పోలీసులకు పరీక్షా కాలం
ఇక నుంచి పోలీసులకు పరీక్షా కాలం ప్రారంభంకానుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత కనీసం దేహదారుడ్యాన్ని సైతం పట్టించుకోకుండా కొండల్లా పొట్టలు పెంచుకున్న పోలీసుల భరతం పట్టే ఉత్తర్వులను రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి జారీ చేశారు. ఆర్‌సి నెంబర్ 4037సి3 2012 కింద ప్రతి సర్కిల్ ఆఫీస్‌కు ఈ ఉత్తర్వులు బుధవారం అందాయి. ప్రతి నెల మొదటి ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ స్ధాయి నుండి ఎఎస్‌ఐ వరకు దేహదారుడ్య పరీక్షలతో పాటు మెంటల్ ఎబిలిటీపైనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. అధిక బరువు కల్గిన పోలీస్ ప్రతి నెల తప్పనిసరిగా ఒక కేజీ వంతున తగ్గితీరాలని అందులో నిర్ధేశించారు. ప్రతి నెల నిర్వహించే వ్రాత పరీక్షను 100 మార్కులుగా నిర్ణయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాండేటరీపై 30 మార్కులు, ఐపిసి, సిఆర్‌పిసిపై 30 మార్కులు, పోలీస్‌స్టేషన్ ఎఫ్‌ఐఆర్‌పై 20 మార్కులు, ఇండియన్ ఎవిడెన్స్‌యాక్టుపై 10, జనరల్ నాలెడ్జ్‌పై 10 మార్కులు ఉంటాయి. ఇందులో తప్పనిసరిగా 50 మార్కులు తెచ్చుకోవాలి. ఇక దేహదారుడ్య విషయానికి వస్తే 3.2 కిలో మీటర్లను 30ఏళ్ళలోపు పోలీసులు 17 నిమిషాల్లో పరుగెత్తాలి. 40ఏళ్ళలోపు వారు 20 నిమిషాల్లోను, 50 సంవత్సరాల్లోపు వారు 25 నిమిషాల్లోను, 50 సంవత్సరాల పైబడిన వారు 30 నిమిషాల్లోను ఆ దూరాన్ని తప్పనిసరిగా అధిగమించాలి. సిట్ ఆఫ్స్, పుష్‌ఆఫ్స్, చిన్ ఆఫ్స్, డ్రిల్ కూడా చేయాలని సర్క్యూలర్‌లో నిర్ధేశించిన విధంగా చేయాలని పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో క్వాలిఫై కాని వ్యక్తులు తదుపరి నెలలోనైనా పాస్ కావాల్సి ఉంటుందని, అలా కూడా చేయని వ్యక్తులపై చర్యలు తప్పవని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. ఈ సర్క్యూలర్ పోలీసుల్లో గుబులు రేపుతోంది. ఈ విధానానికి సృష్టికర్త అడిషనల్ డిసి వికె సింగ్. గతంలో ఆయన ఆంధ్ర రీజియన్ ఐజిగా పని చేసినప్పుడు మైత్రి సదస్సులను రూపొందించారు. ఇప్పటికే అవి పూర్తిస్ధాయిలో అమలవుతున్నాయి. ఈ విధానంతోనే వికె సింగ్ పోలీసుల్లో దేహదారుడ్యంతో పాటు మెంటల్ ఎబిలిటీ తప్పనిసరిగా ఉండాలన్న ఆలోచనకు డిజిపి దినేష్‌రెడ్డి ఆమోదం తెలిపారు. దాంతో వచ్చే ఆదివారం నుంచే పోలీసులకు పరీక్షా కాలం ప్రారంభమవుతుందన్న మాట.
No comments