ఎంత దారుణం..
ఎంత దారుణం..
దళారుల చేతిలో మోసపోతున్న వ్యాపారులు..
ప్రతి బస్తా పై దారుణమైన మోసం..
మోసపోయేది రైతు, వినియోగదారుడే..!
శ్రీకాకుళం జిల్లా తెల్ల బంగారం జీడిపప్పు. ఈ పేరు వింటేనే నోరు ఊరుతుంది. తెల్లని ఘన పదార్ధం కళ్లముందు కదలాదుడుతుంది. నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయే జీడిపప్పు ఉత్పత్తి వెనుక ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే.. రైతులు, వ్యాపారులు పడుతున్న బాధలు, నష్టపోతున్న వైనం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మోసం చేసే దళారి ఇక్కడ కూడా తయారయ్యాడు. కష్టం ఒకరిదైతే సుఖం వేరొకరిదవుతున్న చందం జీడి రైతులది.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీ బుగ్గ మున్సిపాలిటీ ఇది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ, టెక్కలి రెవెన్యూ డివిజన్ పరిధి మొత్తంలో 500 జీడి పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఒక్కో చిన్న తరహా పరిశ్రమ నుంచీ రోజుకు 5 నుంచీ 10 బస్తాలు, పెద్ద తరహా పరిశ్రమల నుంచీ వంద బస్తాల వరకూ జీడి పిక్కలు(బస్తా ఎనభైకిలోలు) నుంచీ జీడి పప్పును ఉత్పత్తి చేస్తారు. ఇలా ఇక్కడి నుంచీ 20 టన్నుల జీడి పప్పు ఎగుమతులు అవుతున్నాయి. ఇరవై వేల మంది కార్మికులు, రెండు వేల మంది వ్యాపారులు, వేల ఎకరాల్లో పైగా ఉన్న జీడి పంట విస్తీర్ణం ఉంది.ఈ పరిశ్రమ ఇక్కడ వందల ఏళ్లుగా కొనసాగుతోంది. పలాస జీడిపప్పు అంటే మార్కెట్లో చాలా గిరాకీ. ఉత్తరాంధ్ర తెల్లబంగారంగా చెప్పుకునే జీడిపప్పుకు కష్టాలు అన్నే ఉన్నాయి.
జీడి పంట పండిన దగ్గర్నుంచీ దాని కష్టాలు ఒక్కొక్కటిగా రైతును వెంటాడతాయి. మంచు, ఎండ, వాన.. ఈ మూడు కాలాల్లో జీడి పంట పండే అవకాశం ఉంది. ఆయా కాలాల ప్రభావం కూడా పంట పై పడుతుంది. ఒక సారి దిగుబడి ఎక్కువగా వస్తే.. ఒక్కోసారి ఆశించిన స్థాయి కన్నా తక్కువగా వస్తుంది. పంట దిగుబడి బాగున్నా.. బాగోకపోయినా.. రైతులకు కష్టాలు తప్పవు. పంట చేతికి వచ్చే దాకా ఓ బాధ.. వచ్చిన తర్వాత ఓ బాధ రైతులు వెన్నాడతుంది. జీడి పిక్క చేతికి వచ్చిన వెంటనే రైతులు వాటిని కోసి బస్తాల కెక్కిస్తారు. ఒక ఎనభై కిలోల బస్తా రేటు 6500 గా ప్రస్తుతం విక్రయిస్తున్నారు. సాధారణంగా 10 నుంచీ 15వేల వరకూ బస్తాను గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చు. కానీ.. దళారీ మాయా జాలం కారణంగా రైతు ఆరు వేలు, మహా అయితే ఏడువేల కన్నా.. ఎక్కువకు అమ్ముకోలేని పరిస్థితి.
రైతులు ఎందుకలా అమ్ముకోవాలి..? అసలు మీరెందుకు దళారీని డిమాండ్ చేసి ధర సాధించుకోలేరు..? అని ఎన్టీవీ ఇలా ప్రశ్నించింది. దానికి వారు చెప్పే సమాధానం కూడా చూశారు కదా. రుణం ఇచ్చిన దళారీ మాటే వారికి వేదం. అప్పు ఇచ్చిన దళారీ చేతికే రైతు తన కష్టాన్ని ధార పోస్తున్నాడు. ఓ రకంగా తెల్లదొరల సంప్రదాయాన్ని దళారీ ఇక్కడ సృష్టించి రైతుల్ని నిలువునా వంచిస్తున్నాడన్నది కఠోర వాస్తవం.
