1

Breaking News

ప్రధాని అభ్యర్థిగా మోడీ

గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ బాట పడుతున్నారా? అని పరిస్థితుల్ని గమనించినవారికి అర్థమవుతోంది. జాతీయ రాజకీయాల్లోకి మోడీ రావడం అనివార్యమని కూడా తెలుస్తోంది. ఇందుకు వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. 2014 ఎన్నికల్లో తమ నాయకుడిగా నరేంద్ర మోడీని చూపడానికి నిన్న మొన్నటివరకు విముఖత ప్రదర్శించిన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు తన వ్యతిరేకతను వదులుకుంది. బీజేపీలో మేధావి వర్గాలు మోడీని జాతీయ నాయకుడిగా చూపడానికి సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది.మోడీ పట్ల బీజేపీ ఢిల్లీ నాయకత్వం సానుకూలత ప్రదర్శించడం ఒక పరిణామమైతే, ఒక ఆరంభమైతే... గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రుడు ఎప్పుడు ఢిల్లీలో కాలుమోపుతారు? అక్కడ పార్టీలో ఆయన పాత్ర ఏమిటి? అన్నది తేలాల్సి ఉంది. మోడీని ప్రచార బృందం సారథిగా చేయాలని కొందరు భావిస్తున్నారు. మోడీ ఆలోచనలు కాస్త భిన్నంగా ఉన్నాయి.

రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు అన్ని అవరోధాలనూ తొలగించి, మార్గాన్ని సుగమం చేసేంతవరకూ గాంధీనగర్‌లోనే ఉందామని మోడీ అనుకుంటున్నారట.
గుజరాత్‌లో బీజేపీని మోడీ వరసగా మూడోసారి అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి మోడీ హ్యాట్రిక్‌ సాధించారు. ఇది జరిగి నెల కూడా కాలేదు. కానీ, ఇప్పటికే ఒక నినాదం ఆయన మద్దతుదారుల్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. ‘2012లో సిఎం, 2014లో పిఎం’ అని మోడీ మద్దతుదారుల్లో ప్రచారమవుతున్న నినాదం పార్టీ నాయకత్వం దృష్టిని కూడా ఆకట్టుకుంది.
ఇక బీజేపీలో మితవాద వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ధోరణి కూడా మారుతోంది. ఇదివరకు మోడీని వ్యతిరేకించిన ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద తలలు ఇప్పుడు...మోడీ విషయంలో బీజేపీ కార్యకర్తల్లో వెల్లువెత్తుతున్న ఉత్సాహాన్ని, హడావుడిని గమనిస్తున్నాయి. ఆయనను అడ్డుకోవడం ఎందుకు అన్న రీతిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సంఘ్‌ వర్గాలు చెబుతున్నాయి.

‘ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి మోడీకి గ్రీన్‌ సిగ్నల్‌ అందింది’ అని సంఘ్‌ కార్యకర్త ఒకరు చెప్పారు. ‘మోడీని ఏవిధంగా, ఎప్పుడు తెరమీదికి తీసుకు రావాలన్న అంశాన్ని సంఘ్‌ పార్టీ నిర్ణయానికే వదిలేస్తుంది’ అన్నారాయన.మోడీని జాతీయ స్థాయికి తీసుకురావడం అంచెలంచలుగా జరగవచ్చు. మొదట ఆయనను బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు నామినేట్‌ చేయవచ్చు. తర్వాత పార్టీ కేంద్ర ఎన్నికల ప్రచార కమిటీకి, వ్యూహరచన ప్యానెల్‌కు సారథిని చేయవచ్చు అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నిక ముగిసి, కొత్త టీం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ విషయం తేలవచ్చు. ఇదంతా బహుశ ఫిబ్రవరి ప్రారంభంలోనే జరగవచ్చు. అయితే, స్పష్టమైన హామీ పార్టీ నుంచి లభించకుండా నరేంద్రమోడీ అత్యున్నత బాధ్యతను స్వీకరిస్తారా అన్నది ప్రశ్న. ‘సగం సగం పనులు మోడీకి నచ్చవు. తన పాత్ర ఏమిటో స్పష్టమైన తర్వాత, తనను దింపుతున్న వారి ఉద్దేశాలేమిటో తేలిన తర్వాతే ఆయన యుద్ధరంగంలోకి దిగుతారు’ అని గుజరాత్‌ సిఎం సన్నిహితుడైన బీజేపీ నేత ఒకరు చెప్పారు.

ఇలా ఉండగా, మోడీ తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నారని అంటున్నారు. ఆరు నెలలపాటు గుజరాత్‌ వ్యవహారాలను చూసుకోవాల్సిన అవసరం తనకున్నదని మోడీ సీనియర్‌ బీజేపీ నాయకులకు చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవంక కాంగ్రెస్‌ పోకడల్ని కూడా బీజేపీ గమనిస్తోంది. ‘సాధారణ ఎన్నికల ప్రచారానికి రాహుల్‌గాంధీ సారథ్యం వహిస్తారు అని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. కానీ, యూపీఏ మూడోసారి అధికారాన్ని చేపట్టేట్టయితే ఆయనే తమ పార్టీ ప్రధానమంత్రి అని చెప్పడం లేదు. కానీ, మోడీనే మా నాయకుడవుతారు’ అని బీజేపీ నాయకుడొకరు చెప్పారు. ఎన్‌డీఏ మిత్రపక్షాల్లో జనతాదళ్‌ -యు వంటివి మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తే, బీజేపీ స్వతంత్ర నిర్ణయం తీసుకుంటుంది’ అని బీజేపీ నాయకుడొకరు అన్నారు. పార్టీలో మోడీకి కీలక పాత్ర ఇస్తే తను విడిపోతానని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఇప్పటికే సూచించారు.

No comments