1

Breaking News

రహేజా సంస్ధతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురైంది.

 రహేజా సంస్ధతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురైంది. రహేజా సంస్ధకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, రత్నప్రభ, మూర్తి, ఐపీఎస్ అధికారి గోపికృష్ణలపై ఏసీబీ దర్యాప్తుకు మార్గం సుగమమైంది.

రాజధానిలో అత్యంత ఖరీదైన ప్రాంతం మాదాపూర్‌... అక్కడున్న మైండ్‌స్పేస్‌ ఐటీపార్కులో కె.రహేజా సంస్థ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు దాదాపు రూ.608 కోట్ల మేరకు శఠగోపం పెట్టిందని, అనేకమంది ప్రభుత్వ అధికారులు సహకరించారని ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలైంది. గతంలో  ప్రభుత్వానికి, రహేజా సంస్ధకు మధ్య జరిగిన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఏపీఐఐసీ వాటాను కుదించిందని, ఉద్యోగాల కల్పనలో విఫలమైనా అడ్డదారిలో రాయితీలను రహేజా పెద్దలు సొంతం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వం కళ్లుగప్పి అనుబంధ సంస్థలకు కారుచౌకగా భూములను విక్రయించడంతో పాటు నిర్మాణ స్థలాలను నామమాత్రపు ధరకు విక్రయించడం ద్వారా ఏపీఐఐసీకి భారీగా నష్టం కలిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యాయవాది శ్రీరంగరావు వేసిన ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు కేసు నమోదు చేయాలని ఏసీబీ డైరక్టర్ జనరల్ ను ఆదేశించింది.

ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ నీల్ రహేజా, ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, వీరి అభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించి ఏసీబీ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. ఎమ్మార్‌ తరహాలో మైండ్‌ స్పేస్‌ సైబరాబాద్‌ ఐటీ పార్కులోనూ భారీఎత్తున అక్రమాలు జరగాయనే ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు గతంలో  ఆదేశించింది. .ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ పార్కు ఏర్పాటు, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ఏపీఐఐసీ, రహేజా సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన ఉమ్మడి సంస్థ (జేవీసీ) కె.రహేజా ఐటీ పార్కు ప్రైవేటు లిమిటెడ్‌కు 110 ఎకరాల భూమిని కేటాయించింది. రూ. కోటి మూలధనంతో చేపటిన్ట ఈ ప్రాజెక్టులో రహేజాకు 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమికి ఎకరం రూ.50 లక్షల చొప్పున ధర నిర్ణయించారు.ఈ ప్రాజెక్టు కింద 27,500 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించి, ఒక్కో ఉద్యోగానికి రూ. 20 వేల చొప్పున రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఏడేళ్ల తర్వాత భూమి ధరను సమీక్షించాలని, ఉపాధి కల్పన లక్ష్యాలు నెరవేరాకే జేవీసీకి సేల్‌ డీడ్‌ చేయాల్సి ఉంది. ఉమ్మడి సంస్థలో ఏపీఐఐసీ వాటాను తగ్గించడం, మళ్లించడం గానీ చేయరాదు.
.ఉమ్మడి సంస్థ (జేవీసీ) పేరిట రహేజా సంస్థ ఈ ఒప్పందాని అడుగడుక్కీ ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించింది. భారీగా అక్రమాలకు పాల్పడినట్లు, భారీగా నిధులను దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్‌ విచారణలోనూ వెల్లడైంది. ఏపీఐఐసీ అధికారులు, ఐటీ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప అవకతవకలను అడ్డుకోలేదని తేల్చింది.2003లో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రహేజా సంస్థ అయిదేళ్ల లోపే ఏపీఐఐసీ వాటాను 11 శాతం నుంచి 0.614కి కుదించింది. సంస్థ మూలధనాన్ని రూ.20 కోట్లకు పెంచి, అదనంగా రూ.2.11 కోట్లను చెల్లించాలని సూచించింది. ఈ మేరకు డబ్బు చెల్లించలేదని, అదనంగా భూమి ఇవ్వలేదని ఏకపక్షంగా వాటా తగ్గించింది. ఉమ్మడి సంస్థలో సభ్యునిగా అప్పటి ఏపీఐఐసీ ఎండీ ఆచార్య ఉన్నా, ఐటీ శాఖకు తెలిసినా దీనిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనివల్ల ఏపీఐఐసీ ఆదాయానికి భారీ ఎత్తున గండిపడింది. ఐటీ శాఖ, ఏపీఐఐసీ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు.

