1

Breaking News

డీజిల్, వంటగ్యాస్ ధరలు

డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచే విషయం ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నదని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఇం కా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఆయిల్ ఉత్పత్తులను ఉత్పాదక ధరల కన్నా తక్కువకే విక్రయిస్తున్నందు వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఏర్పడుతున్న 1.6 లక్షల కోట్ల రూపాయల నష్టాలను తగ్గించడానికి ఈ రెండు ఉత్పత్తుల రేట్లు పెంచే విషయమై యుపిఎ సంప్రదింపులు జరుపుతున్నదని ఆయన తెలిపారు. ఆ వ్యవహారంలో ఆయిల్ మంత్రిత్వ శాఖ వైఖరి ఏమిటి, ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారు అన్నది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కేబినెట్ నిర్ణయాలేమిటన్నది చర్చించదగ్గ అంశం కాదన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు.

ఆర్థిక స్థిరీకకరణ ప్రణాళిక రూపకల్పనకు ఏర్పాటైన విజయ్ కేల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఎల్‌పిజి, కిరోసిన్ రేట్ల పెంపునకు ఆయిల్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తున్న నేపథ్యంలో మొయిలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. డీజిల్ ధర లీటరుకు నాలుగు రూపాయలు, కిరోసిన్ ధర రెండు రూపాయలు, వంటగ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు తక్షణం పెంచాలని కేల్కర్ కమిటీ తన నివేదికలో సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా వీటి ధరలను నెలవారీగా సవరించాలని కూడా సిఫారసు చేసింది. కేల్కర్ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని, అందులో పలు ప్రతిపాదనలు చేశారని చెబుతూ ఆ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని మొయిలీ చెప్పారు.

No comments