జనార్దన్ రెడ్డి గాలి ఇప్పుడు సినీ వాళ్లను కూడా తాకినట్లు
జనార్దన్ రెడ్డి గాలి ఇప్పుడు సినీ వాళ్లను కూడా తాకినట్లు ఉంది. అక్రమంగా గనులు తవ్వేసి తక్కువ కాలంలోనే లెక్కలేనంత సొమ్ము కూడబెట్టిన గాలి ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నా... ఆయన కహానీ మాత్రం త్వరలో సిల్వర్ స్ర్కీన్ మీద కనిపించనుందట. విడుదలకు సిద్ధంగా ఉన్న ఓ సినిమా ఆయన బాగోతాన్ని ఆధారంగా చేసుకోని తీసిందేనన్న ప్రచారం సినీ సర్కిల్ తో పాటు... రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఒకవేళ అదే నిజమైతే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపి... ఆశ్చర్యపోయేట్టు చేసిన అతిపెద్ద గనుల కుంభకోణాన్ని మనం సినిమాగా చూడబోతున్నట్లే.
గనుల్ని కొల్లగొట్టి కోట్లకి పడగలెత్తిన గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం మరోసారి తెరమీదకొచ్చింది. జైలు... బెయిల్ అంటూ ఎప్పుడూ వార్తల్లో ఉండే జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ వాళ్లని కూడా ఆకర్షించాడు. అందుకేనేమో గాలి చరిత్ర 70MM మీద కనిపించబోతుందని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.
గాలి జనార్దన్ రెడ్డి OMC అధినేతగా కన్నా రాజకీయ నాయకుడిగానే బాగా పరిచయం. ముఖ్యంగా కన్నడ రాజకీయాల్ని ఓ ఆట ఆడించిన వ్యక్తిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనార్దన్రెడ్డి సోదరుల గాలి బాగా వీచింది. యెడ్డీని గాలి సోదరులు ముప్పుతిప్పలు పెట్టిన తీరు రాజకీయ హైడ్రామాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ఎమ్యెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని పడగొట్టినంత పనిచేశారు బళ్లారి సోదరులు. గాలి బ్రదర్స్ ను దారిలో పెట్టడానికి సాక్షాత్తూ బీజేపీ అధిష్టానమే ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చేది. అద్వానీ దగ్గర్నుంచి సుష్మా స్వరాజ్ వరకు అందరూ కర్ణాటకకి క్యూ కట్టేవారు.
అయితే కోట్లకి పడగలేత్తిన వాళ్లు కూడా కాలం ముందు తలొంచక తప్పలేదు. సాగినంత కాలం బానే ఉన్నా... అక్రమ గనుల తవ్వకం వ్యవహారం బయటకొచ్చేసరికి గాలి సోదరుల ఆగడాలకి అడ్డుటకట్డ పడింది. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగానూ గాలి జనార్దన్ రెడ్డి కష్టాల్లో పడ్డాడు. సుప్రీం జోక్యంతో జైలు పాలయ్యాడు. ఇక OMC గనుల వ్యవహారం దేశ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇప్పటికీ ప్రభుత్వాల్ని శాసిస్తోంది. శాసనాల్ని కాలరాస్తోంది. పరిపాలనా వ్యవస్థల్ని తలకిందులు చేసేస్తోంది.
ఇంతటి సంక్షోభాన్ని సృష్టించిన కుంభకోణం ఇప్పుడు సెల్యూలాయిడ్ మీద కనిపించబోతుందట. గాలి బాగోతం పూర్తి స్థాయిలో... కొత్తకోణంలో 70MM స్కోప్ లో రాబోతుందట. గాలి వ్యవహారం బయటపడిన దగ్గర్నుంచి ఈ కథతో సినిమా తీస్తారనే ప్రచారం జరిగినప్పటికీ... ఇప్పటి వరకు విడుదలైన ఏ సినిమాలోనూ గాలి టాపిక్ రాలేదు. కాకపోతే ఇటీవల వచ్చిన ఓ చిత్రంలో సుంకులమ్మ ఆలయం గురించి కొన్ని సీన్లు ఉన్నాయో తప్ప అది జనార్దన్ రెడ్డికి సంబంధించిన కథ కాదని తేలింది. అయితే ఇప్పుడు విడుదల కాబోయే మూవీ మాత్రం పూర్తిగా గాలి జనార్దన్ రెడ్డి చరిత్రను ఆధారంగా తీసుకోని నిర్మించిందేనని గట్టిగా వినిపిస్తోంది.
