1

Breaking News

infosys

ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్ అంచనాల కంటే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. పైగా మార్కెట్ వర్గాల ఆలోచనకు భిన్నంగా ప్రోత్సాహకరమైన భవిష్యత్ అంచనాలను ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్‌లో షేర ధర కదం తొక్కింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రాబడి 10,424 కోట్ల రూపాయలుండగా నికరలాభం 2,369 కోట్ల రూపాయలుంది. రాబడి గత ఏడాది ఇదే కాలం (9,298 కోట్ల రూపాయలు)తో పోలిస్తే 12 శాతం పెరిగింది. నికర లాభం మాత్రం (2,372 కోట్ల రూపాయల) స్వల్పంగా తగ్గింది. అనిశ్చిత పరిస్థితుల మధ్య కూడా ఈ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించినట్టు ఇన్ఫోసిస్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌డి శిబులాల్ చెప్పారు.

భారీ డీల్స్‌కు సంబంధించి ఆర్డర్లు తమ విశ్వాసాన్ని పెంచినట్టుగా ఆయన వివరించారు. గత కొన్ని త్రైమాసికాలతో పోలిస్తే తొలిసారిగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో క్లయింట్ల సంఖ్య కూడా బాగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ త్రైమాసికంలో 70 కోట్ల డాలర్ల విలువజేసే 8 పెద్ద కాంట్రాక్టులను గెలుచుకున్నట్టు వివరించారు. 2013 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాబడి అంచనాలను 734 కోట్ల డాలర్ల నుంచి 745 కోట్ల డాలర్లకు ఇన్ఫోసిస్ పెంచింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 6.5 శాతం ఎక్కువ. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఇన్ఫోసిస్ రాబడిలో 8 -10 శాతం వృద్ధి అంచనా వేసింది. ఆ తర్వాత దీనిని 5 శాతానికి తగ్గించింది.

అంతర్జాతీయంగా నెలకొని ఉన్న అనిశ్చితి, అమెరికాలో ఐటి వ్యయం మరింత తగ్గే అవకాశం ఉందన్న వార్తలతో రాబడి అంచనాలను ఇన్ఫోసిన్ మరింత తగ్గిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా ఇన్ఫోసిస్ అంచనాలను పెంచడం మార్కెట్‌ను సంభ్రమపర్చింది. గైడెన్స్ పెంచడం కంపెనీలో పెరిగిన విశ్వాసాన్ని సూచిస్తోందని, ఇది మంచి సంకేతమని పరిశీలకులు అంటున్నారు. మరో రెండు త్రైమాసికాలు ఫలితాల సరళి ఇదే విధంగా ఉంటే కంపెనీకి మంచి రోజులు వచ్చినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. ఇన్ఫోసిస్ రాబడిలో 80 శాతం అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచే లభిస్తుంది. కొద్దికాలం క్రితం టేకోవర్ చేసిన స్విట్జర్లాండ్ కంపెనీ లోడ్‌స్టోన్ నుంచి కూడా కంపెనీ 10.4 కోట్ల డాలర్ల అదనపు రాబడి అంచనా వేస్తోంది. అనిశ్చిత పరిస్థితుల కారణంగా కంపెనీ ఈ ఏడాది ఆరంభంలో వేతనాల పెంపు చేపట్టలేదు. గత మూడు త్రైమాసికాల పనితీరు కూడా మార్కెట్ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో కంపెనీ భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి. మూడో త్రైమాసికం ఫలితాల సరళిపై బ్రోకర్లు, బ్రోకింగ్ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

దూసుకుపోయిన షేరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రోత్సాహకరమైన గైడెన్స్ ఇవ్వడంతో ఇన్ఫోసిస్ షేర ధర 17 శాతం మేర దూసుకుపోయింది. షేరు ధర ఒకే సెషన్‌లో ఈ స్థాయి వృద్ధిని చవిచూడటం ఇదే ప్రధమం. 392 రూపాయల వృద్ధితో షేరు ధర 2,712.60 రూపాయలను చేరింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు స్థాయిలో 1,55,766 కోట్ల రూపాయలకు చేరింది. ఒక్కరోజులోనే మార్కెట్ క్యాప్ 22,524 కోట్ల రూపాయలు పెరిగింది. ఐటి రంగంలోని మరో మూడు బడా కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఈ నెల 14న, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 17న విప్రో 18న ఫలితాలు ప్రకటించనున్నాయి.

- ప్రస్తుత త్రైమాసికంలో 6,000-9,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వనున్నారు.
- మూడో త్రైమాసికంలో కొత్తగా 7,499 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. రాజీనామాలను పరిగణలోకి తీసుకుంటే నికరంగా పెరిగిన ఉద్యోగుల సంఖ్య 977 మంది.
- గత త్రైమాసికంలో ఆఫ్‌సైట్ ఉద్యోగులకు 6 శాతం మేర వేతనాలు పెంచారు. నాలుగో త్రైమాసికంలో ఆన్‌సైట్ ఉద్యోగులకు 2-3 శాతం మేర జీతాలు పెంచే అవకాశం ఉంది.
- మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కొత్తగా 7 పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసింది. 

No comments