1

Breaking News

అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు

అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ప్రకటించారు. బెంగళూరులోని శిక్షకర సదన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపిస్టులకు బెయిల్ దక్కకుండా చూసేలా చట్టానికి అవసరమైన సవరణలు చేయాలని న్యాయశాఖ నిపుణులను కోరామన్నారు.

రాష్ట్రంలో అత్యాచార ఘటనలకు బాధ్యులైన వారిపై గూండాచట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపిస్టులు శిక్షనుంచి తప్పించుకోకుండా చూస్తామన్నారు. మహిళలు చాలా చోట్ల వేధింపులకు, అన్యాయాలకు గురవుతున్నారని పేర్కొన్న సీఎం ఇంకా వీటిని సహించేది లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళా మో ర్చా అధ్యక్షురాలు రీనా ప్రకాశ్, చలన చిత్ర అకాడమీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ తార, ఎమ్మెల్సీ ఎస్.ఆర్.లీలా తదితరులు పాల్గొన్నారు. క్యాబినెట్‌లోని ఏకైక మహిళా మంత్రి శోభా కరంద్లాజే ఈ సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే ఆమె తరువాత సీఎంను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వయంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల పర్వం అడ్డూ అదుపులేకుండా కొనసాగుతూనే ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వీటినినియంత్రించే విషయంలో ప్రభుత్వ యం త్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ అంశంపై ఇంతకుముందే ముఖ్యమంత్రికి నాలుగుపేజీల సుదీర్ఘ లేఖ రాసినా దానికి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం ఆమె నేరుగా ము ఖ్యమంత్రిని కలిశారు.అత్యాచారాలకు పాల్పడే వారికి పురుషత్వం లేకుండా చేయడం వంటి కఠిన శిక్షలు విధించేలా తక్షణం ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.

చిక్కబళ్ళాపురకు చెందిన ఒక యువతిని దుండగులు ఢిల్లీ వ్యభిచారముఠాకు లక్ష రూపాయలకువిక్రయించారని,చిన్నారులపై బీజాపూర్‌లో అత్యా చారం జరిగిందని తెలిపారు. శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉందంటే ఇదేనా అని నిలదీశారు. శోభ మాటల దాడికి ఉక్కిరిబిక్కిరైన సీఎం గురువారం జిల్లా ఎస్పీల సమావేశాన్ని ఏర్పాటుచేసి తగిన ఆదేశాలు జారీ చేస్తానని మాట ఇచ్చారు. నగరంలో బుధవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా సమావేశం జరుగుతున్న తరుణంలో ఆ సమావేశానికి వెళ్ళకుండా శోభాకరంద్లాజే, ముఖ్యమంత్రితో భేటీ కావడం సర్వత్రా కుతూహలం రేకెత్తించింది. కాగా. ఈ విషయమై ఆమె వివరణ ఇస్తూ ఆహ్వానం అందనందునే తాను ఆ సమావేశానికి వెళ్ళలేదన్నారు.

No comments