నిజానికి ఇలాంటి వాస్తవ కథలంటే సినీ జనాలకు భలే మోజు. మనకి కాస్తా కొత్త కానీ... ఉత్తరాదిలో ఎప్పట్నుంచో ఈ ట్రెండ్ ఉంది. సంచలనం సృష్టించిన స్టోరీలూ, స్థానిక పరిస్థితులు చిత్రాలుగా అక్కడ వస్తూనే ఉన్నాయి. కాకపోతే హిందీ వాళ్లకు కుంభకోణాల కన్నా మాఫియా, ఎన్ కౌంటర్ల చుట్టూ తిరిగే కథలంటే కాస్త మక్కువ ఎక్కువ. మాఫియా ఆరాచకాల మీద 15 ఏళ్ల క్రితం సత్య తీసి రామ్ గోపాల్ వర్మ పెద్ద సంచలనమే సృష్టించాడు. ఇక సర్కార్ లాంటి చిత్రాలు ఉత్తరాది రాజకీయాలను చూపిస్తే... తర్వాత వచ్చిన అబ్ తక్ చప్పన్, షూటవుట్ ఎట్ లోఖండ్ వాలా ఎన్ కౌంటర్ల తీరుతెన్నులను ప్రతిబింబించాయి. వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సిరీస్ ఇవన్నీ మాఫియా గ్యాంగ్ లు.. పగలు, ప్రతీకారాల పరాకాష్టను చూపించిన సినిమాలే.
ఉత్తరాదితో పొల్చితే దక్షిణాదికి మాఫియా, ఎన్ కౌంటర్ల టచ్ కాస్త తక్కువే. అదే సమయంలో మన దగ్గర రాజకీయ వైకుంఠపాళి మజా మాత్రం చాలా ఎక్కువ. అందుకే ఇపుడు దక్షిణాదిలో భూకంపం సృష్టిస్తోన్న గనుల వ్యవహారం మీద మన దర్శకులు కన్నేశారు. మరి రాజకీయ ప్రకంపనలు రేకెత్తించిన గాలి జనార్దన్ రెడ్డి చరిత్ర సినిమాగా సిల్వర్ స్ర్కీన్ మీద ఎన్ని సంచనాలు సృష్టిస్తోందో చూడాలి.
వాస్తవగాథలు సినిమాలుగా రావడం కొత్త విషయమేమీ కాదు. రియాల్టీ షోల నుంచి రాజకీయాల వరకు ఆసక్తికరమైన ఏ విషయాన్నీ సినిమా వాళ్లు వదలరు. ఇప్పుడు ఈ వరసలోనే మరో రియల్ స్టోరీ రీల్ కెక్కబోతుందనే ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపిన గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారమే చిత్రంగా రాబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. మరి పాటతో ఊపేస్తోన్న ఆ బళ్లారి బావ గాలి జనార్దన్ రెడ్డేనా? తెరకెక్కబోతుంది ఆయన చరిత్రేనా? ఇంతకీ ఆ సినిమా ఏంటి... ఏ భాషలో రాబోతుందో...
గాలి జనార్దన్ రెడ్డి మీద సినిమా రాబోతుందనే విషయమ్మీద ప్రచారం సంగతి బానే ఉన్నా.... ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఏ భాషలో ఆ చిత్రం రాబోతుందనే విషయమ్మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కన్నడ గడ్డ అడ్డాగా జనార్దన్ రెడ్డి ఆరాచకాలు సాగించే సరికి చాలామంది అదేదో కన్నడ సినిమా అయింటుందని భావించారు. కానీ గాలి వ్యవహారం మీద సినిమా రాబోయేది తెలుగులోనే. ఫిల్మ్ నగర్ న్యూస్ ప్రకారం గాలి ఆగడాల మీద విడుదలకి సిద్ధంగా ఉన్న ఆ సినిమా కృష్ణమ్ వందే జగద్గురుమ్ అని గట్టిగా వినిపిస్తోంది.
