1

Breaking News

మా ఎన్నికల్లో మెగా హిట్



                           మా ఎన్నికల్లో   మెగా హిట్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ సూపర్ హిట్ కొట్టింది. మా ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ విజయం వెనుక మెగా ఫ్యామిలీ ఉంది. నేరుగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగకపోయినా… ఓటింగ్ లో మెగా కుటుంబ సభ్యులు పాల్గొనక పోయినా రాజేంద్రప్రసాద్ అనూహ్యంగా విజయం సాధించారు. ఈ విజయం వెనక చిరంజీవి పెద్ద కసరత్తే చేశారని ఫిల్మనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఓటరుకు స్వయంగా చిరుయే ఫోన్ చేసి రాజేంద్రప్రసాద్ కు ఓటేయాలని కోరినట్లు చెబుతున్నారు. అలాగే యువ హీరోలు… నటులకు రాంచరణ్ కూడా నేరుగా టచ్ లో ఉండి రాజేంద్ర ప్రసాద్ కు అండగా నిలిచారు. దీంతో చిరంజీవి, రాంచరణ్, నాగబాబుల కసరత్తు రాజేంద్రప్రసాద్ విజయానికి దోహదం చేసింది.
మురళీ మోహన్ పై  కోపమేనా?
ఓటింగ్ జరిగే సమయంలో మూడ్ ను బట్టి జయసుధ విజయం ఖాయమని అందరూ  భావించారు. రెండు దఫాలుగా మా అధ్యక్షుడిగా ఉన్న మురళీమోహన్ కు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. పొలిటికల్ గా, రియల్టర్ గా సక్సెస్ అయిన మాగంటికి చేదు అనుభం ఎందుకు ఎదురయింది? మురళీ మోహన్ ఒంటెత్తు పోకడలే జయసుధ ఓటమికి కారణమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిసారీ… ఏకగ్రీవంగా జరిగే ఎన్నికయ్యే మా కార్యవర్గానికి మురళీ మోహన్ వల్లే ఎన్నికలు అనివార్యమయ్యాయి. జయసుధను అకస్మాత్తుగా రంగంలోకి దించి మురళీ మోహన్ అందరీనీ ఆశ్చర్య పర్చారు. టాలివుడ్ లో పెద్ద స్గార్లు కూడా మురళీమోహన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కేవలం అధికార పార్టీ ఎంపీ అయినంత మాత్రాన మా ను ఎలా శాసిస్తారని ప్రశ్నిస్తున్నారు. జయసుధ నిన్న మొన్నటి వరకూ ఎమ్మెల్యేగా ఉండి… మా ఎన్నికల్లో మళ్లీ పదవి కోసం పోటీ చేయడమేంటంటున్నారు. జయసుధకు నందమూరి ఫ్యామిలీ అండగా నిలిచినా ఫలితం లేకపోయింది. స్వయంగా బాలకృష్ణ రంగంలోకి దిగి రాజేంద్రప్రసాద్ ప్యానల్ లో కొందరికి ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోవాలని కూడా కోరారు. అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ కూడా జయసుధ వెన్నంటే ఉంది. నందమూరి ఫ్యామిలీ ఎంత ప్రయత్నించినా రాజేంద్రప్రసాద్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. చివరకు మెగా ఫ్యామిలీకే విజయం లభించింది. పొలిటికల్, రియల్టర్ మాగంటికి ఎదురుదెబ్బే మిగిలింది. ప్యానెల్ లో ఎక్కువమంది జయసుధ ప్యానల్ వారే గెలిచినా… అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నిక కావడంతో నందమూరి, మాగంటి ఫ్యామిలీకి మా ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

No comments