తే...'ఇంతకంటే ఏమీ చేయలేం!' అనేదే సమాధానం. టన్నుల బురద కింద ఎన్ని శవాలున్నాయో ఎవరికే తెలియదు! వాటిని బయటికి తీసే అవకాశం కూడా లేదని చెబుతున్నారు.

అంటే... వీరంతా సజీవంగా 'శాశ్వత సమాధి' అయిపోయినట్లే! ఇక... కొండదారుల్లో ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు కనిపిస్తున్నాయి. బాధితులు ఆ శవాల మధ్యే నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. "గౌరీకుండ్ నుంచి సీతాపూర్‌కు చేరేవరకు, 20 కిలోమీటర్లు కుళ్లిన శవాల మధ్యే నడుచుకుంటూ వచ్చాం. రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని అలాగే చనిపోయిన వ్యక్తి మృతదేహం ఇప్పటికీ నా కళ్లముందు మెదులుతోంది'' అని చెన్నైకి చెందిన విఘ్నేశ్వరన్ పేర్కొన్నారు. ఒక్క దారిలోనే పరిస్థితి ఇలా ఉంది! ఇక... ఇతర మార్గాల్లో ఎన్నెన్ని శవాలున్నాయో లెక్కేలేదు. 'మా కళ్ల ముందే ఎంతో మంది కొట్టుకుపోయారు. వెయ్యీ రెండువేలు కాదు... మృతుల సంఖ్య 15వేల వరకు ఉంటుంది' అని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


సామూహిక అంత్యక్రియలు...
ఉత్తరాఖండ్‌లో వరద ఉప్పొంగి పదిరోజులు అవుతోంది. దీంతో ఎక్కడికక్కడ మృతదేహాలు కుళ్లి వాసన వస్తున్నాయి. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేదార్‌నాథ్ సహా పలు పుణ్యక్షేత్రాల్లోనే పెద్దసంఖ్యలో మృతదేహాలున్నాయి. మరీముఖ్యంగా...కేదార్‌నాథ్‌లో బాధితులందరినీ తరలించేశారు. ఇప్పుడు అక్కడ మృతదేహాలే ఉన్నాయి! వీటికి అక్కడికక్కడే అంత్యక్రియలు నిర్వహించవచ్చా? అలా చేయడంవల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లదా? అనే సందేహాలు తలెత్తాయి. దీంతో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే శంకరాచార్య స్వామి సరూపానందతోసహా పలువురు స్వాములను సంప్రదించారు. "మృతదేహాలకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు నిర్వహిస్తే... ఆలయ పవిత్రతకు ఎలాంటి భాగం వాటిల్లదు' అని స్వామీజీలు బదులిచ్చారు.

దీంతో... ఉత్తరాఖండ్ ప్రభుత్వం, సైన్యం,ఇతర వర్గాలు సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాయి. అయితే...ఇది కూడా అంత సులువు కాదు! అంత్యక్రియలకోసం భారీగా కలప, నెయ్యి, కిరోసిన్ వంటివి అవసరం. వీటిని తరలించేందుకు వైమానిక దళం ఏకంగా మూడు ఎంఐ-17 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. హెలికాప్టర్ల ద్వారా అంత్యక్రియలకు అవసరమైన ఇతర సామగ్రిని తరలిస్తున్నట్లు వైమానిక సిబ్బంది తెలిపారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యేసరికి వారం రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దహన సంస్కారానికి ముందు మృతుల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. వీటిని ఉత్తరాఖండ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మృతుల డీఎన్ఏ శాంపిల్స్‌ను కూడా భద్రపరుస్తున్నారు. మృతులను గుర్తించేందుకు కేంద్రం, ఉత్తరాఖండ్ కలిసి ఉమ్మడి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశాయి.


శవాలనూ దోచేస్తున్నారు...
ఉత్తరాఖండ్ వరదల్లో మానవత్వం కూడా కొట్టుకుపోయింది. శవాలను కూడా దోచుకునే దరిద్రపు దొంగలు తయారయ్యారు. "శవాలపై ఉన్న బెల్టులు, ఇతర విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. ఇది నేను కళ్లారా చూశాను'' అని గౌరీకుండ్‌లో దుకాణం నడిపే బీరేంద్ర సింగ్ అనే నేపాలీ తెలిపారు. అయితే... నేపాల్ నుంచి వచ్చిన వారే ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సీతాపూర్‌లో బ్రాస్‌లెట్ కోసం ఒక శవం చేతిని కోస్తున్న దృశ్యం ఒకటి బయటపడింది. "దొంగతనాలు జరుగుతున్నాయి. కొందరి వద్ద భారీస్థాయిలో నగలు, డబ్బు కనుగొన్నాం. వారిని పోలీసులకు అప్పగించాం''అని సైనికాధికారులు తెలిపారు.

No comments