ఇదే కృష్ణం వందే జగద్గురుమ్ కథ అంటూ ఓ స్టోరీలైన్ కూడా బయటికొచ్చింది. దాని ప్రకారం సినిమా అంతా గనుల మాఫియా చుట్టూనే నడుస్తుందట. కథ జరిగే ప్రాంతం కూడా ఆంధ్ర- కర్ణాటక బోర్డరేనట. సామాన్య జీవితం గడిపిన ఓ వ్యక్తి ఏళ్ల వ్యవధిలోనే లక్షల కోట్లు ఎలా వెనకేసుకొన్నాడు. గనుల అధిపతిగా ఎలా ఎదిగాడు? రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదగడం... తన అక్రమాలను ప్రశ్నించే వారిని అడ్డుతొలగించుకోవడం లాంటి విషయాలన్నీ ఈ సినిమాలో ఉంటాయట. మరీ మక్కీకి మక్కీ దించారన్న అనుమానం రాకుండా కొన్ని మార్పులూ చేర్పులూ చేసినా... కథ మాత్రం అదేనంటున్నాయి సినీ వర్గాలు.
అంతేకాదు జనార్దన్ రెడ్డి ఆగడాలను భరించలేని కొందరు స్థానికులు... గాలి కన్ను పడిన ఇతర గనుల యజమానులు అతని ఆరాచకాలను ఎలా బయటపెట్టారు. ఏళ్ల తరబడి పోరాటం చేసి వ్యవహారాన్ని సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లి జనార్దన్ రెడ్డిని నిందితుడిగా నిలబెట్టిన తీరు కూడా ఇందులో చూపించబోతున్నారట. దానికి తోడు సినిమాలో ఉన్న బళ్లారి బావా పాట ఊహాగానాలకి మరింత ఊతమిస్తోంది కూడా.
గాలి వ్యవహారాలన్నీ బళ్లారి కేంద్రంగానే జరిగాయి. ఓ రకంగా జనార్దన్ రెడ్డి బళ్లారిని తన ఎస్టేట్ గా మార్చేసుకొన్నారు. ఇప్పుడు బయటికొచ్చిన స్టోరీలైన్.. ఆడియోలో బళ్లారి బావ పాట ఊపేస్తుండటంతో అన్ని కలిసి గాలి జనార్దన్ రెడ్డి మీద సినిమా వస్తుందనే ప్రచారాన్ని మరింత బలపరుస్తోంది. ఆడియో విన్న తర్వాత సినీ వర్గాల్లోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఇపుడు ఇదే చర్చ. మరి ఆ బళ్లారి బావ గాలేనా కాదా అనేది త్వరలోనే తేలిపోనుంది.
నిజానికి సినిమాని మించిన మసాలాలు... దేశాన్ని ముంచిన తమాషాలు గాలి దగ్గర చాలానే ఉన్నాయ్. తానోక కారణ జన్ముడని.. అవతార పురుషుడినని భావించుకోనే జనార్దన్ అలా బతకడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. బళ్లారిని దాదాపు తన ఎస్టేట్ గా మార్చేసుకొన్నాడు. ఎంత సంపాదించమన్నది కాదు.. ఎలా సంపాదించమనే థియరీని గాలి బాగా ఆచరించాడు. విలాసంగా బతకాలనే కోరిక... డాబూ దర్పం ప్రదర్శించాలనే ఆరాటం గాలి చేత చాలా ఆరాచకాలే చేయించింది. వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించడం నుంచి తన కోసం వ్యవస్థలనే సవాలు చేయడం వరకు గాలి చేసిన చెరుపు అంతా ఇంతా కాదు.
గాలి జనార్దన్ రెడ్డి అంతులేని సంపదకే కాదు... అనేక సంచలనాలకి కూడా కేరాఫ్ అడ్రసే. అక్రమంగా సంపాదించదాన్ని అంతే దర్జాగా, విలాసంగా ఖర్చు పెట్టిన తీరు కూడా అందరి నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. ఇళ్లు, కార్లు, హెలికాఫ్టర్లు, లగ్జరీ బస్సు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, బంగారు సింహాసనం అబ్బో ఒక్కటేంటి... జైలుకెళ్లే దాకా సర్కారీ సొమ్ముతో గాలి అండ్ కో పడ్డ సోకులకు అన్నిఇన్నీ కావు.
