1

Breaking News

ఖైదీ నెంబర్ 7546

ఆదిలాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): వివాదస్పద వ్యాఖ్యల కేసులో మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అక్బరుద్దీన్‌ను మంగళవారం రాత్రి నిర్మల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఆయనను 7 గంటల పాటు విచారించారు. అనంతరం కొత్తగా ఐదు కేసులు నమోదుచేశారు. తర్వాత బుధవారం తెల్లవారు జామున 5.15 గంటలకు నిర్మల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ అక్బరుద్దీన్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాం డ్ విధించి ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. దీంతో అక్బరుద్దీన్‌ను బుధవారం ఉదయం 7.15 గంటలకు ఆదిలాబాద్ జైలుకు తరలించారు.

తనకు ఆరోగ్యం బాగోలేదని, గతంలో తనపై దాడి జరగడంతో ఒక బుల్లెట్ శరీరంలోనే ఉందని, ఒక కిడ్నీ మాత్రమే పని చేస్తోందని... మెరుగైన వైద్యం కోసం తనను చంచల్‌గూడ జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్‌కు అక్బరుద్దీన్ విన్నవించారు. చొక్కావిప్పి తన శరీరంపై ఉన్న గాయాలను మేజిస్ట్రేట్‌కు చూపించారు. అక్బరుద్దీన్ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అని, జైలులో భద్రతాపరమైన సమస్యతోపాటు, డయాలసిస్ సౌకర్యం ఆదిలాబాద్‌లో లేదని, అందువల్ల ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయవాదులు మళ్లీ పిటిషన్ దాఖలుచేశారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి వైద్యులతో మెరుగైన వైద్యం అందిస్తామని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు చెప్పడంతో అక్బరుద్దీన్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కొట్టేశారు. ఈ విషయమై హైదరాబాద్‌లోను, ఆదిలాబాద్ కోర్టులోను అప్పీల్ చేస్తామని అక్బర్ తరఫు న్యాయవాది బాలరాజు తెలిపారు. కాగా, అక్బర్‌ను 7 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలుచేసిన పిటిషన్‌పై గురువారం వాదనలు జరగనున్నాయి.

అక్బరుద్దీన్‌ను మంగళవారం రాత్రి విచారించిన పోలీసులు మరో ఐదు కేసులు నమోదు చేశారు. ఇంతకుముందు 121 (దేశద్రోహం), 153 (ఎ) (మత ఘర్షణలను ప్రేరేపించడం) సెక్షన్ల కింద కేసులు నమోదుచేసిన పోలీసులు విచారణ అనంతరం మరో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. 120-బి (నేరపూరిత వ్యాఖ్యలు), 124-ఏ (ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం), 295-ఏ, 505 (ఉద్దేశపూరితంగా మాట్లాడడం), ఐపీసీ 188 లాంటి కేసులు నమోదు చేశారు.

అక్బరుద్దీన్ అరెస్టును నిరసిస్తూ ఎంఐఎం ఇచ్చిన పిలుపుమేరకు నిర్మల్, భైంసాలలో పాక్షికంగా బంద్ జరిగింది. బంద్ సందర్భంగా భైంసాలో ఎంఐఎం కార్యకర్తలు ర్యాలీచేయగా, 144 సెక్షన్ అమలులో ఉండటంతో ర్యాలీని పోలీసులు మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. వందమంది ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. భైంసాలో కొన్ని దుకాణాలను మూసి ఉంచారు. నిర్మల్‌లో బస్సులు, థియేటర్లు యథావి«ధిగా నడిచాయి.

ఓబీ వ్యాన్లు, బస్సులపై దాడి
నిర్మల్ కోర్టు ఎదుట నిలిపిన సీఎన్ఎన్-ఐబీఎన్, ఆజ్‌తక్ చానళ్ల ఓబీ వ్యాన్లపై కొందరు దుండగులు రాళ్లు విసిరడంతో వాటి అద్దాలు ధ్వంసమయ్యాయి. నిర్మల్, మెట్‌పల్లి ఆర్టీసీ డిపోలకు చెందిన రెండు బస్సులపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఆ రెండు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. జనాన్ని చెదరగొట్టారు. మూడో రోజు నిర్మల్, ఆదిలాబాద్, భైంసాలో 144 సెక్షన్‌తో పాటు 30 పోలీసు చట్టాన్ని అమలుచేశారు.

హైకోర్టును ఆశ్రయిస్తాం
అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, మెరుగైన వైద్య సేవల కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించాలని తాము నిర్మల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అక్బరుద్దీన్ తరఫు న్యాయవాది బాలరాజు తెలిపారు. దీన్ని నిర్మల్ కోర్టులో తిరస్కరించారన్నారు. అక్బర్‌కు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయట్లేదని, డయాలసిస్ చేయాలంటే కచ్చితంగా హైదరాబాద్‌కు తరలించాల్సిందేనని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మెరుగైన వైద్య సేవలు లేనందువల్ల న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన తెలిపారు.

అక్బర్‌కు వైద్యపరీక్షలు
ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అక్బరుద్దీన్‌కు బుధవారం సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు జరిపారని, ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని సూపరింటెండెంట్ రాజేశ్వర్‌రావు తెలిపారు. ఒకవేళ ఏదైనా సమ స్య తలెత్తితే వైద్యుల బృందాన్ని రప్పిస్తామని చెప్పారు.

మరో రెండు కేసులు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బర్‌పై బుధవా రం మరో రెండు కేసులు నమోదుకాగా.. చర్యలు తీసుకోవాలని ఓ ఫిర్యాదు దాఖలైంది. కర్నూలు జ్యు డీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కర్నూ లు జిల్లా కేంద్రంలోను... అదే జిల్లా ఆదోని కోర్టు ఆదేశాల మేరకు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లోను కేసు లు నమోదయ్యాయి. మరోవైపు.. అక్బర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా రెండో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో రవి అనే న్యాయవాది ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై దర్యాప్తు జరిపి, కేసు నమోదు చేయాలని జడ్జి గోవిం దరెడ్డి కాజీపేట పోలీసులను ఆదేశించారు.

ఖైదీ నెంబర్ 7546
ఆదిలాబాద్ జిల్లా జైలు అధికారులు అక్బరుద్దీన్ ఒవైసీని సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారు. అక్బర్‌కు విచారణ ఖైదీనెంబర్ 7546ను కేటాయించారు. కాగా భద్రత రీత్యా ఆయనకు ప్రత్యేక గది కేటాయించారు. ఉదయం పులిహోర, నిమ్మరసం ఇచ్చారు. మ« ద్యాహ్నం రోటీతో పాటు అన్నం, రసం, కూరగాయలతో భోజనం తీసుకున్నారు. రాత్రి భోజనంలో రో టీ, కూర మాత్రమే తీసుకున్నారు. ములాఖత్ సమయంలో అక్బర్‌ను ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, ఆదిలాబాద్ పట్టణ నేత సిరాజ్‌ఖాద్రీ కలిశారు.

No comments