ఇక వ్యాపారుల విషయానికి వస్తే.. వారినీ దళారి మింగేస్తున్నాడు. దళారుల మోసం జీడి రైతుల్నే కాదు.. జీడి వ్యాపారుల్ని కారు చీకట్లలోకి తోసేస్తోంది. ముప్పై ఏళ్ల నుంచీ భారీ సంక్షోభం దిశగా జీడి మార్కెట్ నడుస్తోంది. దిగుబడి భారీగా ఉన్నా.. ధర దిగజారిపోతూ వస్తోంది. ఒక పక్క వినియోగదారుడి పై పోటు పడుతున్నా.. వ్యాపారి నష్టపోతున్నాడు. ఒక్కోసారి ఎగుమతులు నిలిచిపోవడం, విదేశీ జీడి అమ్మకాలు ఊపందుకోవడంతో.. నాణ్యమైన పలాస మార్కెట్ ఇప్పుడు యాభై కోట్ల మేర నష్టపోతోంది.
విదేశీ జాడ్యం ఇక్కడి జీడి కేంద్రానికి అంటుకుంది. దేశీయ జీడి పరిశ్రమ ఎగుమతులు కుంటుపడటం, శ్రీకాకుళం నుంచీ కావాల్సినంత మేర జీడి పప్పు ఉత్పత్తి కాకపోవడంతో విదేశీ జీడిపప్పు ఇక్కడ రాజ్యమేలుతోంది. వ్యాపారుల వద్ద టన్నుల కొద్దీ దేశవాలీ పప్పు నిల్వలు ఉండిపోతున్నాయి. ఇక్కడి పప్పు కంటే.. విదేశీ పప్పు కళ్లకు ఇంపుగా కనపడుతుంది. అయితే రుచి విషయంలో ఇక్కడి జీడి పప్పుకు అది దిగదుడుపే. కానీ నయనానందానికే పెద్ద పీట వేసే ఈ కాలంలో ఇక్కడి రుచి ఎవరికి వంటబడుతుంది లెండి.. అంటూ వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. ఒక్కోసారి రూపాయి విలువ పడిపోతుంటుంది. ఆ సమయంలో కూడా నష్టపోయేది జీడిపప్పు రైతులు, వ్యాపారులే. మధ్యలో ఉన్న దళారీ వ్యవహారం మాత్రం మూడు పూవులు ఆరు కాయలుగా సాగిపోతోంది.
జీడిపప్పు రేట్లు
నాణ్యత స్థాయి కిలో
నెంబర్ 1 600
నెంబర్ 2 550
నెంబర్ 3 485
బద్ద నెంబర్ 1 500
బద్ద నెంబర్ 2 440
బద్ద నెంబర్ 3 390
పై ధరలు చూశారుగా.. జీడిపప్పు నిజంగా తెల్లబంగారమే. కానీ ఇందులో నష్టపోతున్నది, లాభపడుతున్నది ఎవరు..? కనీసం కిలోకు 85 నుంచి 100 రూపాయల మేర వ్యాపారులకు నష్టం కనిపిస్తోంది. ప్రభుత్వం గిట్టుబాటు కల్పిస్తే కానీ.. ఈ లోపాలు సరిదిద్దుకోలేని పరిస్థితి. వరికి గిట్టుబాటు ధర ఇవ్వడానికే గింజుకుంటున్న ప్రభుత్వం ముప్పై ఏళ్లుగా పోరాడుతున్న తమ మొర ఎందుకు వింటారని రైతులు ఎద్దేవా చేస్తున్నారు.
.
ఇక వారికి ఈ పరిశ్రమ కారణంగా వచ్చే రోగాలు ఎక్కువే. కిడ్నీ రోగాలు ఎక్కువే. బాయిల్ పద్ధతి కారణంగా వచ్చే అనర్ధాల కన్నా.. రోస్టింగ్ పద్ధతి వల్ల వచ్చే రోగాలే ఎక్కువ. ఇన్ని కష్టాలు పడే రైతుకు కనీస రుణాలు గాని, ఆసుపత్రులు గానీ, ఏవీ లేవు. ఇదే దళారులకు అనువుగా మారిపోయింది. రైతు ఏది చేయాలన్న దళారీ ఒక్కడే అక్కడ కనిపిస్తాడు. దీంతో వారు మరో దిక్కులేని పరిస్థితిలో దళారీ బారిన పడక తప్పడం లేదు. ఎంత దూరంగా ఉందామన్నా.. అటు ప్రభుత్వం ఆదుకోక.. ఇటు ఆర్ధిక స్తోమత లేక జీడి రైతు దళారీ మోసానికి తలొగ్గక తప్పడం లేదు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటే తప్ప రైతు కోలుకునే పరిస్థితి లేదు.
No comments