ఇది గాలి జనార్దన్ రెడ్డి అద్దాల మేడ. ఈ భవనాన్ని చూస్తే కింగ్ ఆఫ్ ది కింగ్ లు కూడా డంగైపోవాలి. గాలి భవంతి ముందు స్వర్గంలో ఉండే ఇంద్రభవనం కూడా వెలవెలబోతుందేమో అన్నట్లు ఉంటుంది ఈ ఇల్లు. అక్రమ మైనింగ్ తో కోట్లాది కోట్లు సంపాదించిన జనార్దన్ రెడ్డి... తనకి తెలీకుండా గాలి కూడా లోపలికి చొరబడకుండా ఉండేంత జాగ్రత్తగా ఇంటిని కట్టించుకొన్నాడు. ఒకటా రెండు వందల కోట్లు విలువ చేసే 60 గదుల అధునాతన భవంతిలోకి ప్రవేశిస్తే... రాజుల కాలంలో ఉన్నామా అన్న భావన రావడం ఖాయమట. జనార్దన్ ఇంట్లో పెయింటింగ్ లు, బొమ్మలు, చివరకు మెట్లు కూడా లక్షల ఖరీదు చేసేవి. ఇక అడుగడుగునా నిఘా కెమెరాలు ఉండనే ఉన్నాయి. చెప్పాలంటే పుచిక పుల్ల దగ్గర్నుంచి ఫర్నీచర్ వరకూ గాలి ఇంట్లోని ప్రతీ వస్తువూ లకారాల్లోనే ఉంటుంది.
అప్పుడెప్పుడో జయలలిత ఇంట్లో దాడులు చేసినప్పుడు బయటపడిన సంపద చూసే దేశం విస్తుబోయింది. అయితే గాలి ఇంట్లో సీబీఐ సోదాలు జరిపినప్పుడు బయటపడ్డ వస్తువులు, సొమ్ము చూసి సగం ప్రపంచం అవాక్కైంది. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన బ్రూనై రాజు, సద్దాం హుస్సేన్, గడాఫీ లాంటి వాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేది జనార్దన్ రెడ్డి లైఫ్ స్టైల్. ఇక బంగారం అంటే గాలికి చెప్పలేనంత మోజు. పూజకు వాడే సామాగ్రి నుంచి తినే చెమ్చా వరకు గాలి ఇంట్లో కేజీల కొద్దీ బంగారు వస్తువులున్నాయని సీబీఐ దాడుల్లో బయటపడింది. పూజ చేసేటప్పుడు... తినే సమయాల్లో బంగారు కుర్చీల్లోనే కూర్చోవడం జనార్దన్ రెడ్డికి అలవాటట. నగల సంగతైతే చెప్పక్కర్లేదు. వజ్ర, వైడూర్యాలు పొదిగిన బంగారు సొత్తుని చూసి విస్తుపోవడం అధికారుల వంతైంది. అంతెందుకు గాలి ఇంట్లో కార్లు కడగడానికి కూడా బంగారు బిందెలు వాడతారట.
ఇక కార్లంటే దాని గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మార్కెట్లో కొత్త మోడల్ కారు ఏది రిలీజైతే అది గాలి వాకిట్లో ప్రత్యక్షమవ్వాల్సిందే. మెర్సిడెస్, బెంట్లీ, రోల్స్ రాయస్, ల్యాండ్ రోవర్ దగ్గర్నుంచి టయోటా వరకు ఏ హై ఎండ్ మోడల్ కారును జనార్దన్ రెడ్డి వదల్లేదు. ఈ కార్ల ధర హీనపక్షంగా మూడు కోట్లకు తక్కువ ఉండదు. దీనిబట్టే తెలుస్తుంది జనార్దన్ ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడే. గాలి దృష్టిలో ఖరీదు ముఖ్యం కాదు. ఇష్టమైనవి.. హోదాని చాటేవి తన దగ్గర ఉండాలనేది గాలి కాన్సెప్ట్. కార్ల ధరే కాదు... వాటిని పెట్టడానికి గ్యారేజ్ ఖరీదు కూడా కోట్లలోనే ఉంటుందట. వాటితో పాటు జనార్దన్ కి రెండు అత్యాధునిక ఫీచర్లున్న సొంత హెలికాఫ్టర్లు... ఓ లగ్జరీ బస్సు కూడా ఉన్నాయి. పగలోక హెలికాఫ్టర్.. రాత్రి మరో హెలికాఫ్టర్ వాడటం గాలి స్టైల్ సింబల్.