 ఏపీఐఐసీ వాటాను కుదించాక ఉమ్మడి సంస్థల వాటాల విక్రయాలకు పూనుకుంది. 40 శాతం షేర్లను సన్‌డ్యూ ప్రాపర్టీస్‌కు, మరో 40 శాతం షేర్లను ఇన్‌టైమ్‌ ప్రాపరర్టీస్‌కు విక్రయించడం వెనక దాని దురుద్దేశం బయటపడింది.రహేజా సంస్థ ఐటీ పార్కులో ఏపీకి చెందిన వారికి 27,500 ఉద్యోగాలను కల్పించాలి. ప్రతీ ఉద్యోగానికి రూ.20 వేల చొప్పున మొత్తం 55 కోట్ల మేరకు రాయితీ లభిస్తుంది. ఈ మేరకు 9,187 మంది ఉద్యోగులకు రెండేళ్ల గడువు పూర్తి గాకుండానే ఒక్కొక్కరి పేరిట రూ.20 వేల రాయితీగా రూ.18.37 కోట్లను పొందినట్లు తేలింది.ఏపీఐఐసీకి సంబంధం లేకుండానే రహేజా సంస్థ 12.15 ఎకరాలను అనుబంధ సంస్థలకు అతి తక్కువ ధరలకు విక్రయించింది. మార్కెట్‌ ధర రూ.25 కోట్లకు ఎకరం చొప్పున ఉండగా ఎకరం రూ.1.50 కోట్ల ధరతో ట్రియాన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌(ఇనార్బిట్‌ మాల్‌)కు 7.60 ఎకరాలు, చాలెట్‌ హోటల్స్‌ లిమిటెడ్‌కు 4.55 ఎకరాలను విక్రయించింది.రహేజా సంస్థ 4,44,035 చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని విక్రయించింది. మార్కెట్‌ ధర రూ.5000కి గజం ఉండగా దానిని రూ.2667కే విక్రయించడం మోసపూరితమని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

నిర్మాణ వ్యయమే అడుగుకు రూ.2500 చొప్పున ఉండగా దాన్ని రూ.2667కే విక్రయించడం నమ్మశక్యంగా లేదు. అనధికార వసూళ్ల ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఏపీఐఐసీకి నష్టం కలిగింది.ఐటీ పార్కు లేఅవుట్‌ అనుమతుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. సైబరాబాద్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (సీడీఏ) ద్వారా అనుమతులు పొందాల్సి ఉన్నా ఏపీఐఐసీనే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ 110 ఎకరాల లేఅవుట్‌కు అనుమతిస్తూ 2007 అక్టోబరు మూడో తేదీన జీవో నెం.735 జారీ చేసింది.ఏపీఐఐసీ జోక్యం లేకుండా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రహేజా ఏకపక్షంగా 109.36 ఎకరాలను విక్రయించి సేల్‌ డీడ్‌లు చేసింది. ఉపాధి లక్ష్యాలను సాధించాకే సేల్‌ డీడ్‌లు జరగాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఈ సేల్‌డీడ్‌లు అక్రమమని ఏపీఐఐసీ గుర్తించినా, వాటిని రద్దు చేయలేదు.ఏపీఐఐసీ నష్టపోయింది ఇలా...11 శాతం వాటాను 0.614కి కుదించాక ఏపీఐఐసీకి జరిగిన నష్టాల తీరిది.మొత్తం ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను 11 శాతం నుంచి 0.614కి కుదించడం ద్వారా రూ.566.52 కోట్లుఅనుబంధ సంస్థలకు తక్కువ ధరకు భూముల విక్రయాల్లో రూ.30.78 కోట్లు4,44,035 అడుగుల నిర్మాణ స్థలాల కారుచౌక విక్రయాల్లో రూ.11.39 కోట్లుమొత్తం నష్టం రూ.608.69 కోట్లుచర్యలేవీ?ఏపీఐఐసీని నిండా ముంచిన రహేజా సంస్థపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు అప్పట్లోనే ప్రభుత్వానికి అందచేసిన నివేదికలో పేర్కొన్నారు.

 ఈ వ్యవహారంలో ప్రేక్షక పాత్ర పోషించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సూచించింది. ఏపీఐఐసీకి 11 శాతం వాటాను పునరుద్ధరించాలని, ఆ సంస్థ జరిపిన సేల్‌డీడ్‌లను రద్దు చేయాలని, ఆ సంస్థ ఇప్పటికే 9,187 మంది ఉద్యోగులకు రాయితీ పేరిట అక్రమంగా పొందిన రూ.18.37 కోట్లను వసూలు చేయాలని సూచించింది. ఒప్పందాన్ని పునః సమీక్షించాలని, రహేజా సంస్థ సోదర సంస్థలతోనూ విడిగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. ఇందులో ఒక్కటీ అమలు కాలేదు. ఈ క్రమంలోనే శ్రీరంగరావు ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలే చేయడంతో  కేసు నమోదుకు ఏసీబీ కోర్టు ఆదేశించింది.

No comments