ఇవన్నీ ఒకెత్తు అయితే.. గాలి మనస్తత్వం మరో ఎత్తు. తాను సామాన్యుడిని కాదని.. కారణజన్ముడినని గాలి ఫీలింగ్. సాక్షాత్తూ శ్రీ కృష్ణ దేవరాయలి అంశలో పుట్టిన వాడిననే భావన జనార్దన్ రెడ్డికి విపరీతంగా ఉంది. గాలే ఈ విషయాన్ని స్వయంగా అనేకసార్లు చెప్పుకోన్నాడు. అందుకే రాయల వారిలానే బతకడానికే జనార్దన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆర్భాటాల విషయంలో ఎక్కడా తగ్గేవాడు కాదు. దీనికి బంగారు సింహసనమే ఉదాహరణ. ఈ కనక సింహసనం మీద కూర్చోని జనార్దన్ రాయలవారి ఫీలైపోయేవాడట. శ్రీ కృష్ణ దేవరాయలు బంగారు బెల్టులు ధరించే వాడో కాదో తెలీదు కానీ... గాలి మాత్రం బంగారు బెల్ట్ వాడేవాడట. దీని ఖరీదు 15 లక్షల రూపాయల పై మాటే. తన కోరికలు నెరవేరినప్పుడు దేవుణ్ని కూడా బంగారు కిరీటాలతో కొట్టడం గాలి స్టైల్.
ఏం చేసినా దర్జాగా చేయాలనేది గాలి ఫిలాసఫీ. అందుకే అక్రమంగా పొగేసుకొన్న సొత్తు వివరాలను కూడా లోకాయుక్తకి బహిరంగంగానే సమర్పించాడు. ఓ దశలో తన ఆస్తులు వెయి కోట్లకు పైనే ఉంటాయని వెల్లడించాడు. ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఈ స్థాయికి ఎదగడం చూసి మొదట్లో అంతా సుడి అనుకొన్నారు కానీ.. అది అదృష్టం కాదు ఆరాచకం అని తేలడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఏళ్లు తిరక్కుండానే గాలి పాపం పండింది. హంగూ, ఆర్భాటాలే గాలిని అడ్డంగా ఇరికించాయి. ఐదారేళ్లలోనే వేల కోట్లకి సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలు తన కోసం వ్యవస్థల్ని సవాల్ చేయడం వరకూ గాలి చేసిన చెరుపు అంతా ఇంతా కాదు.
ఇలా ఓ యాక్షన్ హారర్ బయోగ్రాఫిక్ సినిమాలకి ఏ మాత్రం తక్కువ కాని మసాలా దినుసుల్ని గాలి ఎప్పుడో నూరేశాడు. గాలి ఇల్లు మొదలు ఇలాకా వరకూ... వ్యక్తిగతం మొదలు అతను సాగించిన అరాచకం వరకూ అన్నీ సినిమాకి ఏ మాత్రం తగ్గని స్టోరీలే. మరి ఇంత మసాలా ఉంటే సినీ జనాలు మాత్రం ఉరకే ఉంటారా..? అందుకే తమ క్రియేటివిటీకి పదునుపెట్టి గాలి చరిత్రను సెల్యులాయిడ్ కి ఎక్కించారని వినిపిస్తోంది. అందుకే ఇపుడు గాలి చరిత్రపై సినిమా వస్తోంది అనగానే దక్షిణాది మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఏం చూపిస్తారా... ఎలా చూపిస్తారా అని ఆతృతతో అంచనాలు కడుతోంది.
No comments